Director N. Shankar | మంచి ప్రేక్షకులను చంపుకొంటున్న తెలుగు సినిమా పరిశ్రమ :  ‘విధాత’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఎన్ శంకర్

తెలుగు సినిమా పరిశ్రమంలో ప్రస్తుతం విపరీత ధరణలు చోటు చేసుకుంటున్నాయని, కలెక్షన్ల కోసమే సినిమా తీస్తున్నారు తప్ప ప్రేక్షకుల కోసం కాదని డైరెక్టర్ ఎన్.శంకర్ అభిప్రాయపడ్డారు. అలాగే సినీ ఇండస్ట్రీస్ లో ఎఫ్‌డీసీ తీసుకువచ్చి ప్రభుత్వం సినిమాను బతికించుకోవాలని కోరారు. ప్రేక్షకులు మంచి సినిమాను కోరుకుంటున్నారని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఎదురవతున్న ఇబ్బందులపై 'విధాత' కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు.

Director N. Shankar | మంచి ప్రేక్షకులను చంపుకొంటున్న తెలుగు సినిమా పరిశ్రమ :  ‘విధాత’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఎన్ శంకర్

Film Director N. Shankar | నిర్మాత..డిస్ట్రిబ్యూటర్..ఎగ్జిబిటర్స్ దశలుగా ఉన్న సిని పరిశ్రమ వ్యవస్థ నాలుగో వ్యక్తి చేతిలోకి వెళ్లిందని సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ తెలిపారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో తెలంగాణ ఆత్మ ఉంటుందన్నారు. మట్టి మనుషుల వేదన..ఆవేదన, తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైన సంస్కృతిని పలు సినిమాల్లో డైరెక్టర్లు శాంబెనెగల్ నుంచి నర్సింగరావు, పీ.ఎస్ నారాయణ, పైడి జయరాజ్ లాంటి అనేకమంది సినిమా తెరపైన చూపించారన్నారు. వాళ్ల సినిమాల్లో తెలంగాణ నేపథ్యాన్ని చూపించి సఫలీకృతమైనట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో కమర్షియల్ ప్రకారం భిన్నమైన స్థానం ఉండడంతో తెలంగాణ నటీనటులు ఎక్కువ కాలం పరిశ్రమలో కొనసాగలేకపోయారన్నారు. తాను తీసిన ఎన్‌కౌంటర్ సినిమాలో కల్పితాలు, కొత్తగా సృష్టించినవి ఏమీ లేవన్నారు. ప్రజలకు అవసరమైన ఒక అంశాన్ని చెప్పాలంటే.. సినిమాకు కొంతమేర కమర్షియల్ టచ్ ఇచ్చినప్పుడే సమాజంలోకి ఏ సారాంశాన్ని తీసుకెళ్దామనుకుంటే అది వారి దగ్గరకు చేరే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్, జయం మనదేరా సినిమా చేశానని, ఆ సినిమాలు ప్రజల్లోకి వెళ్లి చర్చ జరిగిందన్నారు.

ఒకప్పుడు నటీనటులు సినిమాల్లో ఉద్యోగులుగా చేశారని, ప్రస్తుతం చాలా మార్పులు సంభవించాయన్నారు. అప్పట్లో ముందు నిర్మాత కథను ఎంపిక చేసుకుని ఆ సినిమాను తగ్గట్టుగా డైరెక్టర్, హీరో ఎంచుకునేవారని తెలిపారు. అలాగే, సినిమాలను తీసే సమయంలో పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలు ఉండేవని, అందులో సినిమా మీద అవగాహన ఉన్నవారే ఉండేవారని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్స్.. ఎగ్జిబిటర్స్ కు మధ్య మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు. నిర్మాతల దగ్గర డబ్బులు లేకపోతే కొన్నిసార్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థలే సినిమా నిర్మాణానికి కావాల్సిన డబ్బులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని.. థియేటర్లు అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. స్లాబ్ సిస్టమ్ రావడంతో థియేటర్లు మెయింటేన్ చేయలేక లీజ్ తీసుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో సినిమా వ్యాపారంగా మారిందని, నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్.. ఎగ్జిబిటర్స్ దశలుగా ఉన్న వ్యవస్థలోకి నాలుగో వ్యక్తి వచ్చాడని.. ఈ నాలుగో వ్యక్తి గుప్పిట్లో మిగతా ముగ్గురు ఉన్నారని శంకర్ తెలిపారు.

మంచి ప్రేక్షకులను తెలుగు ఇండస్ట్రీ చంపుకుంటుంది

సామాజిక నేపథ్యంలో సినిమాలు తీయాలంటే స్ర్కీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న హీరోలతో తీస్తే ఆ సినిమాలు బాగా ఆడుతాయన్నారు ఎన్.శంకర్. ప్రక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు రావడంలేదు.. దీంతో ఒక మంచి తెలుగు సినిమాను చూసే ప్రక్షకులను తెలుగు ఇండస్ట్రీ చంపుకుంటుందన్నారు. ఒక మంచి సినిమాను తీస్తే ఆరాదించడంతో పాటు అభినందనలు కూడా వస్తాయన్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేయడం లేదన్నారు. గతంలో లాగా విభిన్న కథలు ఎంచుకుని చేయగలిగే హీరోలు కావాలన్నారు. అలాగే, కొందరు కష్టపడి చిన్నహీరోలతో సినిమాలు తీసినా సినిమా థియేటర్లకు రాని పరిస్థితి ఉందని, ఒకవేళ వచ్చినా నడవకుంటే వారంలో దాన్ని థియేటర్లలో వేయరన్నారు. దీంతో కొందరు నిర్మాతలు సినిమా తీసినా విడుదల చేయకుండా.. బిడ్డను పురిట్లోనే చంపేసినట్లు విడుదల చేయడం లేదన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారాలని.. ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలి

తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ బతకాలంటే.. పరిస్థితులు మారాలంటే ఎఫ్‌డీసీ( ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) బలోపేతం కావాలని, ఈ మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో ఎన్ఎఫ్‌డీసీ, ఎఫ్‌డీసీలు.. నిర్మాతలు మంచి సినిమా తీస్తే సబ్సిడీ ఇచ్చే పద్ధతి ఉండేదన్నారు. ప్రస్తుతం కూడా ఎఫ్‌డీసీ సినిమాలు నిర్మింస్తూ చిన్న సినిమా నిర్మాతలను కాపాడుకోవాలన్నారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక కళలు అంతరించిపోకుండా మంచి కథాంశాలు వస్తే ఎఫ్‌డీసీ ప్రోత్సహించి అవకాశం కల్పించాలన్నారు. సినిమా నిర్మించడానికి 30శాతం సబ్సిడీ భరించాలని, ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలన్నారు. దీని ద్వారా మంచి సినిమాలు వచ్చే అవకాశముంటుందని, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు. ఎఫ్‌డీసీని బలోపేతం చేసి ఉంటే సమాంతర సినిమాలు బతికేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ అస్థిత్వం సినిమా రంగం మీద ప్రభావం చూపకపోవడానికి కారణం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమేనన్నారు. ఇప్పటికైనా ముందుకు వచ్చి ఎఫ్‌డీసీ బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కథే కాదు..ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లనూ హీరోలే డిసైడ్ చేస్తున్నారు

సినిమాకు ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లతోపాటు కీలక టెక్నీషియన్లను కూడా స్టార్ హీరోలో డిసైడ్ చేస్తున్నారని డైరెక్టర్ శంకర్ తెలిపారు. కమర్షియల్ వేటలో పడి మంచి కథలను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెనింగ్ కలెక్షన్ల కోసమే వారి తాపత్రయమంతా అని అన్నారు. సామాజిక నేపథ్యం ఉన్న కథలను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదని, హిట్ కాంబినేషన్ కోసం చూస్తున్నారన్నారు. పెద్ద సినిమాలే అనే పేరు తప్పా మంచి సినిమాలు అన్న మాటే ఇండస్ట్రీలో కనిపించడం లేదన్నారు. పాత సినిమాలను ఊటంకిస్తూ.. సామాజిక అంశాలపై ఉన్న మంచి కథలను హీరోలు చేస్తే కలకాలం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.

మంచి సినిమా తీస్తే థియేటర్లలోకి వస్తారు

ప్రేక్షకులు ఎక్కవగా ఓటీటీ వైపు మొగ్గుచూపడంపై ఎన్.శంకర్ స్పందించారు. మంచి సినిమా, వాళ్లకు నచ్చే సినిమాలు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారన్నారు. ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపే సినిమా.. ప్రస్తుతం కేవలం టైమ్ పాస్ గా మారిందన్నారు. 3గంటల పాటు ప్రేక్షకులకు అవసరమైన, మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు రావాలని ఆకాంక్షించారు. కానీ, సినీమా ఇండస్ట్రీస్ లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. గద్ధర్ అవార్డుల్లో తెలంగాణకు చెందిన నటీనటులకు అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవార్డుల ఎంపికలో ప్రభుత్వం గైడ్ లైన్స్ పాటించలేదని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నటీనటులకు అవకాశాలు రాలేదన్నారు. దీనికి కొన్ని వ్యక్తి గత కారణాలతో పాటు, సామాజిక కారణాలు ఉన్నాయని వెల్లడించారు.

సినిమా చూడొద్దన్న నేనే సినిమాలు తీస్తున్నా

మొదట్లో సినిమా చూడొద్దన్న తానే సినిమా తీసే స్థాయికి వెళ్లానని.. భారతంలో శంఖారావం సినిమాలో అప్రెంటీస్‌గా మొదలైన తన సినీ ప్రస్థానాన్ని గురించి  వివరించారు. నిజ జీవితంలో అనుకున్న అంశాలను సినిమా తెరపైనే చూపించాలనుకుని సినిమా రంగంలోనే స్థిరపడినట్టు ఎన్.శంకర్ తెలిపారు. తన మొదటి సినిమా ‘ఎన్‌కౌంటర్’ సినిమా తీసే సమయంలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు. ఎన్‌కౌంటర్ షూటింగ్ లో హీరో కృష్ణకు గన్ను ఎలా పట్టుకోవాలో నక్సలైట్ నాయకుడు ఒకరు చెప్పాడని గుర్తుచేసుకున్నారు. అలాగే, ఎన్ కౌంటర్ సినిమాలో ఓ సన్నివేశం కోసం నిజమైన ఎస్‌ఎల్‌ఆర్ గన్స్ వాడినట్టు ఆసక్తి కర సంఘటనను తెలిపారు. బాధ్యతగా తన వృత్తికి ద్రోహం చేయకూడదనే కారణంతోనే ‘జై బోలో తెలంగాణ’ సినిమా తీసినట్లు వివరించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో తనకు అవకాశాలు లేవని ఎన్.శంకర్ తెలిపారు.