Telangana Budget : ఆదాయం, అప్పులన్నీ కిస్తీ చెల్లింపులకే హరీ.. సంపద సృష్టి ఎలా?
బడ్జెట్ ప్రతిపాదనలు పరిశీలిస్తే సంపద సృష్టిస్తాం.. సంక్షేమానికి ఖర్చు చేస్తామనేది ప్రజలను ఆకర్షించే నినాదంగానే మారిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చివరకు ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరిందన్న చర్చ జరుగుతోంది.

- 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో సంపద సృష్టికి 36504 కోట్లు మాత్రమే
- అధికారంలో ఎవరున్నా ఏటేటా పెరుగుతున్న అప్పులు
- సంపద పెంచి, ప్రజలకు పంచుతామనేది ప్రజలను ఆకర్షించే నినాదమేనా!
- అప్పులు తేబోమని ప్రకటించిన సీఎం రేవంత్
- 76 వేల కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్‌లో వెల్లడి
- తెచ్చే అప్పులెక్కువ.. తీర్చేది తక్కువ
- పథకాల అమలు సరే.. ఉద్యోగులకు బకాయిలు ఇవ్వలేని స్థితి
(విధాత ప్రత్యేకం)
Telangana Budget : ఏ కుటుంబంలోనైనా వ్యాపారం చేయాలన్నా.. లేదా ఇల్లు కట్టాలన్నా అంత డబ్బు ఒకేసారి చెల్లించే పరిస్థితి ఉండదు కాబట్టి బ్యాంకులో రుణం తీసుకొంటారు. ఆ తరువాత వచ్చిన ఆదాయంతో ఆ అప్పు కిస్తీల పద్ధతిలో తీర్చి రుణ విముక్తులవుతారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఏటా తీర్చే అప్పు కంటే చేసే అప్పే ఎక్కువగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు రూ.75 వేల కోట్ల అప్పు మాత్రమే ఉంటే రాష్ట్రం ఏర్పడిన తరువాత 11 ఏళ్లలోనే ఆరు లక్షల కోట్ల అప్పు చేశారు పాలకులు. ఫలితంగా ప్రతి ఏటా వడ్డీలు, అసలు కిస్తీలు చెల్లించడానికే అలవి కాని అప్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు 65 ఏళ్లలో చేసిన అప్పులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కొలువు దీరిన బీఆరెస్ ప్రభుత్వం, ఏడాది కాలంగా రాష్ట్రానికి పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికే అంత కంటే రెట్టింపు అప్పులు చేశాయి. అప్పులు తేవడంతో పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.1.52 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ మేరకు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2024 నవంబర్ వరకు రూ.1.24 లక్షల కోట్లు తెచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క లిఖిత పూర్వకంగా తెలిపారు. ఆ తరువాత డిసెంబర్ నెలలో రూ.13,909 కోట్లు, జనవరి నుంచి మార్చి 11 వరకు రూ.14,800 కోట్లు రుణం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు లెక్కలు చెపుతున్నాయి. 15 నెలల్లోనే రూ. 1.52 లక్షల కోట్లు అప్పు తీసుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం అప్పులు, వడ్డీల కింద చేసిన చెల్లింపులు రూ.54,359.45 కోట్లు దాట లేదని బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తే అర్థం అవుతున్నది.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
శాసన సభకు సమర్పించిన బడ్జెట్ పద్దుల్లో అప్పులు రూ.64 వేల కోట్ల వరకే తీసుకున్నట్లు చూపించిన ప్రభుత్వం.. శాసన మండలిలో ఇచ్చిన సమాధానంలో నవంబర్ వరకే రూ.1.24 లక్షల కోట్లని చెప్పడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే చేసే అప్పులకు చూపించే పద్దులకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెటేతర అప్పులే ఎక్కువగా చేస్తున్నాయన్న విమర్శలకు ఈ స్టేట్‌మెంట్ బలం చేకూర్చుతున్నదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.76 వేల కోట్ల రుణాలు సేకరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. చేసిన అప్పులకు వడ్డీ, అసలు కిస్తీల చెల్లింపులకు రూ.60 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. కానీ ఏడాది ముగిసే సమయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకున్నదానికంటే రెట్టింపు అప్పులు చేస్తున్నారు. కానీ బడ్జెట్‌లో ప్రకటించిన దానికంటే అదనంగా ఒక్క రూపాయి కూడా పాలకులు అప్పులు తీర్చడం లేదని బడ్జెట్ ప్రతిపాదనలు పరిశీలిస్తే అర్థం అవుతున్నది.
చెప్పిందొకటి.. చేస్తున్నది మరోటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఇక అప్పులు చేయను.. చేసిన అప్పులు తీరుస్తానని ప్రకటించారు. కానీ బడ్జెట్ పద్దులు పరిశీలిస్తే ముఖ్యమంత్రి చెప్పిన దానికి భిన్నంగా అప్పులు తెస్తామన్న విషయం ఉంది. సహజంగా ఏ ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ అధికారులు కానీ ముఖ్యమంత్రి నిర్ణయానికి భిన్నంగా ప్రతిపాదనలు చేయరు.. అలాంటి సాహసం ఎవ్వరూ చేయరు. దీనిని బట్టి పరిశీలిస్తే ముఖ్యమంత్రి చెప్పిన దానికి, చేసే దానికి చాలా తేడా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తతమవుతున్నది. ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించే సమయానికైనా ఈ మార్పులు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
అది ప్రజాకర్షక నినాదమేనా?
బడ్జెట్ ప్రతిపాదనలు పరిశీలిస్తే సంపద సృష్టిస్తాం.. సంక్షేమానికి ఖర్చు చేస్తామనేది ప్రజలను ఆకర్షించే నినాదంగానే మారిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చివరకు ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల్లో గెలుపొందడానికి అనేక ఆకర్షణీయమైన పథకాలను అమలుచేస్తామని ప్రకటించారు. తీరా వాటి అమలుకు మల్లగుల్లాలు పడుతున్నారు. నేరుగాప్రజలకు డబ్బులు పంపిణీ చేసే విధానానాలు ఎంత మేరకు సరైనవో పాలకులకే తెలియాలి. కానీ అప్పు చేసి పప్పు కూడా అన్న తీరుగా పాలకులు అడ్డగోలుగా అప్పులు చేసి వివిధ పథకాల కింద నగదు బదిలీలు చేస్తున్న తీరు ఉందన్న చర్చ జరుగుతోంది. అప్పులు చేసి సంపద సృష్టిస్తున్నామని చెపుతున్న పాలకులు 2024-25 సంవత్సరంలో ఆస్తుల సృష్టికి చేసిన ఖర్చు (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) రూ.33,087.85 కోట్లు మాత్రమే. 2025-26లో అసెంబ్లీకి సమర్పించిన రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద పొందు పరిచింది రూ.36,504.45 కోట్లు మాత్రమే. లక్షల కోట్ల బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కు జరిగిన కేటాయింపులు, చేసిన ఖర్చులను పరిశీలిస్తే పాలకుల తీరు నవ్వి పోదురు గాక నాకేంటి.. అన్న తీరుగా ఉందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.