కౌన్సిలర్ల క్యాంపు రాజకీయాలు షురూ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయాల్లో వేగంగా సమీకరణలు మారుతున్నాయి.

- మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపాలిటీలపై కాంగ్రెస్ కన్ను
- ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు
- 11, 12 తేదీల్లో తేలనున్న ఫలితాలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయాల్లో వేగంగా సమీకరణలు మారుతున్నాయి. మొన్నటి దాక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మున్సిపాల్టీలను హస్తగతం చేసుకునే క్రమంలో క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. మంచిర్యాల జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి నోటీసులు జారీ చేశారు.
ఈనేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ విధానాలు నచ్చకపోవడంతో కొంతమంది కౌన్సిలర్లు ఇప్పటికే బీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పి, అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా, 26 మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఈక్రమంలో 20 రోజుల క్రితమే అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్‌ను కలిసి నోటీసులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 11న మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ జరగనున్నది. అందులో భాగంగానే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంప్ నకు తరలివెళ్లారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఇదే తరహాలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీ చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా, చైర్మన్ జక్కుల శ్వేత పార్టీ మారడంతో అవిశ్వాసానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రతిపాదనలు చేశారు.
దీంతో నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న బెల్లంపల్లి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ జరగనుంది. బీఆర్‌ఎస్ కు 20 మంది కౌన్సిలర్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు చెందిన కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంపునకు తరలివెళ్లారు. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం రోజున ఎవరు ఎవరికి మద్దతు తెలుపుతారో వేచి చూడాల్సిందే?.