Terrace Garden | మట్టి లేకుండానే టెర్రస్‌పై గార్డెనింగ్.. సమ్మర్‌లో ఏసీ అవసరం లేకుండా చేసిన 70 ఏళ్ల వృద్ధుడి ఆలోచన!

Terrace Garden | పుణెలోని 70 ఏళ్ల వృద్ధుడి వినూత్న ప్రయోగం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. మట్టి లేకుండానే తన ఇంటి టెర్రస్‌పై గార్డెనింగ్ చేస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు.

Terrace Garden | పుణెలోని 70 ఏళ్ల వృద్ధుడి వినూత్న ప్రయోగం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. మట్టి లేకుండానే తన ఇంటి టెర్రస్‌పై గార్డెనింగ్ చేస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు. ఇలా కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. ఈ సమ్మర్‌లో కూలర్లు, ఏసీలు అవసరం లేకుండా ఇంటిని సహజంగానే చల్లగా మార్చేశాడు.

పుణెకు చెందిన అజయ్ అగర్వాల్‌కు చిన్నతనం నుంచి గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం. తన చిన్నతనంలో వాళ్ల అమ్మ ఇంటి వద్ద పెంచే మొక్కలకు నీటిని పోయడం, వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతిపై మక్కువను ఏర్పాటు చేసుకున్నాడు. కాలక్రమేణా ఉద్యోగ బాధ్యతలు పెరిగి, పట్టణానికి షిఫ్ట్ అయినప్పటికీ అతనికి మొక్కలపై ప్రేమ తగ్గలేదు. దీంతో 1989లో పుణెలో సొంత ఇంటిని నిర్మించుకున్న తర్వాత అక్కడ మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు.

అజయ్ అగర్వాల్ తొలుత ఇంటి వెనుక భాగంలోనే మొక్కలు పెంచాడు. కానీ అక్కడ పెద్ద చెట్లు ఎక్కువగా ఉండటంతో సూర్యకాంతి సరిపడా అందక కూరగాయల మొక్కలు పెరగలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించిన అజయ్ అగర్వాల్.. టెర్రస్ గార్డెనింగ్‌వైపు అడుగులు వేశాడు. 2015లో ఇంటి టెర్రస్‌పై చిన్నగా మొక్కలు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే మట్టితో గార్డెనింగ్ చేయడం వల్ల బరువు ఎక్కువగా పడి బిల్డింగ్ పాడవుతుందనే ఉద్దేశంతో మట్టి లేకుండా గార్డెనింగ్ చేసే పద్ధతుల కోసం వెతికాడు. మొదట హైడ్రోపోనిక్స్ తరహాలో నీటి ఆధారిత పద్ధతులను పరీక్షించాడు. అనంతరం మట్టికి బదులుగా తక్కువ బరువు ఉండే సహజ పదార్థాలను ఉపయోగించాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో అనేక రకాల ప్రయోగాలు చేశాడు. చివరకు ఎండిన ఆకులు, ఆవు ఎరువులతో తయారైన ప్రత్యేక మిశ్రమాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు.

” మట్టితో పోలిస్తే ఈ మిశ్రమంలో మొక్కలు వేగంగా పెరుగుతాయి. నీరు కూడా తక్కువగా అవసరం అవుతుంది. ముఖ్యంగా టెర్రస్‌పై ఎక్కువ బరువు పడకుండా ఉంటుంది” అని అజయ్ అగర్వాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం అతని ఇంటి టెర్రస్‌పై 400కి పైగా కుండీలు ఉన్నాయి. వీటిలో బీరకాయ, సొరకాయ, కాకరకాయ, వంకాయ, టమాట, పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయలతో పాటు దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్ వంటి కూరగాయలను పండిస్తున్నాడు.

ఈ టెర్రస్ గార్డెన్ వల్ల అజయ్ కుటుంబానికి తాజా, రసాయనాలు వాడని కూరగాయలు అందుతున్నాయి. అంతేకాకుండా ఇంటి వాతావరణంలో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని అజయ్ చెబుతున్నాడు. మొక్కల వల్ల ఇంటి ఉష్ణోగ్రత సుమారు 4 డిగ్రీల వరకు తగ్గిందని చెప్పాడు. గతంలో వేసవికాలం వచ్చిందంటే ఎక్కువగా ఏసీ ఉపయోగించేవాళ్లమని.. ఇప్పుడు ఏసీ అవసరమే లేకుండా పోయిందని పేర్కొన్నాడు. ఈ టెర్రస్ గార్డెనింగ్ వల్ల అజయ్ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా మేలు జరుగుతుందట. అజయ్ ఉద్యానవనం వల్ల తమ ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడిందని స్థానికులు చెబుతున్నారు. చిన్న చిన్న పక్షులు, సీతాకోక చిలుకలు ఇప్పుడు తరచూ వస్తున్నాయట.

అజయ్ తన ప్రయోగాలకు కేవలం తన ఇంటికే పరిమితం చేయలేదు. తన అనుభవాలను, టెర్రస్ గార్డెనింగ్‌కు సంబంధించిన చిట్కాలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటున్నాడు. అలాగే ప్రతి ఏడాది 500 నుంచి 600 వరకు మొక్కలను పంచుతూ ఇతరులకు పచ్చదనం వల్ల కలిగే లాభాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అజయ్ స్ఫూర్తితో ఇప్పుడు పుణెలో చాలామంది తమ ఇళ్లపై టెర్రస్ గార్డెన్లు ఏర్పాటు చేసుకున్నారట.!

Read More:

రంగారెడ్డి జిల్లాలో ‘అవ‌కాడో’ సాగు.. ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి దేశీ ఆవుల పెంపకం.. ఏటా 10 కోట్ల టర్నోవర్ చేస్తున్న టెకీ!

Latest News