Degrading political language : తెలంగాణలో కారు కూతలు, బూతు రాగాల రాజకీయాలు.. ఆద్యులెవరు? అంతం చేయాల్సిందెవరు?
ఆ మధ్యలో ఒక కార్టూన్ ఒకటి వచ్చింది. టీవీల్లో రాజకీయ నాయకుల భాషను చూసి.. ఇంట్లో పిల్లలు సైతం అటువంటి తిట్లు తిట్టుకోవడం ఆ బొమ్మ సారాంశం. వ్యగ్యం కోసం వేసినదే అయినా ఆ కార్టూన్ ఎంతో ఆందోళన కలిగించేదని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

Degrading political language : రాజకీయ నాయకులు విచక్షణ కోల్పోయి బూతు రాగాలు, కారుకూతలు మాట్లడాటం మొదలుపెట్టి దశాబ్దం దాటినట్టే ఉంది.. సిద్ధాంతాలు, విలువలు మరిచిపోయి.. నోటికి వచ్చింది మాట్లాడటం రాజకీయ నాయకుల కనీస లక్షణంగా తయారై కూర్చున్నది. ఏం మాట్లాడున్నా.. జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయి.. అన్న సోయి లేకుండా నోటికి వచ్చింది కూసెయ్యడం కామనైపోయింది! ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా సోమవారం మీడియాతో చిట్‌చాట్ చేసిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోసారి ఈ బూతురాగాలు, కారుకూతల ప్రస్తావన చేశారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరన్న కేటీఆర్.. ఆయన స్థాయి వేరని, వీళ్లు (కాంగ్రెస్) మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు, కారుకూతలు వినకూడదనేది ఆయన ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఈ పిచ్చి మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దనేది ఆయన కొడుకుగా తన అభిప్రాయమని వెనకేసుకొచ్చారు. దీంతో అసలు ఈ పిచ్చి మాటలు, బూతురాగాలు మొదలుపెట్టిందెవరన్న చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతున్నది. దీనిపై కేసీఆర్, బీఆరెస్ ప్రస్తానాన్ని తొలి నుంచీ గమనిస్తూ ఉన్న ఒక జర్నలిస్టు స్పందిస్తూ రాష్ట్రంలో కారుకూతలు మొదలు పెట్టిందే కారు పార్టీ అధినేత కదా.. అని వ్యాఖ్యానించారు. అటు ఉద్యమ సమయంలో, అనంతరం వివిధ సందర్భాల్లో పచ్చి బూతులు ఒక్కటే తక్కువ అన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడటం ద్వారా రాజకీయ నాయకుల భాషాపరమైన హుందా తనాన్ని కింది స్థాయికి పడేసిందే కేసీఆర్ అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను చూసే ఇతర పార్టీల నాయకులు ఆయనకు కౌంటర్లు ఇచ్చే క్రమంలో అదే భాషను వాడుతూ వస్తున్నారని మరో జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వివిధ ప్రెస్‌మీట్లలో మాట్లాడిన బూతులివేనంటూ ఓ వంద అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియోను ఇటీవల ఒక యూట్యూబ్ చానల్ విడుదల చేసింది. చిన్నపిల్లలు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియో చూడకండి అంటూ ఓ వార్నింగ్‌ను సైతం దానికి జత చేసింది. ఈ తిట్ల దండకంలో కొన్ని ఇలా ఉన్నాయి..
(సూచన.. మీకు అభ్యంతరం లేకపోతేనే.. కింది పదాలు చదువుకోండి..)
బొంద.. బోకి… సిగ్గు లేని దరిద్రులంటం, ముండ ముఖానికి రాష్ట్రానికి జరిగిన అన్యాయం తెలుసా.. మీకు సిగ్గు లేకుండా.. 315 జీవో మీ ముండ జీవో.. అందుకే మిమ్ములను పిచ్చికుక్కలు అంటరు.. మీలాంటి కుక్క గాళ్లు, నక్కగాళ్లు వచ్చి ఖరాబు చేస్తమంటే ఊరుకుంటమా? హౌలా పోషిగాని లెక్క మాట్లాడుకుంట.. లంగ సోషల్ మీడియాల అబద్దాలు ప్రచారం చేసుకుంట ఇదా.. వాళ్లకు ఏమన్నా సిగ్గు శరం ఉందా… వాళ్లు సిగ్గులేని దరిద్రులండీ.. దేశానికి పుట్టిన కుక్క మూతి పిందె వీళ్లు… దొంగముఖం గాళ్లు.. దరిద్రులు.. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని మాట్లాడుతరండి వీళ్లు.. సిగ్గు కూడా లేదా.. ఛీ..ఛీ.. ముఖం మీద ఉమ్మేసినా సిగ్గు లేదా? సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. ఎవడో కుక్కగాడు.. నక్క గాడు మాట్లాడుతాడా కేసీఆర్ గురించి? అంటూ మీడియా ప్రశ్నలకు తిట్లతోనే సమాధానం ఇచ్చారు కేసీఆర్. అంతేకాదు.. మొగోడు ఎవ్వడు లేడు ఇండియాల.. నేడు ఢిల్లీ ఎందుకు పోతర బై నేను పిచ్చోన్నా.. నా ఎడమ కాలి గొటికి సరిపోనోడు నన్ను జైళ్ల ఏస్తనన్న గాడిద కొడుకులున్నరక్కడ.. చిల్లర గాళ్లు కూడా ఉన్నరక్కడ.. కొంత మంది బేవకూఫ్‌గాళ్లున్నరక్కడ.. ఎవడో పాగల్ గాడన్నడని చెపుతరు వాళ్లెవరయ్యా… అని ప్రతిపక్ష నేతల నుద్దేశించి ఒక మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవడో కుక్కగాడు చెపితే ముందస్తు ఎన్నికలు పెడతారు? అంటూ ఫైర్ అయ్యేవారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌లో గతంలో నిర్వహించిన ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సిగ్గు.. శరం.. లజ్జ ఉంటే.. ఏమన్న చీము నెత్తురు ఉంటే.. పౌరుషం ఉంటే… పెద్ద సిపాయి మాటలు మాట్లాడుతరు.. పెద్ద పెద్ద పోజులు కొట్టే నాయకులు.. బుద్ధి ఉంటే.. చీము నెత్తురు ఉంటే పోయి ఢిల్లీల కూసోవాలె.. సిగ్గు లేని జాతీయ ఉపాధ్యక్షులు తొక్క, తొండెం అని మాట్లాడుతరు.. అంటూ తిట్ల దండకం అందుకున్నారు. మరోచోట కేంద్ర హోంశాఖమంత్రిని అమిత్ షా నా భ్రమిత్ షానా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ సైతం అనేక చోట్ల.. ఈడీ.. బోడీ ఏం పీక్కుంటారో పీక్కోమను అని మాట్లాడుతారు.
బీఆరెస్‌కు అదే భాషతో కౌంటర్
బీఆరెస్‌ను కౌంటర్ చేయడం కోసం నాడు పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్ రెడ్డి అదే తిట్ల దండకాన్ని అదే స్థాయిలో అందుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు విన్న దివంగత మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి, మరో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి వేర్వేరు సందర్భాలలో నేటి రాజకీయాలకు రేవంత్ రెడ్డినే కరెక్ట్ అనే వ్యాఖ్యానించారు. కేసీఆర్ బూతులకు బూతులే సమాధానం అన్నట్లుగా రేవంత్ కౌంటర్ ఇస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. రేవంత్‌రెడ్డి కూడా తిట్లలో తక్కువేమీ తినలేదు. కేసీఆర్‌ను సన్నాసి అనడంతోపాటు.. కేటీఆర్‌ను రా.. అంటూ సంబోధించడం ఎన్నికల్లోనే మొదలుపెట్టారు. పేడమూతి బోడిలింగం, అరె సన్నాసి, సంక నాకుతున్నారా? బుద్ధిలేని గాడిద కొడుకు.. ముడ్డిమీద తంతా.. లాగులూదీస్తా.. లాగుల్లో తొండలు వదులుతా.. గుడ్లు పీకి గోలీకాయలాడుకుంటా.. అంటూ మునష్టపు బీఆరెసోళ్లు.. నువ్వు రండగాడివి.. ఇలా అనేక పదాలు రేవంత్ రెడ్డి నోట వెలువడ్డాయి. అయితే ఎంతకాలం ఇలా నోటికొచ్చినట్టు కారుకూతలు, బూతు రాగాలు కొనసాగుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. హుందాగా ఉండాల్సిన రాజకీయాల్లో ఇంత దిగజారుడు మాటలు రాజకీయ నాయకుల స్థాయిని దిగజార్చేస్తున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. నేడు రేవంత్ భాషను కేటీఆర్ తప్పుపడుతున్నారంటే.. ఆయన, బీఆరెస్ అధినేత కేసీఆర్, ఇతర బీఆరెస్ నేతలు ముందుగా బూతులు బంద్ చేస్తారా? రాజకీయ, సామాజిక విలువలు పాటిస్తూ విమర్శలు చేస్తారా? అన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది.
ఇప్పుడు హుందా రాజకీయాలను ప్రారంభించాల్సిందీ కేసీఆరే!
దిగజారుడు భాషలో తిట్ల దండకాలతో విమర్శలను మొదలు పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు హుందా రాజకీయాలకు కూడా ఆద్యుడిగా నిలవాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. మార్పు ఆయన నుంచే మొదలవ్వాలని అంటున్నారు. ఇప్పటి రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. అదే సమయంలో ముఖ్యమంత్రిగా విజ్ఞత పాటిస్తూ రేవంత్‌రెడ్డి సైతం భాషను సవరించుకోవాల్సిన అవసరం ఉన్నదని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ అధినేతలుగా ఉన్న వారికి విపక్షాలు విమర్శించడం సహజం… అ విమర్శలను స్వీకరిస్తూనే భాష హద్దులు మీరి మాట్లాడే వారికి చురకలు అంటించాలని కూడా అంటున్నారు. ఆ మధ్యలో ఒక కార్టూన్ ఒకటి వచ్చింది. టీవీల్లో రాజకీయ నాయకుల భాషను చూసి.. ఇంట్లో పిల్లలు సైతం అటువంటి తిట్లు తిట్టుకోవడం ఆ బొమ్మ సారాంశం. వ్యగ్యం కోసం వేసినదే అయినా ఆ కార్టూన్ ఎంతో ఆందోళన కలిగించేదని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుల భాష విని, పిల్లలు కూడా అవే తరహా మాటలు నేర్చుకుంటారేమోనన్న భయం తల్లిదండ్రుల్లో లేకపోలేదు. ఏదైనా రాజకీయ నాయకుడి ఉపన్యాసాలో.. ప్రెస్ మీట్ లో జరుగుతుంటే పిల్లలు వింటారనే భయంతో టీవీలు కట్ చేస్తున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. ఈ పరిస్థితి మారి నేతల ప్రసంగాలు విని, కాసింత జ్ఞానం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగే విధంగా గౌరవ ప్రదమైన భాషలో రాజకీయ విమర్శలు చేసుకుంటే మంచిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.