Kaleshwaram BJP | కాళేశ్వరంపై బీజేపీ నేతల భిన్న వైఖరులు! ఈటల అలా.. బండి ఇలా!!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న బండి.. తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ వైఖరే తమ పార్టీ వైఖరి అనికూడా అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఏ ఆధారాల్లేకుండా చెబుతారా? అంటూ ఎదురు ప్రశ్నించారు.

Kaleshwaram BJP | పార్టీ ఒక్కటే. భారతీయ జనతా పార్టీ. ఇద్దరు ఎంపీలూ ఆ పార్టీవారే. ఒకరు కేంద్రమంత్రి బండి సంజయ్.. మరొకరు ఈటల రాజేందర్. తెలంగాణలో ఇద్దరూ కీలక నేతలు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మాత్రం రెండు నాల్కల ధోరణి అన్నట్టు తయారైంది. ఇద్దరి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పార్టీలో వీరిద్దరి మధ్య విభేదాలున్నాయా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈటల రాజేందర్ తీరుతో రాష్ట్ర బీజేపీకి డ్యామేజీ జరిగిందనే అభిప్రాయం పార్టీలో నెలకొంది. దీన్ని అరికట్టేందుకు బండి సంజయ్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగా కాళేశ్వరంపై ఈటల చెప్పిన అంశాలకు భిన్నంగా బండి తన అభిప్రాయం వ్యక్తం చేశారంటున్నారు. ఇద్దరూ కలిసి జనం చెవిలో ‘పువ్వు’ పెడుతున్నారా? అనే మరో అనుమానం కూడా అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఈటల మాటలపై విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. తదుపరి రాజకీయ పరిణామాల్లో ఈటలను నిర్ధాక్షిణ్యంగా మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఈటల బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఆ ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయాయి. ఈ కారణంగా ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులతోపాటు.. అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలను సైతం కమిషన్ విచారించింది. అయితే.. విచారణతోపాటు అనంతరం మీడియాతో ఈటల చెప్పిన అంశాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్నింటికి మించి బీజేపీని ఇరకాటంలో పడేశాయి. బీఆర్ఎస్ నేతలను రక్షించారని ఈటలపై విమర్శలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుందని, క్యాబినెట్ నిర్ణయం మేరకు ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. మంత్రివర్గ సబ్ కమిటీ సూచన మేరకు మేడిగడ్డ స్థల నిర్ణయం జరిగిందని కూడా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే డిజైన్ చేశానని కేసీఆర్ గతంలో చెప్పుకోగా.. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా సాగలేదన్న విషయం ఈటల చెప్పడం రాజకీయంగా సంచలనం రేపింది. దీంతో బీఆర్ఎస్‌ను రక్షించేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈటల తీరుపై బీజేపీ నేతల్లో సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని సమాచారం. నష్టనివారణ చర్యల్లో భాగంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. కమిషన్ ఎదుట ఈటల బీజేపీ నేతగా హాజరుకాలేదని, మాజీ మంత్రిగా మాత్రమే వెళ్లారని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేసినా.. అది పొసగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ పగ్గాలను ఈటలకు అప్పగిస్తారనే చర్చలు సాగాయి. ఆయన పదవికి కూడా ఈ వ్యాఖ్యలు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో హాట్‌హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు, బీజేపీలో రచ్చకు దారి తీశాయని అంటున్నారు. బండి స్పందన ఈటల వాదనకు భిన్నంగా ఉండటమే కాకుండా.. ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం అంశంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే అంశం వారిద్దరి మాటలతో బయటపడిందని అంటున్నారు.
ఈటలకు బండి కౌంటరా?
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న బండి.. తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ వైఖరే తమ పార్టీ వైఖరి అనికూడా అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఏ ఆధారాల్లేకుండా చెబుతారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. పార్టీ నేతలు అమిత్ షా, నడ్డా కూడా ఇదే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. పార్టీ వైఖరికి భిన్నంగా తమ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా తప్పేనని తేల్చిచెప్పారు. ఇది ఈటల కౌంటర్ ఇవ్వడమా? లేక ఆయనను టార్గెట్ చేయడమా? అనే సందేహాలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి.