Jubilee Hills by Election | కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రచ్చ! పీసీసీ చీఫ్ క్లారిటీ!

Jubilee Hills by Election | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్‌లో టికెట్ రేసులు మొదలయ్యాయి. ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ నుంచి ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్‌కు 64,212 ఓట్లు వచ్చాయి. 16,337 ఓట్లతో ఆధిక్యంతో మాగంటి గెలిచారు. అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లిస్ పోటీ చేయలేదు. త్వరలో జరగనున్న ఉపఎన్నికలో మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అయితే.. ఇతర పార్టీల్లోనే ఇప్పుడు తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ టికెట్ కోసం పోటాపోటీ
అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోను, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆశావహుల్లో కాక రేపుతున్నది. కాంగ్రెస్ టికెట్ కోసం విజయారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం. తన తండ్రి, దివంగత పీజేఆర్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కావడం తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారు. నవీన్‌యాదవ్, ఫిరోజ్ ఖాన్, ఇర్ఫాన్ అజీజ్, ఫాహీమ్ ఖురేషీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 2023 ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపుతో ఖాతా తెరిచింది.
మైనార్టీకి ఇస్తే మంత్రి పదవి గ్యారెంటీ!
రాష్ట్ర మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం లేదు. అందులోనూ మైనార్టీల నుంచి క్యాబినెట్‌లో మంత్రులు కూడా లేరు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. హైదరాబాద్ కోటాతోపాటు.. మైనార్టీ కోటాలో మంత్రి పదవి గ్యారెంటీగా దక్కుతుందనే చర్చలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోటీకి ఆశావహులు ఆసక్తిగా ఉన్నారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టకపోతే తమ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
రచ్చ రేపిన అజారుద్ధీన్ ప్రకటన
జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను మళ్లీ పోటీలో ఉన్నట్లు మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని, తక్కువ ఓట్లతో ఓడిపోయానని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని సొంత పార్టీ వారే పనిగట్టుకుని ప్రచారం చేయిస్తున్నారని.. వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అజార్ చెప్పుకొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని, గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తానని చెప్పారు.
ఆశావహుల ప్రకటన ఫైనల్ కాదు: టీపీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ తనే పోటీ చేస్తున్నట్లుగా మహ్మద్ అజారుద్దీన్ చేసిన ప్రకటన ఫైనల్ కాదని టీపీసీసీ చీఫ్ బీ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటే అదే ఫైనల్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఓ ప్రొసీజర్ ఉందని చెప్పారు. ఆశావహులు చేసుకున్న దరఖాస్తులను పీసీసీ పరిశీలించి పీఈసీకి పంపిస్తామని, వడ పోత అనంతరం మూడు నుంచి ఐదు పేర్లను సీఈసీకి పంపిస్తామని తెలిపారు. అభ్యర్థి పేరును సీడబ్ల్యూసీ అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు. వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న కొండా మురళీ వర్సెస్ కడియం శ్రీహరి పంచాయితీ గాంధీ భవన్ కు వచ్చిందని.. ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. డీసీసీ నివేదిక తర్వాత క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మంత్రులు తమ శాఖకు పరిమితమైతే మంచిదన్న ఆయన.. ఇష్టారీతిన మాట్లాడితే నష్టం పార్టీకేనని గుర్తించాలని నేతలకు హితవు పలికారు.