KCR Vs Revanth | ఆయన ఫామ్ హౌస్ సీఎం.. ఈయన రెసిడెన్సీ సీఎం!
సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉండి కూడా రాకపోవడం మూలంగా పాలన గడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రాకపోవడంతో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు పనివేళల్లో కాకుండా తమకు నచ్చిన సమయంలో వచ్చి వెళ్తున్నారు.

- మూడు నెలల్లో ఆరుసార్లే సచివాలయ సందర్శన
- ముఖ్యమంత్రి పదవుల్లో ఇద్దరూ ఇద్దరే
KCR Vs Revanth |
(విధాత ప్రత్యేకం) రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు పని చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సచివాలయానికి వచ్చి సమీక్షలు నిర్వహించింది అతి స్వల్పం. సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రిగా విపక్షాలు, విశ్లేషకుల విమర్శలకు గురయ్యారు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం అదే ధోరణి కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్‌గా సచివాలయానికి వస్తేనే పాలన సజావుగా సాగుతుందని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం లేదా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయం, అప్పుడప్పుడు సచివాలయానికి వచ్చి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గడీల పాలన నడుస్తున్నదని, ఫామ్ హౌస్‌లో సమీక్షలు చేస్తున్నారంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గతంలో విమర్శలు చేశారు. నాడు ఫామ్ హౌస్ సమీక్షలైతే.. నేడు రెసిడెన్సీ సమీక్షలు అన్నట్టు పరిస్థితి తయారైందని విశ్లేషకులు అంటున్నారు.
తన తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కేసీఆర్ పదిహేను నుంచి ఇరవై సార్లు మాత్రమే సెక్రటేరియట్ కు వచ్చారు. పాత సచివాలయం కూల్చి నూతన సచివాలయం నిర్మించే సమయంలో పనులు పరిశీలించేందుకు వచ్చిపోయేవారు. ప్రజా తీర్పు ప్రకారం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలి ఆరు నెలల పాటు సందర్శకులు పెద్ద ఎత్తున సచివాలయానికి వచ్చారు. ఆ తరువాత సందర్శకుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పౌరులను సచివాలయం లోనికి అనుమతిస్తున్నారు.
సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉండి కూడా రాకపోవడం మూలంగా పాలన గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రాకపోవడంతో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు పనివేళల్లో కాకుండా తమకు నచ్చిన సమయంలో వచ్చి వెళ్తున్నారు. అయితే కొందరు మంత్రులు నగరంలో ఉన్న సందర్భంలో కచ్చితంగా సచివాలయానికి వస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల కాలంలో రేవంత్ రెడ్డి సచివాలయాన్ని ఐదు సార్లు మాత్రమే సందర్శించి సమీక్షలు నిర్వహించడం గమనార్హం. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏడుసార్లు ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఐదుసార్లు సమీక్షలు నిర్వహించారు.
మొత్తంగా ముఖ్యమంత్రి ఈ ఏడాది మూడు నెలల కాలంలో సచివాలయానికి ఆరు సార్లు (రోజులు) వచ్చి సమీక్షలు, సమావేశాలు నిర్వహించి వెళ్లారు. మిగతా రోజుల్లో జిల్లా, ఢిల్లీ పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. జనవరి 16 నుంచి సింగపూర్, దావోస్‌లలో పెట్టుబడుల కోసం పర్యటించారు. ఫిబ్రవరి 4వ తేదీన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమైంది. మార్చి 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో బేగంపేట ప్రగతి భవన్ ముందు మెయిన్ రోడ్డుపై ఉన్న ఇనుప కంచెను బద్ధలు కొట్టిన సందర్భంలో ప్రజలు సంతోషపడ్డారు. కానీ, ఆ తరువాత రేవంత్‌రెడ్డి కూడా సచివాలయానికి రెగ్యులర్‌గా రాకపోవడం చర్చనీయాంశమవుతున్నది.
ముఖ్యమంత్రి 3 నెలల సమీక్షలు, సమావేశాలు..
జనవరి 3 : కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ జలమండలిపై సమీక్ష
జనవరి 3 : సచివాలయంలో రీజినల్ రింగ్ రోడ్డుపై సమీక్ష
జనవరి 4 : సచివాలయంలో నీటి పారుదల శాఖపై సమీక్ష
జనవరి 6 : జూబ్లీహిల్స్ నివాసం నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమం (వర్చువల్)
జనవరి 7 : జూబ్లీహిల్స్ నివాసంలో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లపై సమీక్ష
జనవరి 9 : బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయత్ రాజ్ పై సమీక్ష
జనవరి 10 : సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు
జనవరి 11 : జూబ్లీహిల్స్ నివాసంలో ఉస్మానియా ఆసుపత్రిపై సమీక్ష
జనవరి 13 : జూబ్లీహిల్స్ నివాసంలో పరిశ్రమల శాఖపై సమీక్ష
జనవరి 25 : బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రజా పాలన పథకాలపై చర్చ
జనవరి 26 : జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జనవరి 28 : సచివాలయంలో దావోస్ పర్యటనపై మీడియా సమావేశం
జనవరి 29 : కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కుల గణనపై సమీక్ష
ఫిబ్రవరి 1 : కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్థిక శాఖ పై సమీక్ష
ఫిబ్రవరి 22 : జూబ్లీహిల్స్ నివాసంలో విద్యా కమిషన్ సభ్యులతో సమావేశం
మార్చి 1 : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధిపై సమావేశం
మార్చి 1 : జూబ్లీహిల్స్ నివాసంలో కార్మిక శాఖపై సమావేశం
మార్చి 6 : సచివాలయంలో మంత్రివర్గ సమావేశం
ఏప్రిల్ 4 : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్ పై సమావేశం
ఏప్రిల్ 5 : సచివాలయంలో లోకాయక్త, మానవ హక్కుల కమిషన్ సెలెక్షన్ కమిటీ భేటీ