ట్యాపింగ్‌ను మించిన భూతం రానున్నదా?

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూ రాష్ట్రంలో సృష్టించిన, సృష్టిస్తూనే ఉన్న కలకలం అంతా ఇంతా కాదు. దీనిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అతిపెద్ద అంశంగా మార్చింది.

ట్యాపింగ్‌ను మించిన భూతం రానున్నదా?

గతంలో దేశవ్యాప్తంగా పెగాసస్‌ సంచలనం
అన్ని రంగాల ప్రముఖులు టార్గెట్‌
సొంత మంత్రులనూ వదలలేదు
అదే పద్ధతిలో తెలంగాణలో ట్యాపింగ్‌!
ఆనాడు దుమ్మెత్తిపోసిన రేవంత్‌, రాహుల్‌
నిఘా బాటలో నేటి కాంగ్రెస్‌ సర్కార్‌?
మొబైల్‌ ఫోన్స్‌, సోషల్‌ మీడియా
ఇక నుంచీ ప్రభుత్వం గుప్పిట్లో!
ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ కలకలం
ప్రజలను టార్గెట్‌ చేసే పలు టూల్స్‌!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (విధాత ప్రతినిధి) : టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూ రాష్ట్రంలో సృష్టించిన, సృష్టిస్తూనే ఉన్న కలకలం అంతా ఇంతా కాదు. దీనిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అతిపెద్ద అంశంగా మార్చింది. అంతకు ముందే కేంద్రంలో మోదీ సర్కార్‌ సొంత పార్టీ మంత్రులతోపాటు, రాహుల్‌ గాంధీ తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులు, పలువురు కీలక జర్నలిస్టుల ఫోన్లలోకి పెగాసస్‌ స్పైవేర్‌ను చొప్పించిందన్న ఆరోపణలు దేశంలో సంచలనం రేపాయి. నిజానికి టెలిఫోన్‌ ట్యాపింగ్‌, లేదా స్పైవేర్‌ను చొప్పించడం అనేది కొందరు నిర్దిష్ట వ్యక్తులను మాత్రమే టార్గెట్‌ చేసింది. కానీ.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కోసం కొనుగోలు చేస్తున్న అప్లికేషన్లు, టూల్స్‌ పరిశీలిస్తే.. యావత్‌ ప్రజల సామాజిక మాధ్యమాల ఖాతాలను టార్గెట్‌చేసేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌లపై, పెగాసస్‌పై రచ్చ రచ్చ చేసిన కాంగ్రెస్‌.. తెలంగాణలో అధికారంలోకి రాగానే దాని పరిధిని మరింత విస్తరించే ప్రయత్నాలకు తెర తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (TSTS) ఆధ్వర్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కోసం అవసరమైన వివిధ రకాల సైబర్‌ నేరాల దర్యాప్తు టూల్స్‌, లైసెన్స్‌ల కోసం టెండర్లు ఆహ్వానించారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌, సురక్షిత మౌలిక సదుపాయాలను ఉపయోగించి ఎవిడెంట్‌ మెయింటనెన్స్‌, కంప్లైంట్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యాలను మెరుగుపర్చడం ఈ కొనుగోళ్ల ఉద్దేశంగా చెబుతున్నప్పటికీ.. కొనుగోలు చేస్తున్న టూల్స్‌ గమనిస్తే పెద్ద టార్గెట్‌ ఉన్నదనే అభిప్రాయాన్ని సైబర్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

టెండర్‌లో పేర్కొన్న టూల్స్‌/సాఫ్ట్‌వేర్స్‌
టాక్‌ వాకర్ టూల్‌ – 1 లైసెన్స్‌, సెలిబ్రైట్‌ ఇన్‌సైట్స్‌ టూల్‌ / సాఫ్ట్‌వేర్‌ – 1 లైసెన్స్‌,
సైబర్‌ ఫోరెన్సిక్‌ హబ్‌ టూల్‌ / సాఫ్ట్‌వేర్‌ – 1 లైసెన్స్‌, ఇన్‌సైట్‌ టూల్‌ / సాఫ్ట్‌వేర్‌ – 1 లైసెన్స్‌. వీటి పనితీరును గమనిస్తే నివ్వెరపోక తప్పదు. ఇవి సైబర్‌క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో సహాయపడే అత్యాధునిక ఏఐ ఆధారిత ఆటోమేషన్‌, సెక్యూర్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ను అందిస్తాయి.

సామాజిక మాధ్యమాల మానిటరింగ్‌
ఇందులో టూల్‌వాకర్‌ అనేది సామాజిక మాధ్యమాలను పర్యవేక్షించేది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టా, లింక్‌డిన్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతున్నదో, ఏ అంశాలపై చర్చలు నడుస్తున్నాయో క్రోడీకరించి ప్రభుత్వానికి కావల్సిన వివరాలతో నివేదిక అందించగలదు. ఇక సెలిబ్రైట్‌ ఇన్‌సైట్స్‌ అనేది అడ్వాన్సడ్‌ మొబైల్‌ ఎక్‌ట్రాక్షన్‌ టూల్‌. ఇది ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్లను ఎన్నిసార్లైనా అన్‌లాక్‌ చేయడానికి, వాటిలో డాటాను పొందటానికి ఉపయోగిస్తారు. ఎన్‌క్రిప్టెడ్‌ డాటాను సైతం ఇది బద్దలు కొట్టి, విషయాలు రాబట్టగలదు. చిన్నమాటలో చెప్పాలంటే మీ ఫోన్‌లోకి అది ప్రవేశిస్తే.. ఆ ఫోన్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నవారిలో చేతిలో ఉన్నట్టే. మిగిలిన టూల్స్‌ కూడా ఇంచుమించుగా ఇవే పనిచేస్తాయి. ఫోన్‌లో ఇంటర్నల్‌ డాటానే కాదు.. ఆ ఫోన్‌లలో ఉన్న అన్ని రకాల యాప్స్‌ను ఓపెన్ చేసి వివరాలు బ్యాకప్‌ తీసుకోగలదు.

దుర్వినియోగానికి అవకాశాలు!
పేరుకు సైబర్‌ సెక్యూరిటీ కోసమేనని చెబుతున్నా.. ఇది దుర్వినియోగం అయ్యేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని సైబర్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ టూల్స్‌.. మొబైల్‌ ఫోన్ల నుంచి ఎన్‌క్రిప్టెడ్‌ డాటాను బ్రూట్‌—ఫోర్స్‌ ద్వారా అన్‌లాక్‌ చేయగలదు. సోషల్‌ మీడియాలో సంభాషణలను మానిటర్‌ చేస్తుంది. సదరు సంభాషణలు ఏ లొకేషన్‌ నుంచి సాగుతున్నాయో కూడా కచ్చితంగా ట్రాక్‌ చేస్తుంది. ఇవి స్వార్థ రాజకీయ శక్తులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలలో లేదా శాంతి భద్రతలు కొరవడిన ప్రాంతాల్లో సులభంగా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతంలో పోరాటం.. నేడు ఆరాటం..!0
గతంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ వ్యతిరేక మీడియా ప్రతినిధుల ఫోన్లలోకి పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను చొప్పించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఆనాడు ఇదే కాంగ్రెస్‌ పార్టీ గళమెత్తింది. తెలంగాణలో కూడా ఫోన్‌ ట్యాపింగ్‌పై అప్పటి ప్రతిపక్ష నేతగా రేవంత్‌ రెడ్డి ఆనాటి బీఆరెస్‌ ప్రభుత్వంపై యుద్ధమే చేశారు. అంతేకాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కొద్దిపాటి సాక్ష్యాలతోనే బలమైన కేసులు నమోదు అయ్యేలా చూశారు. ఇప్పుడు అదే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ను మించిన స్థాయిలో, యావత్‌ సోషల్‌మీడియా యూజర్లపై, మొబైల్‌ యూజర్లపై కన్నేసి, వారి ఫోన్‌కు తన చెవిని తగిలించే ప్రయత్నం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సెర్బియాలో దుర్వినియోగం
కీలక అంశం ఏమిటంటే.. ఇదే సెలిబ్రైట్‌ ఇన్‌సైట్‌ టూల్‌ను సెర్బియాలో జర్నస్టులు, యాక్టివిస్టుల ఫోన్లను టార్గెట్‌చేసి, చట్టవ్యతిరేకమైన స్పైవేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ నివేదిక తర్వాత సెర్బియాలో తన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను సెలిబ్రైట్‌ నిలిపివేసింది. ఇటువంటి టూల్స్‌ వల్ల డాటా క్రోడీకరణ, ప్రజంటేషన్‌లో పక్షపాతం కనిపించే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టిగేషన్‌ లోపాలకు దారి తీస్తాయని, అన్నింటికి మించి వీటికి క్రాక్డ్‌ వెర్షన్స్‌ ను తయారు చేస్తే మరింత వినాశనం చోటు చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలినవి కూడా దుర్వినియోగానికి ఆస్కారం ఉన్నవేనని చెబుతున్నారు. ఈ టూల్స్‌ సైబర్‌ నేరాల నియంత్రణలో ఉపయోగకరమైనే అయినప్పటికీ.. రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటి వీటితో దుర్వినియోగ ప్రమాదం కూడా అదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.