Bhu Bharati | తెలంగాణలో భూమి చట్టాలు ఘనం.. అమలు శూన్యం!
భూమి విషయాలకు సంబంధించి.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని విప్లవాత్మక చట్టాలు తెలంగాణకు ఉన్నాయి. కానీ.. అమలు విషయానికి వస్తే అంతంత మాత్రమేనని రైతు సంఘాల నేతులు చెబుతున్నారు. దీంతో కొత్త చట్టాలు వచ్చిన ప్రతిసారీ సమస్యలు కూడా కొత్తగా పుట్టకొస్తున్నాయని అంటున్నారు. పరిష్కారాలు మాత్రం దొరకడం లేదని పేర్కొంటున్నారు.

Bhu Bharati | హైదరాబాద్, జూలై 28 (విధాత): భూమి విషయాలకు సంబంధించి.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని విప్లవాత్మక చట్టాలు తెలంగాణకు ఉన్నాయి. కానీ.. అమలు విషయానికి వస్తే అంతంత మాత్రమేనని రైతు సంఘాల నేతులు చెబుతున్నారు. దీంతో కొత్త చట్టాలు వచ్చిన ప్రతిసారీ సమస్యలు కూడా కొత్తగా పుట్టకొస్తున్నాయని అంటున్నారు. పరిష్కారాలు మాత్రం దొరకడం లేదని పేర్కొంటున్నారు. తెలంగాణలో జాగీర్దార్ అబాలిష్ చట్టం, టెనెన్సీ యాక్ట్, భూమి సీలింగ్ చట్టం, ఆర్వోఆర్ చట్టం, అసైన్డ్ భూముల చట్టం, ధరణి చట్టం, తాజాగా భూ భారతి చట్టం లాంటి విప్లవాత్మక చట్టాలకు లోటే లేదు. ఈ చట్టాలను రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతోనే అవి ఆశించిన ఫలితాలనివ్వకపోగా.. సమస్యలు పేరుకుపోయేలా చేశాయనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
బీఆరెస్ తీసుకు వచ్చిన ధరణి చట్టం రైతులకు, భూ యజమానులకు వ్యతిరేకంగా ఉందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తరువాత సుదీర్ఘ కసరత్తుచేసి.. భూభారతి 5 పేరిట అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కలిగించడం కోసం మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించారు. అయితే.. ఈ సదస్సుల సందర్భంగా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకోకుండా తిరస్కరించిందన్న ఆరోపణలు రైతుల నుంచి వెలువడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 లక్షల పైచిలుకు భూమి సమస్యలున్నాయని ఎన్నికలకు ముందు చెప్పిందని, కానీ రెవెన్యూ సదస్సులో 8.60 లక్‌ుల దరఖాస్తులు మాత్రమే ఎలా వస్తాయని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ధరణి చట్టం అమలు కాలంలో సమస్యలు లక్షల కొద్దీ ఉన్నాయని ఒక రైతు గుర్తు చేశారు. ఇప్పుడు భూభారతి తెచ్చినంత మాత్రాన వాటంతట అవే పరిష్కరామైపోతాయా? అని ప్రశ్నించారు. సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన మార్గం ఎంచుకుని ఎవరో ఒకరు పరిష్కరించాలి కదా? అనేది ఆయన అభిప్రాయం.
చట్టాలు చేయడమే కాదు.. చట్టాలను అమలు చేసే యంత్రాంగం ఒకే లక్ష్యంతో ఏకోన్ముఖమై పని చేస్తేనే ఫలితాలుంటాయని, అలా చేయనప్పుడు ప్రజలు ఆశించిన ఫలితాలు రావని భూమి వ్యవహారాలపై పనిచేసే సీనియర్ న్యాయవాది ఒకరు అభిప్రాయపడ్డారు. ‘చట్టం చేయడమొక్కటే కాదు. చట్టంపైన రైతులకు విస్తృత అవగాహన కలిగించాలి. ఆ చట్టాన్ని అమలు చే
సే క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలి. అన్నింటికి మించి అధికారులు, సిబ్బంది రైతుల కోసం ఎందుకు పనిచేయాలనే విషయంలో వారిని మోటివేట్ చేయాలి’ అని రైతు కమిషన్ సభ్యుడు, ఈ చట్టం రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన నల్సార్ యూనివర్సిటీ అసెంట్ ప్రొఫెసర్ భూమి సునీల్ అభిప్రాయ పడ్డారు. రెవెన్యూ అధికారులకు ఫార్మర్ ఓరియంటేషన్ ఉండాలంటారు. అలాగే తనకు ఫలానా సమస్య ఉంది.. ఈ చట్టం వెలుగులో ఈ విధంగా పరిష్కరించండని అధికారులను నిలదీసి అడిగే విధంగా రైతులకు, భూమి యజమానులకు చట్టంపై అవగాహన ఉండాలని భూమి సునీల్ చెప్పారు. చట్టం అమలుకు చాంపియన్‌లా రెవెన్యూ మంత్రిత్వశాఖ ఉండాలని, భూమి సమస్యల పరిష్కారాన్నిరాష్ట్రస్థాయిలో సొంత ఇంటి పనిలా చేసినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. రఘువీరారెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి ఎల్ఈసీ కార్డులు ఇప్పించారని, ఆయన చొరవతో అనేక మంది కౌలు రైతులకు ఎల్ఈసీ కార్డులు వచ్చాయని సునీల్ గుర్తు చేశారు.
భూ భారతి-2025 చట్టంపై మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు మొక్కుబడిగా నిర్వహించారని, చిత్తశుద్ధితో అవి కొనసాగలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సదస్సులు గ్రామస్థాయిలో జరిగితేనే ఫలితం ఉంటుందని న్యాయనిపుణులు చెపుతున్నారు. ఏపీలో గ్రామ స్థాయిలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను అక్కడికక్కడే స్కాన్ చేసి, కంప్యూటర్లోకి ఎక్కించి, ఒక నంబర్ ఇచ్చేవారు. ఫోన్ నంబర్ను కూడా లింక్ చేయడంతో దరఖాస్తు స్వీకరించినట్టు సంబంధిత నంబర్కు మెసేజ్ వెళ్లిపోయేది. ఆ తర్వాత.. సదరు సమస్య పరిష్కారానికి ఏ అధికారి ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియజేసేవారు. మెసేజ్లో పేర్కొన్న ప్రకారం ఒక అధికారి వచ్చి పరిశీలించి, సమస్య తీవ్రతను బట్టి పరిష్కరిస్తారు. ఆ మేరకు ఎమ్మార్వో నుంచి తుది ఉత్తర్వులు రాతపూర్వకంగా అందిస్తారు. కానీ తెలంగాణలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల దరఖాస్తులు అక్కడికక్కడే కంప్యూటరీకరించలేదు.. కనీసం ఎక్నాలెడ్జ్ మెంట్ కూడా ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. చాలా మంది దరఖాస్తులు తీసుకోలేదని సమాచారం. ఆదిలోనే హంసపాదు అన్నతీరుగా భూభారతి చట్టం అమలు దరఖాస్తుల స్థాయిలోనే అభాసుపాలైందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వం కావాలనే రెవెన్యూశాఖను నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. బీఆరెస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు కూడా భూమి పరిపాలనకు కేంద్ర బిందువైన సీసీఎల్ఏను పూర్తి స్థాయిలో ఎందుకు నియమించడం లేదన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు.. ఒక్క రేమండ్ పీటర్ పనిచేసిన 7 నెలల కాలం మినహాయించి.. పూర్తిస్థాయి సీసీఎల్ఏ నియామకం జరుగలేదు. కొంతకాలం సీఎస్ ఇన్చార్జ్గా, మరికొంత కాలం రెవెన్యూశాఖ కార్యదర్శిని ఇన్చార్జ్గా నియమించారంటే ఈ ప్‌ెభుత్వాలు భూమి పరిపాలనలో ఏమి ఫలితాలు ఆశిస్తున్నట్లో అర్థం కావడం లేదని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు.
భూ పరిపాలన సజావుగా సాగితేనే భూమి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత గొప్పచట్టం ఉన్నా దానిని అమలు చేసే యంత్రాంగమే కీలకం. ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం లేదన్న భావనను సీనియర్ న్యాయవాది ఒకరు వ్యక్తం చేశారు. మండల స్థాయిలో సిబ్బంది, గ్రామ స్థాయి అధికారులు వెంటనే రావాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అద్భుతమైన భూ భారతి చట్టం తెచ్చామని చెపుతున్న ప్రభుత్వం రూల్స్లో క్షేత్రస్థాయిలో ఉండే తాసిల్దార్లకు అధికారాలు బదలాయించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. బీఆరెస్ ప్రభుత్వం తరహాలో తాసిల్దార్లను రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు పరిమితం చేశారని అంటున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే క్షేత్రస్థాయి అధికారులకు కీలక అధికారాలు లేకపోతే ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఆటోమెటిక్గా కలుగుతుందనే అభిప్రాయాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ అభిమాని వ్యక్తం చేశారు. ఇప్పటికే తాసిల్దార్లు కావాలనే దరఖాస్తులు తీసుకోలేదన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ తయారీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తాసిల్దార్లకు ఇచ్చిన అధికారాలను కట్ చేశారని, అలాగే సాదాబైమా అమలులో చేయాల్సిన మార్పులు చేయలేదని చెపుతున్నారు. ముఖ్యంగా కోర్టులో ఉన్న స్టే వెకేట్ చేయించాలన్న దిశగా ఆలోచనే చేయనప్పుడు దాదాపు 8 లక్షల వరకు ఉన్న సాదాబైనామా దరఖాస్తులు ఎలా పరిష్కరిస్తారని రెవెన్యూ నిపుణుడొకరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు ఉచితంగానే దరఖాస్తులు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే.. భూ భారతిలో దరఖాస్తుకు రూ.1000 ఫీజు తీసుకోవడం ఏమిటని అంటున్నారు. ఇలాంటి వాటన్నింటినీ మరోసారి పరిశీలించి, రైతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సి వస్తుందని మరో సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయ పడ్డారు.