రిజర్వేషన్లపై మల్లగుల్లాలు..30లోపు స్థానిక సంస్థల డౌటే!
ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే తప్పితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం లేదని సమాచారం

- 30లోపు స్థానిక సంస్థల డౌటే!
- చెప్పకనే చెప్పిన సీఎం రేవంత్
- 42% రిజర్వేషన్లపై మల్లగుల్లాలు
- న్యాయస్థానం ముందుకు ఇష్యూ!
- హైకోర్టు ఆదేశిస్తేనే ఎన్నికలు
- పార్టీపరంగా కాంగ్రెస్ రిజర్వేషన్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విధాత): స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించే అవకాశం కన్పించడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశం తేలకుండా ఎన్నికలకు వెళ్లే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే తప్పితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం లేదని సమాచారం.
బీసీ రిజర్వేషన్ల అంశమే అడ్డంకి!
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది. ఇవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరో వైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 31న చట్ట సవరణ చేసింది. దీనిపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేలలేదు. ఇది తేలకుండా ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనేది అధికార పార్టీ భావనగా కనిపిస్తోంది. గవర్నర్, రాష్ట్రపతి వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణకు కసరత్తు చేస్తోంది.
హైకోర్టుకు ఏం చెబుతారు?
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఇంకా తేలలేదు. దీంతో రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఈ కారణాన్ని చూపి సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపే అవకాశం ఉందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలిసింది. దీనికి హైకోర్టు అంగీకరిస్తుందా? అదే జరిగితే ఎంత కాలం గడువు ఇస్తుంది? గతంలో ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 30 లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెబితే ఏం చేస్తారు? అనే అంశాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గడువు ఇవ్వని పక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. పార్టీ పరంగా 42 శాతం టికెట్లను కాంగ్రెస్ ప్రకటిస్తుందని ఇప్పటికే నేతలు స్పష్టం చేశారు.