Jubilee Hills By Election Naveen Yadav  | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌? ఆర్థిక బలం, తోడైన కుల బలగం!

ఆర్థిక బలం ఉంది.. నియోజకవర్గంలో కుల బలగం కూడా తోడైంది. ఇప్పటికే గతంలో ఓడిపోయినందుకు ఓటర్లలో సానుభూతి ఉంది. అంతర్గత సర్వేల్లోనూ అతనికే మొగ్గు కనిపించింది. దీంతో జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ను ఖరారు చేస్తారని కాంగ్రెస్‌ పార్టీలోని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

Jubilee Hills By Election Naveen Yadav  | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌? ఆర్థిక బలం, తోడైన కుల బలగం!

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విధాత)

Jubilee Hills By Election Naveen Yadav  | నోటిఫికేషన్ రాకముందే జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం (by-election campaign) జోరందుకున్నది. గత రెండు వారాలుగా ప్రధాన రాజకీయ పార్టీలు (major political parties) ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా (prestigious) మారాయి. మూడు పార్టీలూ హోరాహోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. సిట్టింగ్ సీటును (sitting seat) ఎలాగైనా దక్కించుకోవాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, తమ ఖాతాలో వేసుకుని సత్తా చూపించాలని కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఉప ఎన్నికల్లో గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (working president KTR ) డివిజన్ల వారీగా జరిగే సమావేశాలకు హాజరవుతున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండడంతో కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి సమయం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ముగ్గురు మంత్రులకు కట్టబెట్టింది. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

నవీన్ వైపే ఎక్కువగా మొగ్గు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులుగా అభ్యర్థుల పేర్లపై జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా విన్పిస్తున్నది. గతంలో పోటీ చేసి ఓటమి పాలు కావడం, ఓటర్లలో సానుభూతి, బీసీలోని యాదవ కులానికి చెందిన వ్యక్తి కావడం (caste equations) కలిసివచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఆర్థిక బలంతో పాటు నియోజకవర్గంలో కుల బలగం కూడా ఉండడంతో ఆయన వైపే పార్టీ ముఖ్య నాయకులు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంత్రులు సేకరించిన అభిప్రాయం ప్రకారం, అంతర్గత సర్వేల్లో కూడా నవీన్ పేరు ప్రథమ స్థానంలో ఉందంటున్నారు. మైనారిటీ ఓటర్లు కూడా ఈయన పేరును ప్రస్తావించారు. ఇన్‌చార్జ్‌ మంత్రులు ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వెల్లడించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. స్థానికులకే టికెట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడాన్ని పరిగణనలోకి తీసుకుంటే నవీన్ యాదవ్ కోసమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కుల గణన చేపట్టడంతో పాటు బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ వైపే ముఖ్యమంత్రి, ఇన్‌చార్జ్‌ మంత్రులు మొగ్గుచూపుతున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలతో పాటు యాదవుల ఓట్లు అధికంగా ఉండడం కూడా ఒక కారణం. మైనారిటీ నాయకుడికి కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ తో అన్నట్లు సమాచారం. ఇది కూడా మరో కారణంగా చెప్పుకోవాలి. ఈ సీటు కోసం కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చివరి క్షణంలో ఏమైనా జరగవచ్చు. ఇప్పటి వరకు విన్పించిన పేరు కాకుండా కొత్త వ్యక్తి తెరమీదికి తీసుకువచ్చిన ప్రకటించే అవకాశాలను తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దూసుకుపోతున్న మాగంటి సునీత

బీఆర్ఎస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును దాదాపు ఖరారు చేశారు. పార్టీ పరంగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కేటీఆర్ ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కలియతిరిగారు. డివిజన్ల వారీగా నిర్వహించే సమావేశాలకు హాజరవుతూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నారు. గోపీనాథ్‌ కుమార్తెలు కూడా గల్లీ ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను కలుస్తున్నారు. సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును గెలిచి కాపాడుకోవడం బీఆర్ఎస్ కు చాలా అవసరం. ఒక వేళ సిట్టింగ్ సీటు కోల్పోతే నగరంలో రెండో ఓటమి అవుతుందనే భయం కూడా వెంటాడుతున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోగా, కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే.

బీజేపీలో ఇద్దరికీ సవాల్

బీజేపీ నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీపడుతున్నా, గెలుపు అంత సునాయసం కాదనేది అందరికీ తెలిసిందే. ఈ సీటు పై కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, పార్టీ నూతన అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. బూత్ స్థాయి ఇన్‌చార్జ్‌లను నియమించడమే కాకుండా.. ఇతర నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు కూడా అప్పగించి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కు ఇవి మొదటి ఎన్నికలు కావడంతో బీజేపీ పెద్దలు ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా చూస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించడం కూడా ఇక్కడ మైనస్ గా మారే సూచనలు ఉన్నాయని కాషాయ కార్యకర్తలు అంటున్నారు.

కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందే

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తీరాల్సిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, పనులపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యులకు స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జీ.వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని ఇన్‌చార్జ్‌లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని వివరించాలన్నారు.

సుమారు నాలుగు లక్షల ఓటర్లు

ఈ నెల 3వ తేదీన ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 3 లక్షల 92వేల 669 మంది ఓటర్లు నమోదు అయ్యారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 2 లక్షల 4వేల 288 మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు ఒక లక్షా 88 వేల 356 మంది ఉన్నారు. మార్పులు, చేర్పులు, కొత్తగా నమోదు చేసుకునేవారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీ వరకు అభ్యంతరాల దరఖాస్తులను పరిశీలించి 30వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.