తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై పార్టీలది తలోదారి!

బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చెరోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మరో పార్టీ బీజేపీ.. ఇప్పటికే తాను ఈ బిల్లులకు వ్యతిరేకమని తేల్చి చెబుతున్నది. ఈ తరుణంలో అంతా కలిసి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఒత్తిడి తేవాల్సి ఉన్నా.. శ్రద్ధ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై  పార్టీలది తలోదారి!

BC Reservations Telangana | హైదరాబాద్‌, ఆగస్ట్‌ 14 (విధాత) : బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చెరోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మరో పార్టీ బీజేపీ.. ఇప్పటికే తాను ఈ బిల్లులకు వ్యతిరేకమని తేల్చి చెబుతున్నది. ఈ తరుణంలో అంతా కలిసి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఒత్తిడి తేవాల్సి ఉన్నా.. శ్రద్ధ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. కానీ, పార్లమెంట్‌లో చట్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై పార్టీల్లో ఐక్యత లోపించడాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం ఆరాటం తప్పితే రిజర్వేషన్లు సాధించాలనే చిత్తశుద్ది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బీసీ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. క్రెడిట్‌ ఎవరికి దక్కాలన్న అంశాన్ని పక్కన పెట్టి.. ఉమ్మడిగా ఒత్తిడి తెస్తేనే ఉపయోగమని అంటున్నాయి. ఎవరు ఎంత చేసిన ఆఖరుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అంగీకరిస్తేనే బీసీ బిల్లులకు మోక్షం కలుగుతుంది. అయితే.. బీజేపీ అందుకు వ్యతిరేకంగా ఉన్నదని ఆ పార్టీ నాయకుల మాటల్లోనే తేలిపోతున్నది. దీంతో టార్గెట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంగా ఉండాలని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఒక వైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ప్రతిపక్ష బీఆరెస్‌ సైతం అదే లక్ష్యంతో ఉండాలని, కానీ.. గర్జనల పేరుతో సభలు పెట్టి, రేవంత్‌ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తే సాధించేది ఏమీ ఉండదని అంటున్నారు. అందుకే బీఆరెస్‌ సైతం కేంద్రంలోని బీజేపీని నిలదీసేలా కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టం వస్తే ఆ క్రెడిట్ తమ పార్టీ ఖాతాలోనే పడుతుందని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు.. అందుకే ఈ విషయంలో బీఆరెస్‌ రాజకీయం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే 10 శాతం ముస్లింలున్నందున మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ మెలిక పెట్టింది. ముస్లింల సాకుతో మొత్తంగా బీసీ రిజర్వేషన్లనే బీజేపీ అడ్డుకుంటున్నదని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్నది. ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించినా.. బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ డ్రామా చేస్తున్నదని అంటున్నది. పార్లమెంటులో ఆమోదం పొందితేనే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందని తెలిసీ, అందుకు బీజేపీ సహకరించదని తెలిసీ ఎలా హామీ ఇస్తారని గులాబీ పార్టీ నిలదీస్తున్నది. మొత్తంగా రాజకీయంగా మైలేజీ కోసం ప్రధాన పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయనే చర్చలు సాగుతున్నాయి. ఈ అంశంలో ఎవరికివారు తామే చాంపియన్లు కావాలనే ఆరాటం తప్ప.. రిజర్వేషన్లు దక్కాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదనే విమర్శలు బీసీ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

రేవంత్ సర్కార్ ఏం చేయాలి?

బీసీ రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో ప్రధాన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పార్టీల సహకారం రేవంత్ సర్కార్ తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి అన్ని పార్టీల ప్రతినిధులను కానీ, ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులను తీసుకెళ్తే బాగుండేదనే చర్చ కూడా లేకపోలేదు. బనకచర్లపై ఏర్పాటు చేసిన తరహాలోనే బీసీ రిజర్వేషన్లపైనా ఏం చేయాలనే దానిపై ఆల్ పార్టీ మీటింగ్ లేదా పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినా పరిస్థితి మరోలా ఉండేదనే వాదన కూడా ఉంది. ఢిల్లీ ధర్నాకు అంతా రావాలని బహిరంగంగా పిలుపునివ్వడం కాకుండా.. అఖిలపక్షాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.