ఫోన్‌లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు టెమ్రీస్‌ చెల్లింపులు నెలకు ఆరు లక్షలు

టెమ్రిస్‌లో విద్యార్థులకు అనారోగ్యం కలిగితే ఫోన్‌లో సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఒక స్వచ్ఛంద సంస్థకు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాలా ఆరు లక్షలు. అది కూడా ఏడాది కాదు.. నెలకే. గతంలో ఒకరు ఈ వ్యవస్థ వృథా అని చెప్పి తొలగిస్తే.. మరొకరు దానిని మళ్లీ తీసుకురావడం వెనుక మతలబేంటన్న చర్చలు సాగుతున్నాయి.

tmreis-ngo-payment-controversy

విధాత, హైదరాబాద్:

మైనారిటీ వర్గాలకు మెరుగైన విద్యను అందచేసేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీలో పెద్ద ఎత్తున నిధుల దుబారా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆరోగ్యం పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు సేవలు అందించేది. గతంలో మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీ అది అందిస్తున్న సర్వీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తొలగించారు. ఆ తరువాత వచ్చిన స్పెషల్ సెక్రెటరీ తిరిగి స్వచ్ఛంద సంస్థ సేవలను పునరుద్దరించడం విశేషం. ప్రభుత్వ నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో క్రమశిక్షణ లేకుండా పోయిందని ఆ సంస్థ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యంపై ఫోన్‌లో సూచనలు ఇచ్చేందుకు ఒక స్వచ్ఛంద సంస్థకు ప్రతినెలా రూ.6 లక్షలు ధారపోస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఆరోగ్యంపై సలహాలకు నెలకు ఆరు లక్షలు

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టెమ్రీస్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 204 విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ విద్యా సంస్థల్లో ప్రస్తుతం 40వేల లోపు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి నెలా రూ.2 లక్షలు చెల్లించే విధంగా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌తో టెమ్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ తరువాత రూ.4 లక్షలు చెల్లించగా, ప్రస్తుతం రూ.6 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

ఇదీ దాని పని

నాంపల్లి అనీస్ ఉల్ గుర్బా కాంప్లెక్స్‌లోని టెమ్రీస్ ప్రధాన కార్యాలయంలో హెల్త్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 24 గంటలు మెడికల్ కేర్ లభించేలా ప్రత్యేకంగా ఫోన్ నంబర్ సౌకర్యం కల్పించారు. ఏదైనా ఒక విద్యా సంస్థలో విద్యార్థి అస్వస్థతకు గురైనా, జ్వరం లేదా ఇతర జబ్బులు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్న నర్స్ నాంపల్లిలోని హెల్త్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తిన ఉద్యోగి ఇచ్చే సలహాల మేరకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఏరియా హాస్పిటల్‌కు విద్యార్థిని తరలిస్తారు. సాధారణ జబ్బు అయితే మాత్రలతో చికిత్స చేస్తారు. ప్రతి విద్యాసంస్థలో ఒక నర్సు అందుబాటులో ఉండగా స్వచ్ఛంద సంస్థ అవసరం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వృథాగా భావించిన తఫ్సీర్‌ ఇక్బాల్‌

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 2024 మార్చి నెలలో సీనియర్ ఐపీఎస్ అధికారి తఫ్సీర్ ఇక్బాల్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీగా, కమిషనర్‌గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన టెమ్రీస్ కార్యకలాపాలపై సమీక్షించి, నిధుల దుబారాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 204 విద్యాసంస్థల్లో నర్సులు పనిచేస్తుండగా, నాంపల్లిలో హెల్త్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అవసరం లేదని గుర్తించారు. దీని నిర్వహణ కోసం ప్రతినెలా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు రూ.6 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్థారించారు. వెచ్చిస్తున్న డబ్బులకు తగ్గట్టుగా సేవలు అందడం లేదని అంచనాకు వచ్చిన తఫ్సీర్ ఇక్బాల్… హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సేవలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాంపల్లిలో కంట్రోల్ సెంటర్ సేవలు నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో టెమ్రీస్ లో పనిచేస్తున్న సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

మళ్లీ వ్యవస్థను తీసుకొచ్చిన షఫీవుల్లా

తఫ్సీర్ ఇక్బాల్ బదిలీ కావడం ఆయన స్థానంలో స్పెషల్ సెక్రెటరీగా బీ షఫీఉల్లా గతేడాది జూన్ నెలలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. షఫీ ఉల్లా టెమ్రీస్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే తిరిగి నాంపల్లిలో హెల్త్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సేవలు ప్రారంభం కావడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. నిధుల దుబారాను తగ్గించేందుకు గతంలో పనిచేసిన స్పెషల్ సెక్రెటరీ తఫ్సీర్ ఇక్బాల్ తొలగించగా, కొత్తగా వచ్చిన స్పెషల్ సెక్రెటరీ షఫీఉల్లా కొనసాగిస్తున్నారని చర్చించుకున్నారు. నిధుల దుబారా జరుగుతోందని కొందరు ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ దృష్టికి సైతం తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏమాత్రం పనిచేయని, పనిలేని సంస్థకు ప్రతినెలా రూ.6 లక్షలు ధారపోస్తున్నారని సిబ్బంది బహిరంగంగా విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral News | మేకప్ కిట్‌నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
రప్పా రప్పా ఫైట్..కింగ్ కోబ్రాను కరకర నమిలేసిన ముంగిస
Drumstick Farming | మున‌గ‌కాయ‌ల‌తో భలే వ్యాపారం.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న వృద్ధ రైతు

Latest News