CM Revanth Reddy | రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై రెఫరెండంగా చెప్పిన నాయకుడు.. మళ్లీ నోరేసుకుని తిరుగుతున్నాడని బీఆరెస్ నేత కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీఆరెస్‌పై నిప్పులు చెరిగారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
CM Revanth Reddy | ‘మీరు అండగా నిలబడితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడుతా, ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా, అడుగడానికి వెనుకాడను, రాక పోతే కొట్లాడడానికి అసలే భయపడను’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన బాధ్యతగా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు ఎన్నిసార్లైనా వెళతానని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతకైనా సిద్ధమని, ఎవరితోనైనా కలిసేందుకు, ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్ధమన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం గట్టి హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రజాపాలనోత్సవాల సందర్భంగా నర్సంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఎలా అభివృద్ధి చేస్తున్నామో చూడండి, మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మళ్ళీ వస్తా, మీ అభివృద్ధి గురించి మరోసారి మాట్లాడుతానంటూ సీఎం చెప్పారు.
రెఫరెండమన్నోడికి సిగ్గులేదు
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకరు తీట నోటేసుకుని, ఈ ఎన్నికలు రెఫరెండమంటూ ఇంటింకి తిరిగాడని, రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తమంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్‌ను జూబ్లీ హిల్స్ ప్రజలు బండకేసి కొట్టారు. అయినా సిగ్గులేనోడు కనీసం నెలరోజులైనా ఇంట్లే పడుకోవాలే కదా? మళ్ళీ పెంట నోరేసుకుని తిరుగుతున్నారు’ అని మండిపడ్డారు. ‘మళ్ళీ పంచాయతీ ఎన్నికలొచ్చాయి.. ఈ ఎన్నికల్లో మా అక్కలు సలాకే కాల్చివాత పెడుతరో, మా పిల్లలు కోదండమేసి కొడ్తరో’ అంటూ ఎద్దేవా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు.. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులు దిక్కులేదు… జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బండకేసి కొట్టారు. అయినా వారి బుద్ధి మారుతలేదు’ అని బీఆరెస్ నాయకులపై మండిపడ్డారు.
ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ లకు ప్రాధాన్యం
తొలి ప్రధాని నెహ్రూ స్ఫూర్తితో రాష్ట్రంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ లక్ష్యంగా సాగుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఇందులో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా వరంగల్లో రెండవ ఎయిర్ పోర్టు నిర్మాణం చేస్తున్నామన్నారు. డిసెంబర్ నాటికి భూ సేకరణ పూర్తి చేసి మార్చినాటికి పనులు ప్రారంభిస్తామన్నారు. విదేశాల్లో చదువుకున్నామని కొందరు పొంకనాలు కొట్టిన వారు వరంగల్ ను పట్టించుకోలేదని కేటీఆర్ గురించి విమర్శించారు.
వరంగల్ అభివృద్ధికి శ్రద్ధ
హైదరాబాద్‌కు ఏం ఉన్నాయో అవన్నీ వరంగల్లో ఉండాలని ఔటర్ రింగు రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు తదితర అభివృద్ధి పనులు త్వరలో చేపడుతామని సీఎం రేవంత్ చెప్పారు. ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఉత్పత్తుల విక్రయం, బస్సులు మహిళలకే కేటాయించామన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చామన్నారు. కోటి మంది మహిళల ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాం. ఆత్మగౌరవానికి ప్రతీకగా సారే రూపంలో కోటి చీరలు ఇస్తున్నామన్నారు. గతంలో చీరలిస్తే చేన్ల వద్ద పిట్టలు కొట్టెందుకు కట్టేవారని ఎద్దేవా చేశారు. పేదబిడ్డలు నాణ్యమైన చదువు అందించడమే తన లక్ష్యమంటూ మీరు కూడా ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. విద్యకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. గొల్లలు గొర్రెలు పెంచుకోవాలని, బెస్తలు చేపలు పెట్టుకోవాలని, ఎస్సీలు చెప్పులు కుట్టుకోవాలని కేసీఆర్ కోరుకున్నారని, అధికారం మాత్రం తమకే కావాలనుకున్నారన్నారు. తాను మాత్రం అందరూ చదువుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తమ ఉద్యోగాలు చూసుకున్నారని, తాము నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు 61,379 ఉద్యోగాలిచ్చామన్నారు. మరో 49 వేల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో రాజకీయ కక్షలు పెంచుకోవద్దని హితవు పలికారు. గ్రామీణ యువత అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ఆశీస్సులతో గ్రామ స్థాయి నుంచి ఎదిగి తాను సీఎం అయ్యానన్నారు. మీరు కూడా ప్రజల మనస్సును గెలువండి, ఎన్నికల్లో పైసలు ఖర్చు చేయకండంటూ వివరించారు. మంచి వ్యక్తులను సర్పంచ్ లుగా గెలువాలన్నారు. ఎన్నుకునే సర్పంచ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోడు గెలిస్తే మంచిదన్నారు.
రైతుల సంక్షేమం లక్ష్యం
ఆనాటి సీఎం కేసీఆర్ వరి ఏసుకుంటే ఉరివేసుకున్నట్లే నని అన్నారని, తాము మాత్రం ఇందిరమ్మ ప్రభుత్వంలో సన్నవడ్లు పండించండి బోనస్ ఇస్తామన్నాం. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తమని చెప్పి ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బందు అయితదని, కరెంటు బంద్ అయితదని బీఆర్ఎస్ నాయకులు అన్నారనీ, మరి ఈ రోజు పరిస్థితి దీనికి భిన్నంగా ఉందన్నారు. గడీలలో ఉన్నవారికి మాత్రమే కరెంటు పోయిందని, దుక్కిదున్నే రైతుకు కరెంటు ఉందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా 12 వేలిస్తున్నాం. కోటి50 లక్షలమందికి తొమ్మిదివేల కోట్లు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25లక్షల35వేల మంది రైతులకు 20,614 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం మనది ఒక సీజన్ లో ఒక కోటి 56లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. బీఆర్ఎస్ హయంలో వడ్లు కొనకపోతే రైతులు కల్లాల్లోనే కండ్లు మూసిన చరిత్ర మరిచిపోలేదన్నారు. రేషన్ కార్డు ఇవ్వాలంటే గజ్వేల్ లో ఫాం హౌస్ రాసిమ్మని అడిగారన్నట్టు వ్యవహరిస్తే తాము కోటి10లక్షల కొత్త కార్డులిచ్చామని చెప్పారు. గుడైనా, బడైనా, నీళ్ళ ట్యాంకైనా, ఇందిరమ్మ ఇండ్లైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవేనన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి చాలా మంది ఇండ్లు కూలగొడితే బజారునపడ్డారని, వరంగలొల్లు తెలివికల్లొల్లే ఆయనప్పటికీ ఆయన మాయమాటలకు మోసపోయారంటూ కేసీఆర్ నుద్దేశించి అన్నారు. తాము పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నామని, మొదటి విడత 4లక్షల50వేల ఇండ్లు 22,500 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. ఎమ్మెల్యే వినతి మేరకు నర్సంపేటకు వచ్చే మార్చి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.
వరంగల్ పోరాట గడ్డ స్ఫూర్తి
సమ్మక్క,సారలమ్మ, కాకతీయ యూనివర్సీటీ, చాకలి ఐలమ్మ, దొడ్డికొమురయ్య, జయశంకర్ సార్ ల పోరాటగడ్డ వరంగల్ జిల్లా తనకు స్ఫూర్తినిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. వీరందరి స్పూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన రెండేళ్ళు పూర్తి చేసుకున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రమొస్తే సమస్యలు పరిష్కారమైతాయని, నర్సంపేట అభివృద్ధిచెందుతుందని బీఆర్ఎస్ కు రెండు సార్లు అధికారమిస్తే వారు మాత్రమే అభివృద్ధి చెందారని దుయ్యబట్టారు. వారు ఆస్తులు సంపాదించుకుని, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, ఫాం హౌజులు కట్టుకున్నారంటూ విమర్శించారు. విమానాలు కొనుక్కున్నారు. టీవీలు పెట్టుకున్నారు. పేపర్లు రాసుకుంటున్నారు తప్ప నర్సంపేట మాత్రం అభివృద్ధి చెందలేదని, వరంగల్ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి భిన్నంగా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ప్రజలు అండగా నిలువాలని కోరారు. ప్రజలు ఎమ్మెల్యేలకు, తనకూ, కాంగ్రెస్ పార్టీకి, రాహూల్ ప్రధానిగా అయ్యేందుకు అండగా నిలువాలన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram