Formula e-Car Race | లొట్టపీసు కేసులో కేటీఆర్‌కు జైలు తప్పదా? పకడ్బందీగా కేసు.. అందుకే గవర్నర్ అనుమతులు!
లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ చెబుతూ వచ్చిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఆయనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆయనను ఏసీబీ అధికారులు మళ్లీ విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Formula e-Car Race | ‘లొట్టపీసు కేసు..’, ‘లొట్టపీసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’, ‘ఫార్ములా ఈ–రేసు కేసుకు భయపడేది లేదు’, ‘జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే’ అంటూ మాజీ మునిసిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పలుమార్లు మీడియా ముందు శివాలెత్తారు. అదే లొట్టపీసు కేసు కేటీఆర్ మెడకు చుట్టుకుని ముప్పు తిప్పలు పెట్టే అవకాశాలు ఉన్నాయని, ఇక తప్పించుకోలేరని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పచ్చజెండా ఊపడంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టేనని అంటున్నారు. విచారణలో ఆలస్యమైనా అంతా చట్టబద్ధంగా జరుగుతోందని, తప్పించుకోవడం అసాధ్యమనే వాదనలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. గవర్నర్ అనుమతించడంతో చార్జ్‌షీట్ దాఖలు చేసి, విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేయడమే తరువాయి అంటున్నారు. మొన్నటి వరకు ఈ ఫార్ములా కేసు లొట్టపీసు కేసు…రేవంత్ రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి, అర పైసా కూడా అవినీతికి పాల్పడలేదు, కేసులకు, జైలు జీవితానికి భయపడేది లేదని కేటీఆర్ మీడియాలో శివాలెత్తారు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని, హైదరాబాద్ కు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, క్విడ్ ప్రో కో లేనే లేదని కేటీఆర్ అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచాను, లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ గొప్పలు చెప్పారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతించడంతో బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేమో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నమంటూ ఆక్రోశిస్తున్నారు.
విచారణకు ఆదేశించడంతో గుట్టు రట్టు
2023 చివరలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ–కారు రేసు నిర్వహణ, నిధుల దుర్వినియోగం, విదేశాలకు మళ్లింపుపై విచారణకు ఆదేశించింది. ఈ కేసు ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకుంది. ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపిన తరువాత 70 రోజులకు అనుమతి లభించింది. ఈ కేసులో ఏ2 గా ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇంకా అనుమతి రాలేదు. ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఫార్ములా ఈ రేసు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) త్వరలో చార్జ్‌షీటు దాఖలు చేయనున్నదని సమాచారం. దీంతో కేటీఆర్ పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏసీబీ కి మార్గం సుగమం అయ్యిందని అంటున్నారు. చార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనున్నది. అప్పటి మునిసిపల్ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిశోర్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ఏసీబీ డిసెంబర్ 2024 లో కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్‌ను ఏ1 గా, అర్వింద్ కుమార్ ను ఏ 2, ఏ3 గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్.రెడ్డి పేర్లను నమోదు చేశారు. విచారణలో భాగంగా కేటీఆర్ ను రెండు సార్లు, అర్వింద్ కుమార్ ను మూడు సార్లు ఏసీబీ విచారించింది.
ఈ కారు రేసుతో జనం ఇబ్బందులు
తెలంగాణ సచివాలయం ముందు ఉన్న ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్థంగా మారి వాహనదారులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. నగరం బయట నిర్వహించాల్సిన పోటీలు నగరం నడిబొడ్డున నిర్వహించడం ఏంటని పలువురు బహిరంగంగానే విమర్శించారు. రోజుల తరబడి ప్రజలు అవస్థలు పడ్డారు. సచివాలయం చుట్టూ ఐదారు కిలోమీటర్ల రేడియస్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇక్కట్ల పాలయ్యారు. వాహనాలను నియంత్రించలేక ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఫార్ములా ఈ రేసు కేసు నిర్వహణ కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలతో తెలంగాణ మునిసిపల్ వ్యవహారాల శాఖ 2022 అక్టోబర్ 22వ తేదీన ఒప్పందాలు చేసుకున్నాయి. కారు రేసు నిర్వహించేందుకు వీలుగా సచివాలయం ఎదుట ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలి. ఈ ట్రాక్ నిర్మాణం కోసం హెచ్ఎండీఏ రూ.12 కోట్లు 2023 ఫిబ్రవరి నెలలో ఖర్చు చేసింది. రేసు నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఏస్ నెక్ట్స్ జెన్ భరించింది. ఇందులో ప్రధాన నిధుల వ్యయంపై రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లేకపోవడం, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకపోవడం, సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు నిధులు చెల్లించడం, ఎన్నికల్ కోడ్ వంటి అంశాలు కీలకంగా మారాయి. అప్పటి మంత్రి కేటీఆర్‌తో చేసిన వాట్సప్ చాట్‌లను సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏసీబీ అధికారులకు అందచేశారంటున్నారు. దీంతో కేటీఆర్ తప్పించుకోకుండా పీకల్లోతు కూరుకుపోయినట్లేనని చెబుతున్నారు.
పీసీ యాక్టు సవరణలతో ఆలస్యం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ –1988కు 2018 సంవత్సరంలో అనేక సవరణలు చేసింది. ప్రజా ప్రతినిధులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థల నియమావళికి అనుగుణంగా అవినీతికి వ్యతిరేకంగా ఈ సవరణలు తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని ముందుకు వెళ్ళక తప్పడం లేదు. కేటీఆర్ ను విచారించేందుకు తొలుత అనుమతులు తీసుకున్నారు. ఇప్పుడు చార్జ్‌షీట్ వేసేందుకు కూడా గవర్నర్ అనుమతించారు. గవర్నర్ అనుమతులు లేకుండా కేసులు పెడితే వెంటనే న్యాయస్థానాల నుంచి బెయిల్ లభిస్తుందని, కేసు నుంచి తప్పించుకునేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే వెల్లడించిన విషయం తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram