- ఎమ్మెల్సీ సారయ్య సారథ్యంలో పావులు కదుపుతున్న కొండా వ్యతిరేకులు
- తాజాగా తూర్పులో ఎస్సీ, ఎస్టీ కేసులపై డీజీపీకి ఫిర్యాదు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Warangal Congress Internal Fight | వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు వార్ పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తున్నది. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు లక్ష్యంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నాయకత్వంలో అసమ్మతి వర్గమంతా ఏకమై పావులు కదుపుతోంది. కొండా దంపతులు తూర్పు నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, స్వంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే వేధింపులకు గురిచేస్తున్నారంటూ సమస్యను లేవనెత్తి చర్చను తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలోనే తూర్పులో పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడం ఇప్పుడు తూర్పు కాంగ్రెస్ లో కాక పుట్టిస్తోంది.
పట్టు బిగుస్తున్న కొండా వ్యతిరేక వర్గం
ఇటీవల కాంగ్రెస్ లోని కొండా వ్యతిరేక వర్గమంతా ఒక్కటయ్యారు. నియోజకవర్గంలో వారికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తూ తమ స్వరం పెంచారు. కొద్ది రోజుల వరకు చాపకింద నీరులా తమ కార్యకలాపాలు నిర్వహించిన అసమ్మతి వర్గం ఇటీవల ఒక్కో మెట్టెక్కుతూ కొండా వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ అంశంలో కొండా వ్యతిరేక వర్గం క్రమంగా బలం పుంజుకుంటోందని కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. మంత్రి ఏక పక్ష విధానాలు, వ్యక్తివాద పద్ధతుల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయాన్ని పెంపొందిస్తూ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించాలంటే కొండా నాయకత్వాన్ని వ్యతిరేకించాల్సిందేననే గట్టిపట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నూతన అధ్యక్షుడిని తమ అనుకూల వ్యక్తిని ఎంపిక చేసుకోవడంలో కొండా వ్యతిరేక వర్గం విజయవంతమైంది. నూతన అధ్యక్షునిపై కొండా వర్గం కక్షకట్టిందనే అభిప్రాయాన్ని పార్టీలో చర్చనీయాంశంగా మార్చారు. కొండా వ్యతిరేకులంతా ఒక్కరొక్కరుగా కలిసిపోయి సంఘటితమవుతున్నారు.
సారథ్యం వహిస్తున్న సారయ్య
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నాయకత్వంలో కొండా వ్యతిరేక వర్గమంతా ఒక్కటిగా సమీకృతమవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కొండా దంపతులకు వత్తాసు పలికిన ఏసీపీ నందిరామ్ నాయక్ పై బదిలీవేటు పడే విధంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏసీపీ నందిరామ్ నాయక్ తోపాటు సీఐ గోపీ, ఎస్ఐల పై విచారణ జరిపించి సస్పెండ్ చేయించారు. తూర్పులో డివిజన్ల వారీగా కొండా వ్యతిరేక వర్గం సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ చిల్లర సమావేశాలు, చిల్లరగాండ్లంటూ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. దీనికి అంతేఘాటుగా ఈ చిల్లరగాళ్ళు పనిచేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచి మీరు మంత్రయ్యారంటూ విమర్శించారు. కొండా దంపతులు పార్టీకి నష్టం చేస్తున్నారంటూ పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
డీజీపీని కలిసిన ఎమ్మెల్సీ సారయ్య
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిని కలిసి గత సంవత్సరం మార్చి నెలలో ఖిలా వరంగల్ లో జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసు ఇంతవరకు చర్య తీసుకోలేదని, నిందితులను కనిపెట్టి అరెస్టు చేయలేదన్నారు. 2023 డిసెంబర్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మూడు పోలీస్ స్టేషన్లో కొందరి ప్రముఖులపై, సామాన్య జనాలపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీతో పాటు ఇతర కేసులపై పునః విచారణ చేయాలని కోరారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. పోలీసులు తమ విధుల్లో పారదర్శకత ప్రదర్శించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయబద్ధంగా,ధర్మబద్ధంగా మసులుకునే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని సారయ్య కోరారు. కొద్ది రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నందు గాను ధన్యవాదాలు తెలియజేశారు. సారయ్య తాజా ఫిర్యాదు ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కొండా దంపతులు ఏకపక్షంగా వ్యవహరించి పోలీసు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అక్రమ కేసులు బనాయించారని ఈ వర్గం నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ఈ ఫిర్యాదు పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది.
Read Also |
New District | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిల్లాల పునర్విభజన!
YouTuber Anvesh : యూట్యూబర్ అన్వేష్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? అతడిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి?
MSG | సంక్రాంతికి మెగాస్టార్ సందడి .. పవర్ ఫుల్ పోస్టర్‌తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్
