- ఇక ప్రతి ఫ్యామిలీకి ఐడీ నెంబర్
- ‘సర్’ లొల్లితో సర్కార్ దిద్దుబాటు చర్యలు
విధాత, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రభుత్వం అందచేసే సేవలు అర్హులైన వారికి అందచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్టర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణ రెవెన్యూ శాఖ జూలై 25వ తేదీన (జీవో ఎంఎస్ నంబర్ 172) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవో కాపీని తెలంగాణ ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ 2026) కార్యక్రమం నిర్వహిస్తున్నది. అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న సర్ లో పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాము భారతీయులం అనేది నిరూపించుకునేందుకు కొన్ని పత్రాలను రుజువుగా జతపర్చాలని కోరిన విషయం తెలిసిందే. ప్రధానంగా సర్-2002 పేర్లు లేని వారు, ఎలాంటి రుజువు పత్రాలు లేని వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను తెరమీదకి తెచ్చిందనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికిప్పుడు అవసరం రాకపోయినా భవిష్యత్తులో ఇదొక ఆధారంగా చూపించే వెసులుబాటు పౌరులకు ఉండనున్నది.
ఎవరు జారీ చేస్తారు?
మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను సంప్రదాయ విధానంలో కాకుండా ఎలక్ట్రానిక్ రిజిస్టర్ రూపంలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే తమ వివరాలను పొందే విధంగా రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఐడీ నంబర్ ఇవ్వనున్నారు. రేషన్ కార్డుపై ముద్రించిన నంబర్‌నే ప్రతి కుటుంబానికి కేటాయించనున్నారు. ఇందులో కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. కుటుంబ యజమానితో ఇతర సభ్యులకు ఉన్న బంధుత్వాన్ని స్పష్టంగా ముద్రించనున్నారు. వయస్సుతో పాటు పుట్టిన తేదీ, లింగ భేదం కూడా నమోదు చేస్తారు. ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్ కూడా అందులో పొందుపర్చుతారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామా ప్రకారం ఇంటి నంబర్, వీధి లేదా కాలనీ, గ్రామం, మండలం, జిల్లా పేరును స్పష్టంగా నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా మీ సేవా కేంద్రాలు లేదా ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికేట్ నిర్ణీత రుసుం చెల్లించి పొందవచ్చు. దరఖాస్తు చేసిన రెండు రోజుల తరువాత సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉన్న వివరాల ప్రకారం మండలంలో తహశీల్దార్ జారీ చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
డిజిటల్ సిగ్నేచర్‌తో
మీ సేవ లేదా యాప్ లో అందచేసే దరఖాస్తు సంబంధిత మండల తహశీల్దార్ కు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తులో అందచేసిన వివరాల ప్రకారం ఫుడ్ సెక్యురిటీ కార్డులో ఉన్నాయా లేదా అనే పరిశీలించుకుని జారీ చేసే అధికారం తహశీల్దార్లకు కల్పించారు. తహశీల్దార్ డిజిటల్ సిగ్నేచర్‌తో జారీ చేసే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను మీ సేవా కేంద్రాలు లేదా యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలయ్యే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, అమలు అవుతుందా లేదా అనేది పర్యవేక్షించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ తన ఉత్తర్వులో సూచించారు.
