Dharani Portal Refund | ధరణి పోర్టల్ రిఫండ్ స్కాం.. బకాయిలు వంద కోట్లపైనే.. ఇచ్చింది 13 కోట్లే!
గత బీఆరెస్ ప్రభుత్వంలోని ధరణి పోర్టల్‌లో భూ క్రయవిక్రయాలకు స్లాట్ బుక్ చేసుకుని, దానిని రద్దు చేసుకున్న రైతులకు తిరిగి చెల్లించాల్సినవి సుమారు వంద కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి పోర్టల్‌లో సైతం స్లాట్ రద్దు చేసుకున్నరైతులకు ఆ సొమ్ము వాపస్ చేయడం లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు ఉన్నాయి.
విధాత, హైదరాబాద్:
Dharani Portal Refund | ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని, వివిధ కారణాల చేత స్లాట్ రద్దుచేసుకున్న రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్టాంప్ డ్యూటీని తిరిగి ఇవ్వలేదు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు 26,740 మంది రైతులకు చెందిన 87.60 కోట్ల రూపాయలు ఎగవేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ధరణి వచ్చినప్పటి నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో స్లాట్ బుక్ చేసి క్యాన్సిల్ చేసుకున్న వారికి కూడా నగదు వాపస్ ఇవ్వలేదు. కేవలం కోర్టులలో కేసులు వేసిన వారికి మాత్రమే రిఫండ్ చేస్తున్నారన్న ఆరోపణలు రెవెన్యూశాఖపైన బలంగా వినిపిస్తున్నాయి.
2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య 31,314 మంది రైతులు తమ భూమి క్రయవిక్రయాల కోసం స్లాట్ బుక్ చేసుకొని వీలు కాక స్లాట్‌లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న రైతులు స్టాంప్ డ్యూటీ కింద రూ.100,58,29,734 ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. అయితే స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న రైతులకు తిరిగిప్రభుత్వం ఆ సొమ్మును చెల్లించాల్సి ఉండగా వివిధ టెక్నికల్ కారణాలు చూపి చెల్లింపులు చేయడం లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో బీఆరెస్ సభ్యులు మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. మొత్తం 4574 మంది రైతులకు రిఫండ్ ప్రాసెస్ చేసినట్టు అందులో తెలిపారు. ఇంకా 26,740 మంది రైతులకు రిఫండ్ ప్రాసెస్ చేయాల్సింది ఉందని పేర్కొన్నారు. మొత్తం సుమారు వంద కోట్లకు గాను చెల్లింపులు జరిగింది మాత్రం 13 కోట్లే. ఇంకా సుమారు 87 కోట్ల రూపాయలను ప్రభుత్వం తన వద్దే ఉంచుకున్నది.
Assembly answer Dharani refunds 3Jan26 (1)


విచిత్రం ఏమిటంటే బీఆరెస్ ప్రభుత్వం ధరణితో రైతుల సొమ్ములు కాజేసిందని తీవ్రంగా ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 8,626, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 6,324 మంది రైతులు స్లాట్ రద్దు చేసుకుంటే వారికి కూడా తిరిగి చెల్లింపులు చేయలేదు. అధికారంలోకి వచ్చే వరకు బీఆరెస్ దోపిడీపై యుద్ధం చేసిన కాంగ్రెస్.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే తరహా దోపిడీని కొనసాగించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి స్థానంలో భూ భారతి వచ్చినా ఇలాంటి చిల్లర దోపిడీకి అడ్డు కట్ట పడదా? అని అంటున్నారు. ప్రభుత్వమే తమ సొమ్ములు లాగేసుకుంటే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గంట ముందుగా చెల్లిస్తారు. కానీ నాటి ధరణిలో, నేటి భూ భారతిలో స్లాట్ బుక్ చేసుకునే సమయంలోనే స్టాంప్ డ్యూటీ మొత్తం తీసుకొని ఆ తరువాత స్లాట్ టైమింగ్ మరుసటి రోజుకు ఇస్తున్నారు. దీని వల్ల వివిధ కారణాలతో స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న రైతులు తమ డబ్బులు తిరిగి వెనక్కు రాక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిని మార్చివేసి, స్లాట్ బుక్‌చేసుకున్న రైతులు రిజిస్ట్రేషన్‌కు గంట ముందుగా స్టాంప్ డ్యూటీ కట్టే విధానం తీసుకురావాలని కోరుతున్నారు. అలా అయితే ఏకారణం చేత నైనా స్లాట్ బుకింగ్ రద్దు చేసుకున్నా తమలాంటి వారికి ఎలాంటి ఆర్థిక నష్టం జరుగదని రైతులు చెపుతున్నారు. భూభారతిలో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ధరణి, భూభారతి వార్తలు
Telangana Bhu Bharati | భూ భారతిలోనూ ‘ధరణి’ సమస్యలు! చట్టం గొప్పగా ఉంటే చాలదు.. అమలు కీలకం
Bhu Bharathi | భూ భారతి చట్టం అమలులో జాప్యం.. ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram