Hatchery Business | ‘బాతు’ గుడ్ల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువ‌కుడు

Hatchery Business | బీహార్( Bihar ) అంటేనే వ‌ల‌స‌ల రాష్ట్రంగా పేరుగాంచింది. ఆ రాష్ట్రం నుంచి బ‌తుకుదెరువు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వల‌స వెళ్తుంటారు. కానీ ఓ యువ‌కుడు మాత్రం వ‌ల‌స సంక్షోభాన్ని ఎదుర్కొని.. పౌల్ట్రీ( Poultry ), హేచ‌రీ( Hatchery ) రంగంలో గొప్ప‌గా రాణించాడు. బాతు( Duck ), కోడిగుడ్ల( Chicken ) వ్యాపారంతో ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్నాడు. మ‌రి అత‌ని విజ‌య‌గాథ గురించి తెలుసుకోవాలంటే బీహార్‌లో అడుగుపెట్టాల్సిందే.

Hatchery Business | బీహార్‌( Bihar )లోని భోజ్‌పూర్( Bhojpur ).. వ‌ల‌స‌ల జిల్లాగా త‌యారైంది. ఈ జిల్లాల నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లి.. పొట్ట నింపుకుంటుంటారు. కానీ ఈ జిల్లాకు చెందిన యువ‌కుడు అభిషేక్ కుమార్( Abhishek Kumar ) మాత్రం.. వ‌ల‌స వెళ్ల‌కుండా.. సొంతూరిలోనే పౌల్ట్రీ( Poultry ), హేచ‌రీ( Hatchery ) స్థాపించి.. ప్ర‌స్తుతం ఎందరికో ఆద‌ర్శంగా ప్రాయంగా నిలిచాడు. కోట్ల రూపాయాలు సంపాదిస్తూ ప‌ది మందికి ఉపాధి క‌ల్పిస్తున్నాడు.

అభిషేక్ కుమార్ బీఎస్సీ ఐటీ స్టూడెంట్. క‌రోనా( Corona ) సంభ‌వించే నాటికి అత‌ను ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్రిపేర‌వుతున్నాడు. కానీ కొవిడ్ లాక్ డౌన్( Covid Lockdown ) కార‌ణంగా సొంతూరికి తిరిగి రావాల్సి వ‌చ్చింది. ఇక ఉపాధి నిమిత్తం త‌న‌కంటూ సొంతంగా ఏదైనా వ్యాపారం మొద‌లు పెట్టాల‌కున్నాడు. దీంతో యూట్యూబ్‌ను ఆశ్ర‌యించాడు. యూట్యూబ్‌లో అత‌ని అభిరుచికి, సామ‌ర్థ్యానికి స‌రిపోయే ఓ వీడియో కంటప‌డింది. ఆ వీడియో అభిషేక్ జీవితాన్ని మార్చేసింది.

మ‌రి ఆ వీడియో ఏంటంటే..?

బాతు, కోడిగుడ్ల‌కు సంబంధించిన వీడియో అది. ఇక చిన్న బాతులు, కోళ్ల పెంప‌కాన్ని చేప‌ట్టాడు. ఒక యూనిట్‌ను ప్రారంభించాడు. మొదటి ద‌శ‌లోనే 30 వేల కోడి, బాతుగుడ్ల‌ను ఉత్ప‌త్తి చేశాడు. ప్ర‌స్తుతం ఇప్పుడ‌ది 60 వేల గుడ్ల ఉత్ప‌త్తికి చేరింది. ఈ వ్యాపారాన్ని 1.2 ల‌క్ష‌ల కోడిగుడ్ల వ‌ర‌కు విస్త‌రించేందుకు అభిషేక్ సిద్ధ‌మ‌య్యాడు.

దేశీయ జాతుల‌తో గుడ్ల ఉత్ప‌త్తి..

దేశీయ బాతు పిల్ల‌ల‌తో పాటు సోనాలి, క‌డ‌క్‌నాథ్, డ‌బుల్ ఎఫ్‌జీ, లేయ‌ర్స్, ఫ్రిజిల్ క్రాస్ జాతుల‌కు చెందిన గుడ్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాడు.

హైద‌రాబాద్ విజిట్ కీల‌కం..

ఇక ఒక‌సారి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు అభిషేక్. న‌గ‌ర శివార్ల‌లో ఉన్న పౌల్ట్రీ ఫారాలు, హేచ‌రీల‌ను చూసి.. మ‌రింత ఎద‌గాల‌ని అత‌ను నిర్ణ‌యించుకున్నాడు. హైద‌రాబాద్ నుంచి బీహార్‌కు పెద్ద‌మొత్తంలో గుడ్లు, కోడిపిల్ల‌లు ర‌వాణా చేస్తున్న విష‌యాన్ని గ‌మ‌నించాడు. దాన్ని మ‌న స్వ‌స్థ‌లంలోనే ఉత్ప‌త్తి చేస్తే బాగుంటుంద‌ని సంక‌ల్పించాడు.

ఒక్కో బాతు పిల్ల ధ‌ర రూ. 35

ప్ర‌స్తుతం అభిషేక్ త‌న హేచ‌రీలో సుమారు 60 వేల గుడ్ల‌ను ప్రాసెస్ చేస్తున్నాడు. 21 రోజుల్లోనే కోడిపిల్ల‌లు గుడ్ల‌ను పెడుతుండ‌గా, బాతు పిల్ల‌ల‌కు 28 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఇక ఒక్కో కోడిపిల్ల‌ను రూ. 20 నుంచి రూ. 25కు విక్ర‌యిస్తున్నాడు. బాతు పిల్ల ధ‌ర రూ. 30 నుంచి రూ. 35 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నాడు. మొత్తంగా ఏడాదికి ఈ బాతు, కోడిగుడ్ల ఉత్ప‌త్తితో రూ. 2.25 కోట్ల వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

100 మంది రైతులు కొనుగోలు..

స్థానికంగా ఉన్న ఓ 100 మంది రైతులు అభిషేక్ వ‌ద్ద‌నే పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు కోడిపిల్ల‌ల‌ను, బాతు పిల్ల‌ల‌ను, గుడ్ల‌ను అభిషేక్ వ‌ద్ద‌నే కొనుగోలు చేస్తున్నారు. గ‌తంలో అయితే వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి కోళ్ల‌ను, గుడ్ల‌ను దిగుమ‌తి చేసుకునే వారు. ఇప్పుడు ఆ ప‌ని లేకుండా పోయింది.

నేపాల్‌కు గుడ్ల ఎగుమ‌తి

అభిషేక్ త‌న హేచ‌రీ ద్వారా నేపాల్, కేర‌ళ‌, పాట్నా, విక్ర‌మ్, అజంఘ‌ర్, బాలియా, పాలి, ఆరా వంటి ప్రాంతాల‌కు కోడిపిల్ల‌ల‌ను, గుడ్ల‌ను ఎగుమ‌తి చేస్తున్నాడు. నాణ్య‌త వ‌ల్లే త‌మ హేచ‌రీ నుంచి అధిక మొత్తంగా గుడ్లు స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌ని అభిషేక్ చెప్పాడు.

స‌బ్సిడీ లేదు.. స‌హ‌కారం లేదు..

అయితే బీహార్ ప్ర‌భుత్వం నుంచి హేచ‌రీ రంగానికి ఎలాంటి స‌బ్సిడీ లేదు.. ఆర్థిక స‌హ‌కారం లేదు అని అభిషేక్ తెలిపాడు. జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలు పౌల్ట్రీ రంగానికి స‌బ్సిడీ క‌ల్పిస్తున్నాయి. దాంతో పాటు ఆర్థిక స‌హ‌కారాన్ని కూడా అందిస్తున్నాయి. యువత వ్యాపారం వైపు రావాలంటే ప్ర‌భుత్వాలు సబ్సిడీలు అందించాల‌ని అభిషేక్ కోరాడు.

గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం..

బీహార్ ప్ర‌భుత్వం కొద్దిపాటి ఆర్థిక స‌హాయం అందించినా కూడా.. మ‌రింత మంది ఈ రంగంలోకి అడుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అభిషేక్ తెలిపాడు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కావ‌డంతో పాటు.. పెద్ద ఎత్తున స్థానిక యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని విశ్వసిస్తున్నాన‌ని అభిషేక్ పేర్కొన్నాడు.

Latest News