Telangana Historic Paddy Yield | తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి.. వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌

దేశంలోనే రికార్డు స్థాయిలో ఈ వానకాలం సీజన్‌లో తెలంగాణలో వరి దిగుబడులు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. మొత్తం 67.57 లక్షల ఎకరాలలో సాగు చేయగా, 148.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నమోదు అవుతున్నదని అన్నారు

Telangana Historic Paddy Yield | తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి.. వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌

Telangana Historic Paddy Yield | భారతదేశ చరిత్రలోనే వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డు నమోదు చేసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 67.57 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు చేయగా, 148.30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి నమోదు అవుతున్నదని ఆయన అన్నారు. ఇందులో సన్నాలు 40.75 లక్షల ఎకరాలలో, దొడ్డు రకం 26.82 లక్షల ఎకరాలలో సాగు చేశారు. 90.46 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 57.84 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం దిగుబడి అవుతుందని అంచనా వేశామన్నారు. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇది తెలంగాణ నీటిపారుదల శాఖ, రైతులు సాధించిన గొప్ప విజయమని మంత్రి ఉత్తమ్ అన్నారు.

ఎర్రమంజిల్ పౌర సరఫరాల కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2019-20 లో 72 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా, 2025-26 నాటికి ఏకంగా 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరిందన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్వింటాల్ కు రూ.500 బోనస్ కోనసాగిస్తామని, ధాన్యం కొనుగోళ్ళకు రూ.21,112 కోట్లు వరకు వెచ్చిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి పంటలకు కలిపి సన్నాలకు అందించే బోనస్ మొత్తం రూ.3,158 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో తెలంగాణా సన్నాలకు భారీ డిమాండ్ ఉందని, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు సన్నాల ఎగుమతి చేస్తున్నామన్నారు. ఎఫ్.సీ.ఐ గిడ్డంగులలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.