Telangana Bhu Bharati | భూ భారతిలోనూ ‘ధరణి’ సమస్యలు! చట్టం గొప్పగా ఉంటే చాలదు.. అమలు కీలకం
ధరణి బంగాళాఖాతంలో కలిసింది. దాని స్థానంలో భూ భారతి వచ్చింది. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్వోఆర్- 1971 చట్టం ప్రకారం తాసిల్దార్లకు భూమి సమస్యలు పరిష్కరించే అధికారం ఉండేది. అలాగే ఆర్డీవోలకు కూడా. ఎంత పెద్ద భూమి సమస్య అయినా ఎక్కువలో ఎక్కువగా జాయింట్ కలెక్టర్ వరకు వెళితే పరిష్కారం అయ్యేది. 10 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వీఆర్వోలు, తాసిల్దార్లు, ఆర్డీవోలపై అవినీతి అధికారులన్న ముద్ర వేసి, పూర్తి అపనమ్మకంతో ఆయా అధికారులకు ఉన్న అధికారాలన్నింటిని రద్దు చేశారు. ఆర్వోఆర్ 2020 (ధరణి) చట్టం తీసుకొచ్చారు. వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. దీంతో సమస్యలన్నీ పెండింగ్‌లో పడ్డాయి.

Telangana Bhu Bharati | హైదరాబాద్, ఆగస్ట్ 10 (విధాత): ‘నా భూమిలో కాలువ, రోడ్డు పోయిందని మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. అవసరాల కోసం భూమిని అమ్ముకుందామంటే.. భూమి రిజిస్టర్ అవడం లేదు. అధికారులను కలిస్తే తామేమీ చేయలేమంటున్నారు. ఇదెక్కడి అన్యాయం?’ అని మిర్యాలగూడెం మండలం రాయని పాలెం గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాల కోసం భూమిని ఇచ్చినవాళ్లను గౌరవించాల్సిందిపోయి.. ఇలా తమను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఆయన వాపోతున్నాడు. ‘మాది పట్టా భూమి. ఎప్పుడో కొనుగోలు చేశాం. పట్టా కూడా అయింది. కానీ ధరణి వచ్చిన తరువాత ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రొహిబిటెడ్‌లో పెట్టారు. అదేంటని అడిగితే.. మీ సర్వే నంబర్ ఇక్కడ లేదు.. శెట్టిపాలెం శివారులో ఉందని చెపుతున్నారు. మాకు ఉన్నది ఇదొక్కటే ఆధారం ఇప్పుడెలా?’ అని ఒక మహిళా రైతు తన గొడు వెళ్లబోసుకున్నారు. ‘నాకు 7 ఎకరాల పట్టా భూమి ఉన్నది. వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. ధరణిలో 2 ఎకరాల భూమి తగ్గింది. 5 ఎకరాల భూమికి మాత్రమే పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చారు. దీన్ని సరిచేయాలని కోరితే ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రిజక్ట్ చేశారు. సీలింగ్ పట్టా ఇచ్చారు కానీ భూమీదకు రానీయడం లేదు’ అని మరో రైతు తెలిపారు. ఇవే కాదు.. ఇలాంటివే అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, వాటికి పరిష్కారం మాత్రం సర్కారు చూపిండం లేదని సదరు రైతు వాపోయాడు. తనకున్న వ్యవసాయ భూమిలోనే చిన్న గుడిసె వేసుకొని బతుకుతున్న తమకు ఆ భూమి ఇండ్ల ప్లాట్ అని రాసి.. రైతు భరోసా బంద్ పెట్టారని కోదాడ మండలానికి చెందిన ఒక రైతు అధికారుల ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. తాము కట్టుకున్న ఇల్లు ఎంత మేర ఉంటే.. అంత వరకూ మినహాయించి.. మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వాలని అధికారులను మొత్తుకుంటున్నాడు. ఈ రైతు సమస్యనూ తీర్చే నాథుడు లేకపోయాడు.
అటవీ సరిహద్దు గ్రామాల రైతుల గోస
అటవీ..రెవెన్యూ సరిహద్దుల పంచాయితీ తేల్చకపోవడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు పట్టాలున్నా.. రైతు భరోసా అందటంలేదు. ఈ పంచాయితీ తేల్చాల్సిన సర్కారు పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంతో లక్షల మంది రైతులు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం, ఇతర రాయితీలు అందుకోలేక పోతున్నారని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. మిర్యాలగూడెం నియోజకవర్గ పరిధిలోని అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లోని అనేక గ్రామాల రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భరోసా అందక పోవడం గమనార్హం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించడం లేదని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వరకు భూమి సమస్యలుంటాయని భూమి సమస్యలపై పని చేస్తున్న నిపుణుల అంచనా. అయితే భూ భారతి సదస్సుల్లో 8.65 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెపుతున్నది. కానీ చాలా సదస్సుల్లో అధికారులు దరఖాస్తులు తీసుకోలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ధరణితో భూదోపిడీ జరిగిందని నాటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతం పడేస్తామని, కొత్త చట్టం తీసుకొస్తామని ఊదరగొట్టారు. కానీ.. క్షేత్రస్థాయి అమలులో భూభారతి రైతుల సమస్యలు తీర్చలేకపోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూమి సమస్యల పరిష్కారం కోసం తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులే సాక్షి. సమస్యలను పరిష్కరించాల్సిన భూభారతి.. ఆ సమస్యల సుడిగుండంలోనే ఎందుకు చిక్కుకుందన్న చర్చలు సాగుతున్నాయి.
ప్రధాన భూమి సమస్యలు ఇవే
తెలంగాణలోని వ్యవసాయ భూములు ప్రధానంగా 42 రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భాగ పంపకాలు, నిషేధిత ఆస్తుల జాబితా, ఆసైన్డ్ భూములు, సాదాబైనామా, వైవాటి కబ్జాలు, సీలింగ్ పట్టా భూములు, పట్టా భూములు అసైన్డ్ భూములుగా- ప్రభుత్వ భూములుగా, రికార్డ్‌ల్లో తక్కువ, ఎక్కువలు (ఇవి దాదాపు 80 వేల సమస్యలున్నాయి), విస్తీర్ణం హెచ్చు తగ్గులు, అటవీ/ రెవెన్యూ సరిహద్దుల పంచాయితీ, నాలా కన్వర్షన్ తదితర సమస్యలున్నాయి. కాలువలు, రహదారులు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం రైతుల వద్ద నుంచి భూమిని సేకరిస్తుంది. ప్రభుత్వం ఆయా అవసరాల కోసం తీసుకున్న మేరకు కాకుండా మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కోరినా పట్టించుకునేవారు లేరు. ఒకరిద్దరు రైతులు భగీరథ యత్నం చేసి.. తొలగింపజేసుకున్నా.. ఒక ట్రాన్సాక్షన్ అయిన తర్వాత అమ్మిన వాడి భూమి, కొనుగోలు చేసిన వాడి భూమి మొత్తం తిరిగి నిషేధిత జాబితాలోకి అటోమెటిక్‌గా వెళుతున్నదని రైతులు చెబుతున్నారు. పట్టా భూమి అయినా వివిధ కారణాల వల్ల వరుసగా 12 ఏళ్లుగా అక్కడ రహదారి ఉంటే తిరిగి దానిని రహదారిగానే కొనసాగించాలి. కానీ భూమి విలువ అమాంతం పెరగడంతో అనేకచోట్ల రైతులు రహదారులను కూడా ఆక్రమించుకున్నారు. ఇటీవల గరిడేపల్లి మండలంలో ఒక రైతు తన భూమిలోకి దారి కోసం పట్టా భూమిని కొనుగోలు చేసి దారి వేసుకుంటే పక్క పొలం రైతు ఏకంగా ఆ రహదారినే తన పొలంలో కలుపుకొన్నాడని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు రైతుల మధ్య తగాదాకు దారి తీస్తున్నాయి. అసైన్ దారులు తమ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను వివిధ అవసరాల కోసం పక్కనే ఉండే పేద రైతులకు అమ్ముకున్నారు. కానీ అవి వారి పేరున పట్టా కాలేదు. వాస్తవంగా అలాంటి అసైన్డ్ భూములు తిరిగి పేద వారే కొనుగోలు చేసుకుంటే ప్రభుత్వం వాటిని రీ అసైన్ చేస్తూ పట్టా ఇవ్వాలి. ఇలాంటి దరఖాస్తులు అనేకం పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.
తీవ్రంగానే సాదాబైనామాల సమస్య
రాష్ట్రంలో సాదాబైనామా భూముల సమస్య తీవ్రంగానే ఉన్నది. 2020 నాటికే సాదాబైనామా దరఖాస్తులు 9.50 లక్షలున్నాయి. దీనిపై కోర్టులో స్టే ఉన్నది. కేసీఆర్ సర్కారు నాడు స్టే వెకేట్ చేయించలేదు. ఇప్పుడు చట్టం మారింది. ఈ చట్టంలో 2020 నాటి దరఖాస్తులు మాత్రమే పరిష్కరించే అవకాశం కల్పించారు. దీనికి కూడా కోర్టు స్టే వెకేట్ చేయించాలి. ఇప్పటి వరకు అందుకు చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటికీ ఆ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవి కాకుండా మరో నాలుగైదు లక్షల సాదాబైనామా కొత్త దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రీసర్వేతోనే పరిష్కారం
విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు సవరించాలంటే సర్వే నంబర్లు రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించాలి. అనేక చోట్ల భూమి లేని వారికి పాస్ బుక్‌లు ఉన్నాయి. వాస్తవంగా భూమి ఉన్న వాడికి తక్కువ భూమి నమోదైంది. కొంత మందికి పట్టా ఉంది కానీ భూమి లేదు. భూమి ఉన్న వారికి పాత పట్టా ఉంటుంది.. కానీ కొత్త పాస్ బుక్ రాలేదు. ఇలాంటి సమస్యలను ఎంజాయ్‌మెంట్ సర్వే చేస్తేనే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని భూమి నిపుణులు చెపుతున్నారు. ఆర్డీవోకు రూ.5 లక్షల లోపు విలువ ఉన్న భూమి సమస్యలను పరిష్కరించే అధికారం ఉంది. కానీ సమస్య ఉన్న భూమి మేరకు కాకుండా మొత్తం సర్వే నంబర్ వాలిడేషన్ చూపించటంతో ఆ భూమి విలువ అమాంతం పెరిగిపోతున్నది. దీంతో ఆర్డీవోలు పరిష్కరించలేక పోతున్నారు. ఒక సర్వే నెంబర్‌లో కొంత భాగం ఏదైనా నాలా కన్వర్షన్ జరిగితే మొత్తం సర్వే నంబర్‌ను వ్యవసాయేతర భూమిగా చూపిస్తున్నారు. వారికి రైతు భరోసా సహాయం అందించడం లేదు.
భూ భారతి వచ్చినా పరిష్కారాల్లేవు
ధరణి బంగాళా ఖాతంలో కలిసింది. దాని స్థానంలో భూ భారతి వచ్చింది. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్వోఆర్- 1971 చట్టం ప్రకారం తాసిల్దార్లకు భూమి సమస్యలు పరిష్కరించే అధికారం ఉండేది. అలాగే ఆర్డీవోలకు కూడా. ఎంత పెద్ద భూమి సమస్య అయినా ఎక్కువలో ఎక్కువగా జాయింట్ కలెక్టర్ వరకు వెళితే పరిష్కారం అయ్యేది. 10 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వీఆర్వోలు, తాసిల్దార్లు, ఆర్డీవోలపై అవినీతి అధికారులన్న ముద్ర వేసి, పూర్తి అపనమ్మకంతో ఆయా అధికారులకు ఉన్న అధికారాలన్నింటిని రద్దు చేశారు. ఆర్వోఆర్ 2020 (ధరణి) చట్టం తీసుకొచ్చారు. వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. దీంతో సమస్యలన్నీ పెండింగ్‌లో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ధరణిలోనే తాసిల్దారు, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరిగింది. భూభారతి చట్టం అన్ని సమస్యలకూ పరిష్కారం చూపినా ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఇచ్చే విషయంలో అధికారాలన్నీ కలెక్టర్‌కే కట్టబెట్టారు. భూ భారతికి ముందు తాసిల్దార్లకు ఇచ్చిన అధికారాలు కూడా తీసి వేయడంతో రైతులకు చెందిన సమస్యలపై పైకి రిపోర్ట్‌లు రాయడం తప్ప పరిష్కరించలేక పోతున్నారు. దాదాపుగా ఆర్డీవో పరిస్థితి కూడా అలాగే ఉందని చెపుతున్నారు. రూ. 5 లక్షల భూమి విలువ నిబంధనతో అన్ని దరఖాస్తులు కలెక్టర్ దగ్గరకే వెళుతున్నాయని, దీంతో సమస్యలన్నీ పెండింగ్‌లో ఉంటున్నాయని సీనియర్ రెవెన్యూ అధికారి ఒక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ఎంత గొప్పగా ఉందో అధికారాల వికేంద్రీకరణ అంత గొప్పగా లేక పోవడవడంతోనే కథ మొదటికి వచ్చిందని చెపుతున్నారు. కొత్త చట్టం తీసుకు వచ్చిన అధికారులు చట్టానికి తగినట్లుగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ ధరణి సాఫ్‌వేర్‌కే పేరు మార్చి, ప్యాచ్ వర్క్ చేస్తూ పని కానిచ్చేస్తున్నారు. తాపిల్దార్లకు, ఆర్డీవోలకు, జాయింట్ కలెక్టర్లకు గతంలో ఉన్న విధంగా 1971 ఆర్వోఆర్ చట్టం తరహాలో అధికారాల వికేంద్రీరణ జరిగితేనే భూమి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భూమి నిపుణులు చెపుతున్నారు. చట్టం ఎంత గొప్పగా ఉన్న దానిని అమలు చేసే యంత్రాంగం పటిష్టంగా ఉండాలని అంటున్నారు.
దరఖాస్తుకు రుసుము చెల్లించాలా?
తమ సమస్య పరిష్కారం కోసం రైతులు చేసుకునే దరఖాస్తులకు వెయ్యి రూపాయలు వసూలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులను ఉచితంగా తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు భూ భారతి సదస్సుల్లో దరఖాస్తులను ఉచితంగానే తీసుకున్నారు. కానీ.. ఆ తరువాత దరఖాస్తుల కోసం వస్తే మీ-సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెపుతున్నారు. దీంతో రైతులు మీ- సేవ కేంద్రాల్లో రూ.1000 చెల్లించి దరఖాస్తులు చేసుకుంటున్నారు. మండల కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తామంటే ఉచితంగా దరఖాస్తును తీసుకునే అధికారం తమకు లేదని చెపుతున్నారు. కొంతమంది అధికారులు అలా వచ్చిన దరఖాస్తులను తీసుకుంటున్నా.. వాటిని కంప్యూటర్‌లో ప్రాసెస్ చేయడానికి అవకాశం లేక పక్కన పడేస్తున్నారని తెలుస్తున్నది. రైతులకు ఉచిత సేవలు అందిస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేతులెత్తేశారా? అన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
Read More:
Bhu Bharati | తెలంగాణలో భూమి చట్టాలు ఘనం.. అమలు శూన్యం!
Bhu Bharathi | భూ భారతిలో గ్రామ రెవెన్యూ పటాలు ఎక్కడ?
Bhu Bharathi | భూమి సమస్యా? మంత్రిగారు చెప్పాలె! తప్పించుకుంటున్న జిల్లాల కలెక్టర్లు.. 30% కమీషన్‌పై రంగంలోకి బ్రోకర్లు!