ఓడిన చోటే గడ్డం బ్రదర్స్ గెలుపు జెండా

కాకా వెంకటస్వామి కుమారులైన గడ్డం బ్రదర్స్ ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వారసత్వంతోపాటు స్వతహాగా రాజకీయ అనుభవంతో రాజకీయాల్లో ఎదురొడ్డుతున్నారు

  • By: Somu    latest    Dec 06, 2023 11:55 AM IST
ఓడిన చోటే గడ్డం బ్రదర్స్ గెలుపు జెండా
  • బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం
  • బీఆరెస్ కుట్రలకు బ్రేకులు వేశారు..
  • దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ కు చుక్కలు
  • ఒకే అసెంబ్లీకి ఇద్దరు అన్నదమ్ములు



విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాకా వెంకటస్వామి కుమారులైన గడ్డం బ్రదర్స్ ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక మార్క్. తండ్రి రాజకీయ వారసత్వంతోపాటు స్వతహాగా రాజకీయ అనుభవంతో రాజకీయాల్లో ఎదురొడ్డుతున్నారు గడ్డం సోదరులు వినోద్, వివేక్. ఇద్దరూ.. ఒకే అసెంబ్లీకి ఒకే జిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఒకే సమయంలో శాసన సభ్యులుగా గెలుపొందడం విశేషంగా చెప్పుకుంటున్నారు.


గత ఎన్నికల్లో ఎవరి చేతిలో అపజయం చెందారో, మళ్లీ పట్టుబట్టి ఇద్దరు అన్నదమ్ములు అదే అభ్యర్థులపైన ఘన విజయం సాధించారు. రాబోయే కాంగ్రెస్ కొత్త ప్రభుత్వ మంత్రివర్గంలో ఇద్దరి అన్నదమ్ముల్లో ఒకరికి చోటు దక్కుతుందని ఆపార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


బీఆరెస్ పాలనకు బుద్ధి చెప్పారు..


మాజీ మంత్రి గడ్డం వినోద్ 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పొటీచేసి, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గడ్డం వినోద్ ఐదేళ్ల తర్వాత అదే దుర్గం చిన్నయ్యపై ఘన విజయం సాధించారు. గడ్డం వివేక్ వెంకటస్వామి 2014లో పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీఆరెస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో అపజయం పాలయ్యారు.


అనంతరం వివేక్ బీఆర్ఎస్ లో చేరారు. పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న సుమన్ అనూహ్యంగా 2018లో బీఆర్ఎస్ తరపున చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వివేక్ బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. దీనికి అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధిష్టానం వద్ద అడ్డుతగిలారన్న ఆరోపణలున్నాయి.


ఈనేపథ్యంలో వివేక్ వెంకటస్వామి బీజేపీలోకి చేరారు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడినుంచీ కూడా ఆయన పోటీ చేయకపోగా, బీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేశాడు. ఈక్రమంలో వచ్చిన హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పై పగతీర్చుకున్నారు. ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేసి, బీజేపీ అభ్యర్థులను గెలిపించడంలో తనవంతు పాత్ర పోషించాడు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేక్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.


చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గిరిగీసి చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ను ఓడించి తన సత్తా చాటుకున్నాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుండి వినోద్, చెన్నూర్ నుంచి వివేక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగి.. గతంలో ఎవరి చేతిలో ఓటమి పాలయ్యారో వారిపై ఇద్దరు అన్నదమ్ములు భారీ మెజారిటీతో విజయం సాధించి శాసనసభకు వెళ్లడం విశేషం. ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒకరికి మంత్రి పదవి కూడా వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పొరుగు నియోజకవర్గాల్లోనే అన్నదమ్ముల పాగా


గత చరిత్రలోకి వెళితే వెంకటస్వామి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని శాసన సభ్యుడిగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టినవారు ఒకరైతే, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై డిల్లీ వెళ్ళిన వారు మరొకరు. ఈసారి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒకే జిల్లాలోని పక్కపక్క నియోజకవర్గాల నుండి పోటీ చేసి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు.


అందులో గడ్డం వినోద్ ఒకరైతే, గడ్డం వివేక్ మరొకరు. ఈ ఇరువురు అన్నదమ్ములు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి, బీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించి అసెంబ్లీ బాటపట్టారు.


1999లో రాజకీయాల్లోకి గడ్డం వినోద్


గడ్డం వినోద్ మొదటిసారిగా 1999లో చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బోడ జనార్ధన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. తర్వాత 2009, 2010 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013లో టీఆర్ఎస్ చేరిన వినోద్ 2014లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.


ఆ యేడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి పరాజయంపాలయ్యారు. 2016లో మళ్ళీ టీఆర్ఎస్ లో చేరారు. కానీ 2018లో చెన్నూరు ఆ పార్టీ టికెట్టు దక్కక పోవడంతో బెల్లంపల్లి నియోజకవర్గానికి మారి, అక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి రెండోస్థానంలో నిలిచారు. మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరి తాజా ఎన్నికల్లో ఆపార్టీ టికెట్ పై బెల్లంపల్లి నుంచి పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై విజయం సాధించారు.


ఎంపీగా గడ్డం వివేక్ ప్రస్థానం


గడ్డం వినోద్ సోదరుడైన డాక్టర్ వివేక్ 2009లో పెద్దపెల్లి పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోదరుడు వినోద్ తో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. 2014లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు.


2016లో మళ్ళీ గులాబీ గూటికి చేరిన వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి వరించింది. 2019లో పెద్దపల్లి నుంచి ఆ పార్టీ టికెట్ ను ఆశించిన వివేక్ కు టిక్కెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్.. అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు అసెంబ్లీ బరిలోకి దిగారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై విజయం సాధించారు.