Telangana Cabinet Expansion | తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కొత్త ట్విస్టులు.. ఇక గొంతులు లేస్తున్నాయిగా!
ఈ నెల మొదటి వారంలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ గ్రూపు రాజకీయాలతో అటకెక్కిందనే వాదనలు ఉన్న తరుణంలో ఇప్పుడు బహిరంగంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండటంతో మంత్రి వర్గ విస్తరణ ఎప్పటికి అయ్యేనో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

(విధాత ప్రత్యేకం)
Telangana Cabinet Expansion |
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాక రేపుతోంది. ఓవైపు పరిపాలనలో ఎదురవుతున్న సవాళ్లు ఎదుర్కొంటూ, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకోవైపు క్యాబినెట్ విస్తరణ అంశం మరింత సంకటంగా తయారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విస్తరణ ఈ ఉగాదికి జరిగిపోతుందంటూ కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలిచ్చిందంటూ ఆశావహులు సంబురపడ్డారు. మంత్రి వర్గంలోని ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటిలో కనీసం ఐదు.. వీలుంటే మొత్తం అరింటినీ భర్తీ చేసేలా సామాజిక, కులాల సమీకరణలు.. జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం, రాజకీయంగా లాభించే అంశాలను బేరీజు వేసి కాంగ్రెస్ హైకమాండ్ అతికష్టం మీద తుది కసరత్తును గత నెలలో పూర్తి చేసిందని వార్తలు వచ్చాయి.
ఏప్రిల్ మొదటి వారంలో విస్తరణ ఉంటుందని ప్రచారం జరగ్గా.. చివరి నిమిషంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఉమ్మడిగా అధిష్ఠానాన్ని డిమాండ్ చేయడంతో విస్తరణకు బ్రేక్ పడింది. వారికి తోడుగా అటు నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత కే జానారెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని అధిష్ఠానానికి లేఖ రాయడంతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడిందని సమాచారం. ఏడాదిన్నరగా సహనంతో ఎదురుచూసిన ఆశావహులు మరోసారి విస్తరణ వాయిదా పడటంతో మండిపడుతున్నారు. తమకు మంత్రి పదవులు రాకుండా మోకాలడ్డుతున్నారంటూ బహిరంగ విమర్శలతో గొంతెత్తున్నారు.
అడ్డంపడుతున్న వారిపై ఆశావహుల ఫైర్
మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న వారిలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే గడ్డం వివేక్, నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వకుంటే తాను రాజీనామాకు కూడా వెనకాడనంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అల్టిమేటమ్ కూడా ఇచ్చారు.
హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే
రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ జానారెడ్డి లేఖ రాయడం వెనుక తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకునే కుట్ర ఉందని రాజగోపాల్ రెడ్డి ఆదివారం చౌటుప్పల్‌లో ఫైర్ అయ్యారు. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. జానారెడ్డి దృతరాష్ట్రుడి పాత్ర పోషించి, తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడన్నారు. ఒకే ఇంట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు, ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటని రాజగోపాల్ తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు.
‘భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చింది. మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు. ఒక ఎమ్మెల్యేగా నేను భువనగిరి ఎంపీని గెలిపించాను’ అని తన ఘనత చాటుకున్నారు. రాజగోపాల్ అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే స్థాయిలో ఉండడని.. తనకు ఓపిక నశించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో 9మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారని. 11మంది ఎమ్మెల్యేలు గెలిచిన నల్లగొండకు ముగ్గురు మంత్రులు ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు. తాను ఢిల్లీలో పైరవీ చేసే రకం కాదని ఆయన స్పష్టం చేశారు.
మద్ధతుగా ఎమ్మెల్యేలు!
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలు వేదిక మీదనే మద్దతు పలకడం విశేషం. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి లేఖ రాసి అడ్డుకున్నారన్న విమర్శలను జానా అనుచరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఖండించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాలున్న నేపథ్యంలో భవిష్యత్తు కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి లేఖలో సూచించారన్నారు. లేఖలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్ధని ఎక్కడా రాయలేదన్నారు. జిల్లాకు మూడు మంత్రిపదవులు ఇస్తామంటే ఎవరు వద్దంటారని ప్రశ్నించారు.
నాకు అన్యాయం చేస్తారా ?
మరోవైపు.. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లవుతుందని, తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ సోదరులు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని వీడిపోయి, ఎన్నికలకు ముందు మళ్లీ పార్టీలో చేరి ఇప్పుడు మంత్రిపదవులు కావాలంటున్నారని మండిపడ్డారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలోని ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకు అన్యాయం చేస్తారా? పదేళ్లు పార్టీని కాపాడుకొచ్చిన నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నలు గుప్పించారు. తనకు అన్యాయం చేస్తే భరిస్తాగానీ.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆదివాసీ, దళితులు, మైనార్టీల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే భరించేది లేదన్నారు. మాట ఇచ్చిన మేరకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే దేనికైనా సిద్ధమేనంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం లేదా?
గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి జనాభా ఉండగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కేసు అడ్డు వస్తుందనే భావనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే.. హైదరాబాద్‌పై ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల పెత్తనం ఏంటని గ్రేటర్ కార్యకర్తలు మండిపడుతున్నారు. వద్దన్నా వినకుండా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి తనను నిల్చోబెట్టి జేబులు ఖాళీ చేయించారని, మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని దానం నాగేందర్ మండిపడుతున్నారు.
బాలూ నాయక్‌ను అడ్డుకునేందుకు శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీ!
లంబాడా కోటాలో బాలూ నాయక్‌కు మంత్రి పదవి వస్తుందని గమనించిన కే జానారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి నల్లగొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలూ నాయక్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే శంకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారంటున్నారు. ఈ నెల మొదటి వారంలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ గ్రూపు రాజకీయాలతో అటకెక్కిందనే వాదనలు ఉన్న తరుణంలో ఇప్పుడు బహిరంగంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండటంతో మంత్రి వర్గ విస్తరణ ఎప్పటికి అయ్యేనో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కుటుంబానికి ఒకే మంత్రి పదవి రూల్ ఏమిలేదు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఒక కుటుంబం నుంచి ఒక్కరికే మంత్రి పదవి రావాలని రూల్ ఏం లేదని పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా క్షేత్రంలో పనిచేసే వారు ప్రజల మన్ననలు పొందినప్పుడు ఒక కుటుంబం నుండి ఎంత మంది అయినా మంత్రులు అవ్వొచ్చన్నారు. అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి..ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా పార్టీ నిర్ణయిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.