Own Tax Revenue CAG Report | తెలంగాణ సొంత రాబడి మూడింతలు! కానీ.. ‘సంక్షేమ’ భారంతో సర్కార్ డిపాజిట్లు ఆవిరి : కాగ్ నివేదిక
రెండు తెలుగు రాష్ట్రాల దశాబ్ద కాలపు సొంత రాబడిపై గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విధాత ప్రతినిధి):
Own Tax Revenue CAG Report | తెలుగు రాష్ట్రాలకు గడచిన దశాబ్ధకాలంగా సొంత పన్నుల (స్టేట్ ఓన్ టాక్స్) రాబడి పరిశీలిస్తే ఏపీలో స్వల్ప పెరుగుదల ఉండగా తెలంగాణలో మూడింతలు పెరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ఏపీ వాటా మొత్తం పదేళ్లలో అనగా 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ.22,132 కోట్లు ఉండగా 2022–2023 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.38,177 కోట్లకు చేరింది. అదే తెలంగాణలో 2014–15 రూ.8,189 కోట్లు ఉండగా 2022–2023 లో రూ.19,668 కోట్లకు పెరిగింది. ఏపీ ప్రభుత్వ నాన్ టాక్స్ రెవెన్యూ 2013–2014లో రూ.8,707 కోట్లు ఉండగా, 2022–2023 లో అమాంతం రూ.11 కోట్లకు పడిపోయింది. తెలంగాణలో కూడా 2014–15 సంవత్సరంలో రూ.2,900 కోట్లు ఉండగా 2022–23లో రూ.346 కోట్లకు పడిపోవడం గమనార్హం. ఏపీ లోటు బడ్జెట్‌లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్పర్డ్ స్కీమ్‌లకు భారీగా కేటాయింపులు పెంచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సీఎస్ఎస్ పథకాలకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి పంపించకపోవడంతో నిధుల కేటాయింపుల్లో వాతలు పెట్టింది. ఇబ్బడి ముబ్బడిగా జనరంజక సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఆదాయం పెంచేందుకు శాశ్వత చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేస్తున్నది. సంక్షేమ పథకాల కారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలల్లో పెట్టిన డిపాజిట్లు, ఇన్వెస్టిమెంట్లు, డివిడెండ్లు, వడ్డీల రూపేణా వచ్చే ఆదాయం కూడా పదేళ్లలో అమాంతం పడిపోయి, డిపాజిట్లు తరిగిపోయాయని కాగ్ లెక్కలు సుస్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో స్వల్పంగా పన్నుల రాబడి
ఏపీలో రాష్ట్ర పన్నుల (స్టేట్ ఓన్ టాక్స్) రాబడి ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ.64,124 కోట్ల రాబడి ఉండగా 2022–2023 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.78,026 కోట్లకు పెరిగింది. దశాబ్ధకాలంలో స్టేట్ ఓన్ టాక్స్ రాబడి రూ.13,902 కోట్లు మాత్రమే పెరిగింది. కేంద్రప్రభుత్వం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రం వాటా 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ.22,132 కోట్లు ఉండగా 2022–2023 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.38,177 కోట్లకు చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వం పన్నుల రాబడి లో రాష్ట్రం వాటా రూ16,045 కోట్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2013–14 సంవత్సరంలో రూ.2,770 కోట్లు విడుదల చేయగా, 2022–23 సంవత్సరంలో రూ.18,037 కోట్లు విడుదల అయ్యాయి. ఈ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కోసం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2013–14 లో రూ.6,221 కోట్లు ఇవ్వగా 2022–23 సంవత్సరంలో రూ.18,111 కోట్లు మంజూరు అయ్యాయి.
ఏపీ డిపాజిట్లు ఆవిరి
నాన్ టాక్స్ రెవెన్యూ అనగా ప్రభుత్వ సొమ్మును బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో డిపాజిట్ చేయడం. ఇలా డిపాజిట్ చేయడం ద్వారా వచ్చే వడ్డీ, డెవిడెండ్, లాభాలు ప్రతి సంవత్సరం సంబంధిత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి డీడీ రూపంలో అందచేస్తుంటాయి. అయితే ఈ నిధులు ఏపీలో పూర్తిగా ఆవిరి అయ్యాయి. ఫలితంగా డిపాజిట్లు శూన్యానికి చేరుకున్నాయనే చెప్పాలి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ నాన్ టాక్స్ రెవెన్యూ రూ.8,707 కోట్లు ఉండగా అది కాస్తా 2022–23 ఆర్థిక సంవత్సరంలో అమాంతం రూ.11 కోట్లకు పడిపోయింది. 2014–15 లో రూ.4,804 కోట్లు, 2015–16 లో రూ.142 కోట్లు, 2016–17 లో రూ.117 కోట్ల కు చేరుకుంది. పన్నుల రాబడి లేకపోవడం, నిధుల లభ్యత పడిపోవడం వంటి కారణాలతో ప్రభుత్వం తన డిపాజిట్లను ఉపసంహరించుకున్నది. ఫలితంగా నాన్ టాక్స్ రెవెన్యూ నాలుగేళ్ల వ్యవధిలోనే రాబడి రూ.8,707 కోట్ల నుంచి రూ.117 కోట్లకు దిగజారింది. ఇతరత్రా నాన్ టాక్స్ రెవెన్యూ కూడా ఏమంతగా పెరగలేదు. 2013–14 ఆర్థిక సంవత్సరంలో ఇతరత్రా నాన్ టాక్స్ రెవెన్యూ రూ.6,766 కోట్లు అది కాస్తా 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.5,406 కోట్లకు చేరుకున్నది. ఈ ఆదాయం పదేళ్ల వ్యవధిలో పెరగక పోగా రూ.1,360 కోట్లకు తగ్గడం విశేషం.
తెలంగాణలో పదేళ్లలో రాబడి మూడింతలు
తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఓన్ టాక్స్ రాబడి ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగా ఊహించని స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు, వ్యాపారాలు ఏర్పాటు అయి ఉండటం వంటి కారణాలతో రాబడి గణనీయంగా పెరిగిందని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ టాక్స్ ఎంత ఉందనేది కాగ్ తెలుపలేదు. ఆ మరుసటి సంవత్సరం 2014–15 రూ.29,288 కోట్ల రాబడి ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,06,949 కోట్లకు పెరిగింది. దశాబ్ధకాలంలో మూడు రెట్లు రాబడి పెరగడం రాష్ట్రానికి శుభసూచకంగా చెప్పుకోవాలి. కేంద్రప్రభుత్వం వసూలు చేసిన పన్నుల్లో తెలంగాణ వాటా 2013–14 ఆర్థిక సంవత్సరంలో వెల్లడించలేదు. 2014–15 రూ.8,189 కోట్లు ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.19,668 కోట్లకు ఎదిగింది. అంటే తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో రూ.11,479 కోట్లు పెరిగింది.
బీఆర్ఎస్ ఏలుబడిలో తగ్గిన సీఎస్ఎస్ నిధులు
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2014–15 సంవత్సరంలో రూ.4,636 కోట్లు విడుదల చేయగా, 2022–23 సంవత్సరంలో రూ.5,387 కోట్లు విడుదల అయ్యాయి. ఏపీ రాష్ట్రంతో పోల్చితే అతి తక్కువగా విడుదల అయ్యాయి. ఈ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కోసం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మళ్లించారని బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేయడంతో తగ్గించారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) పంపించాల్సి ఉంటుంది. వీటిని పంపించకపోవడం మూలంగా రాను రాను సీఎస్ఎస్ నిధుల్లో కోత విధించారని కాగ్ నివేదిక ద్వారా వెల్లడి అవుతున్నది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇతరత్రా కింద 2014–15 సంవత్సరంలో రూ.2,482 కోట్లు ఉండగా 2022–23లో రూ.7,792 కోట్లకు చేరుకున్నది.
ఏపీ మాదిరే తెలంగాణలో సర్కార్ డిపాజిట్లు గల్లంతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదిరే తెలంగాణలో కూడా నాన్ టాక్స్ రెవెన్యూ పూర్తిగా దిగజారింది. సర్కార్ తన డిపాజిట్లను ఆర్థిక సంస్థలు, కంపెనీలు, బ్యాంకులలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే వడ్డీలు, డివిడెండ్, లాభాలు 2014–15 సంవత్సరంలో రూ.2,900 కోట్లు ఉండగా 2022–23లో రూ.346 కోట్లకు పడిపోయాయి. తెలంగాణలో కూడా 2015–16, 2016–17 లో పర్వాలేదని అనుకున్నప్పటికీ 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే లాభాలు రూ.217 కోట్లకు అమాంతం దిగజారాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కంపెనీలలో ఉన్న డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంతో లాభాలు పడిపోయాయనేది అర్థమవుతున్నది.
ఇక ఇతరత్రా నాన్ టాక్స్ రెవెన్యూ పరిశీలిస్తే 2014–2015 ఆర్థిక సంవత్సరంలో రూ.3,547 కోట్లు ఉండగా, 2022–23లో రూ.19,208 కోట్లకు పెరిగింది. అయితే ఈ ఆదాయం పదేళ్ల వ్యవధిలో రూ.15,661 పెరగడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి.