- 3.47 లక్షల బోగస్ కార్డులు
- ఐటీ చెల్లింపుదారులు, పీఎం కిసాన్ జాబితాతో వడపోత
- ఏడాది అవుతున్నా కిమ్మనని పౌర సరఫరాల శాఖ
విధాత, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డుల లబ్ధిదారుల వడపోత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వన్ నేషన్ వన్ కార్డు అమలులోకి రావడంతో దేశంలో ఎప్పటికప్పుడు చనిపోయిన వారి పేర్లు తొలగింపు నిరంతరం జరుగుతూనే ఉన్నది. అయితే బోగస్ లబ్ధిదారుల ఏరివేత మాత్రం ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.5 కోట్ల ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా, ఇందులో సుమారు 3.47 లక్షల కార్డులు బోగస్ అని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. ఈ కార్డులను తక్షణమే రద్దు చేసేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ 2025 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.
కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఆదేశం ప్రకారం ప్రాథమిక విచారణ జరపగా 1.44 లక్షల బోగస్ కార్డులు ఉన్నట్లు తేలింది. ఈ కార్డులను తొలగించాలని కోరుతూ పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయం నుంచి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫైలు వెళ్లింది. ఫైలును పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుది ఆదేశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏం చర్యలు తీసుకున్నారంటూ కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ నుంచి రిమైండర్లు వస్తుండడంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తెలంగాణ లో ప్రస్తుతం 1 కోటి 5 లక్షల 42వేల 188 ఫుడ్ సెక్యూరిటీ కార్డులున్నాయి. 3 కోట్ల 39 లక్షల 96 వేల 239 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున ప్రతినెలా సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో 80 శాతానికి పైగా లబ్ధిదారులు బియ్యం సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. సన్న బియ్యం సూపర్ సక్సెస్ అయ్యిందనే టాక్ రావడంతో ప్రభుత్వం కూడా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు. బియ్యంలో నూకలు, తవుడు, రాళ్ల శాతాన్ని మరింత తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్ని రాష్ట్రాలను కోరింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని తేల్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), పీఎం కిసాన్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా (ఎంఓఆర్టీహెచ్) విభాగాల నుంచి సేకరించిన డేటాతో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల లబ్ధిదారుల పేర్లను వడపోశారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, కస్టమ్స్ పన్నులు చెల్లించే వారు, పీఎం కిసాన్ లబ్ధిదారులు, జాతీయ రహదారులపై నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే యజమానుల వివరాలను సేకరించి పోల్చి చూశారు.
రెండు జాబితాలను జల్లెడ పట్టిన తరువాత మొత్తం 1 కోటి 5 లక్షల మంది లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని తేల్చింది. వీరంతా 3.47 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కలిగి ఉన్నారని తేల్చింది. 3.47 లక్షల మంది కార్డుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ జరపాలని, వివరాలు సేకరించి పోల్చుకున్న తరువాత తొలగించాలని గతేడాది కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన వారి పేర్లు, కొన్ని నెలలు రేషన్ తీసుకోకుండా ఉన్నవారిని గుర్తించి తొలగించాలని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ నాటికి అనర్హులను తొలగించి తమకు పంపించాలని రాష్ట్రాన్ని కోరింది.
కేంద్రం ఆదేశం మేరకు పౌర సరఫరాల అధికారులు మొదటి విడతగా 1.44 లక్షల కార్డులు తొలగించాల్సి ఉందని నివేదిక తయారు చేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారని సమాచారం. వివరాలు పరిశీలించిన తరువాత తుది ఆదేశాలు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చే బదులు ముఖ్యమంత్రి కోర్టులోకి బంతి విసిరారు. ముఖ్యమంత్రి ఆదేశం కోసం వెళ్లిన ఫైలు నెలలు గడుస్తున్నా ఆమోదం లభించడం లేదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు మిగతా ప్రాంతాల్లో మున్సిఫల్ ఎన్నికల దృష్ట్యా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా సంశయిస్తున్నట్లు చర్చలు సాగుతున్నాయి. వడపోతకు ఆమోదం తెలిపితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే ప్రమాదం ఉందనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారంటున్నారు. ఏ చర్యలు తీసుకున్నారంటూ కేంద్రం నుంచి రిమైండర్లు రావడంతో ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక పౌర సరఫరాల శాఖ మౌనముద్ర దాల్చింది.
