Local Body Elections Reservations | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘స్థానిక’ రిజర్వేషన్లలో శాస్త్రీయత ఎంత?

స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో గందరగోళం నెలకొందని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. రిజర్వేషన్ల ఖరారులో నిబంధనలు పాటించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారనేది విపక్షాల మాట. అశాస్త్రీయంగా చేసిన రిజర్వేషన్లపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని విపక్షాలు యోచిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు రిజర్వేషన్లను వాడుకున్నారని అధికారపార్టీపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదనేది అధికార పార్టీ వాదన.

Local Body Elections Reservations | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘స్థానిక’ రిజర్వేషన్లలో శాస్త్రీయత ఎంత?

Local Body Elections Reservations | రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను శనివారం రాత్రి ఖరారు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఎస్టీలకు నాలుగు, ఎస్‌సీలకు ఆరు, బీసీలకు 13, మిగిలిన ఎనిమిది జడ్‌పీ చైర్మన్ స్థానాలను అన్ రిజర్వ్ చేశారు. అన్ని కేటగిరీల్లో 50 శాతం పదవులు మహిళలకు రిజర్వ్ చేశారు. 2024 లో కులగణనలో బీసీ జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో గందరగోళం నెలకొందనేది విపక్షాల ఆరోపణ. గద్వాల జిల్లాలోని దోర్నాల గ్రామ పంచాయతీ పరిధిలో 1400 ఓట్లు ఉంటాయి. ఇందులో 1100 ఎస్సీ ఓటర్లు ఉంటారని అంచనా. అయితే ఈ గ్రామ పంచాయతీ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఈ గ్రామ పంచాయతీ ఎస్‌సీలకు రిజర్వ్ కావాలి. కానీ, బీసీలకు రిజర్వ్ అయింది. గతంలో కూడా ఇది ఎస్‌సీలకు రిజర్వ్ అయింది. గత రిజర్వేషన్ కు ఈ సారి మారాలి. ఈ కారణం చేత బీసీలకు రిజర్వ్ చేశారనే వాదన కూడా లేకపోలేదు. తమ గ్రామం ఎస్సీలకు రిజర్వ్ కాకుండా బీసీలకు ఎలా రిజర్వ్ చేశారని గ్రామస్తులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వెలిమినేడు గ్రామ పంచాయతీ ఈసారి జనరల్ కు రిజర్వ్ చేశారు. గతంలో ఇది జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అంతకుముందు కూడా జనరల్ కే రిజర్వ్ అయింది. ఇక ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇందుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు ఎస్టీ ఓటర్లున్నారు. అయినా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ ఇద్దరు ఎస్టీలు కూడా ఈ గ్రామానికి వివాహం తర్వాత వచ్చారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తే ఈ గ్రామం ఎస్టీలకు ఎలా రిజర్వ్ అయిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్‌సీ జనరల్ కేటాయించారు. ఈ జిల్లాలో ఆలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 జడ్‌పీటీసీ పదవులున్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఐదు, ఆలంపూర్ నియోజకవర్గంలో ఎనిమిది జడ్‌పీటీసీలున్నాయి. గద్వాల నియోజకవర్గంలోని ఐదు జడ్‌పీటీసీల్లో ఒక్కటి కూడా ఎస్‌సీలకు రిజర్వ్ కాలేదు. ఎంపీపీలు కూడా ఎస్‌సీలకు రిజర్వ్ చేయలేదు. గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఆలంపూర్ నియోజకవర్గానికి దక్కనుంది. గద్వాల నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను మార్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఒక్క జడ్పీటీసీ, ఒక్క ఎంపీపీ సానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆయా మండలాల జనాభా ఆధారంగా ఆ మండలంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో పాటు అన్ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీల సంఖ్యను నిర్ణయిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో గ్రామ పంచాయితీల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా కొన్ని చోట్ల జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికారపక్షానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చేలా చేశారనేది విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

న్యాయస్థానాలకు వెళ్లే యోచనలో పార్టీలు?

స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు శాస్త్రీయంగా చేయలేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయమై ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాయి. రిజర్వేషన్ల ఖరారు చేసే సమయంలో నిబంధనలు పక్కన పెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియను సరి చేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లే విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు నిబంధనలు పట్టించుకోలేదనేది విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.