పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు

‘దాహమేసినప్పుడే బావి తవ్వడం’ ప్రారంభించినట్లుగా తెలంగాణలో పంట మార్పిడి ప్రకటన ప్రభుత్వానికి ఆపద మొక్కుగా మారిందనే విమర్శలు రైతాంగంలో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పంట మార్పిడికి సంబంధించిన పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వంద శాతం విఫలమైందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ఎందుకు మొగ్గు చూపడంలేదనే ప్రాథమిక కారణాలు అందరికీ తెలిసు. అయినా.. దీని మూలాలను నిజాయితీతో పరిష్కరించకుండా, కచ్చితమైన, నమ్మకమైన ప్రణాళిక రూపొందించి రైతులను ఒప్పించడంలో చిత్తశుద్ధి లేదనేది పదేపదే తేలిపోతోంది. మరో మాటలో చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు.

telangana-crop-diversification-crisis ai generated image

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ.. రైతులకు ఆర్ధికంగా, భౌతికంగా ఆ పంటల సాగు లాభసాటి అనే భరోసా కల్పించకుండా నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పాలకులెవరైనా ‘రైతులను… పంట సాగును’ కూడా తమ రాజకీయ రథ చక్రాల కిందకు లాగుతున్న వైనమే దీనికి ప్రధాన కారణమంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు తమ విదేశీ తాబేదారి తనంతో దేశీయ రైతుల జీవితాలను పనంగా పెడుతున్నారరి, కనీస మద్దతు ధర దక్కకుండా రైతుల జీవితాలను బలిపెడుతున్నారనే విమర్శలున్నాయి. దేశంలో రైతులు పత్తి పండిస్తే ఇక్కడి రైతుకు ధర రాకుండా ఆమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకునే విధంగా విదేశీ దిగుమతి సుంకాన్ని తగ్గించి గేట్లు బార్లా తెరువడంతో ఇక్కడి రైతు పిడుగుపాటుకు గురయ్యారు. రైతును ఆదుకోవడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని పదపదే నిరూపించుకుంటుండగా, పార్టీలైవైనా నేతల దిగజారుడు తనం మరో కారణంగా మారుతోందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో గత రెండు నెలలుగా ధాన్యం, మొక్కజొన్న రైతులు రోడ్లపై నిరీక్షిస్తున్న పరిస్థితి దీనికి అద్దంపడుతోందంటున్నారు. గతంలో కూడా దీనికి భిన్నమైన పరిస్థితులు లేకపోవడం గుర్తుచేస్తున్నారు.

పంటమార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు నేలవిడిచి సాము చేస్తున్న విధానాల ఫలితంగా రైతులు నమ్మకం కోల్పోతున్నారు. ఈ కారణంగా రైతులు సంప్రదాయ సాగు పద్ధతులూ, పంటల సాగును కొనసాగిస్తూ ‘ఊబి’లో కూరుకుపోతున్నారు. ఆరుగాలం శ్రమించి, అన్ని రకాల ఆటుపోట్లను, ఆర్ధిక అవస్థలను అనుభవించి కూడా ప్రతి సీజన్‌లో రెక్కల కష్టమైనా మిగులుతుందో లేదో చివరి వరకు తేలని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నెత్తునును చెమటగా మార్చి పండించిన పంటను విక్రయించుకునేందుకు కల్లాల్లో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన దుస్థితిని ప్రతీ సీజన్ లో రైతులు అనుభవిస్తున్నారు.

పంట మార్పిడి…ప్రత్యామ్నాయం పై ఏదీ చిత్తశుద్ధి?

ప్రతీ ఖరీఫ్ ప్రారంభానికీ, రబీ ముగింపునకూ పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపైన అధికారంలో ఉన్న నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం రివాజుగా మారింది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి, ప్రభుత్వ ఆర్ధిక, భౌతిక సహాయ సహకారం, రైతుల స్థితిగతులు అన్నీ తెలిసినప్పటికీ పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. దీంతో రైతులు కూడా నీటి వనరులు ఉంటే వరి వైపు, కొంచెం తక్కువ నీటి వనరులుంటే పత్తి, మొక్కజొన్న, మిరప వైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. ఫలితంగా పప్పు ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి తగ్గిపోయింది. రైతుకు లాభసాటిగా లేకపోవడంతో పై పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా వరి, మొక్కజొన్న, పత్తి తప్ప మరో పంట వైపు దృష్టి పెట్టడం లేదు. దీంతో పంటలు పండినా.. కొనేవారు లేక, సరైన ధర లభించని దుస్థితి నెలకొంది. చివరికి ప్రభుత్వ కొనుగోలు వైపు చూడాల్సి వస్తోంది. దేశంలో ఒక వైపు వంట నూనెలను దిగుమతి చేసుకుంటూ ఇక్కడ నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఇతర వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించకపోవడానికి ఆచరణాత్మక ప్రణాళిక లేకపోవడమే కారణం అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల పామాయిల్ సాగు కాసింత పెరుగుతోంది.

వరి, పత్తి, మొక్కజొన్న పంటల మొగ్గు

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు సాగు విస్తీర్ణం ఆశించిన మేరకంటే ఎక్కువగా పెరుగుతోంది. ఈ సాగులో కూడా అనూహ్యంగా వరి సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడిన 2014లో మొత్తం 1.31 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేయగా ప్రస్తుతం సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దాదాపు 90లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విస్తీర్ణంలో ప్రధాన వాటా వరిదే కావడం విశేషం. గతంలో కేవలం 30 శాతం ఉన్న వరి సాగు ఇప్పుడు 60 శాతానికి చేరింది. ఖరీఫ్ సీజన్ లో వరి సాగు 68.3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా, రబీలో కూడా కొద్ది మేరకు తక్కువ అంటే 64.36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వార్షిక ధాన్యం ఉత్పత్తి 2.96 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందంటే సింహభాగం వరిసాగు చేస్తున్నారు. మిగిలిన పంటలతో పోల్చితే వరి రైతుకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. హెక్టారు వరి సాగు ఖర్చు రూ.1,15,673లుండగా – పత్తి తర్వాత 2వ స్థానంలో ఉంది, దేశంలో తెలంగాణ వరిసాగు వాటా గతంలో 13.6 శాతం ఉంటూ పంజాబ్ తర్వాత 2వ స్థానం ఉండేది. తాజాగా 2026 రబీలో తెలంగాణ వరి పంట ఉత్పత్తి దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నది.

ఇక వరి తర్వాత రెండవ స్థానం వాణిజ్యపంటగా గుర్తింపు పొందిన పత్తికి దక్కుతోంది. తెలంగాణలో పత్తి సాధారణ విస్తీర్ణం 44 లక్షల ఎకరాల్లో ఉండగా మొన్నటి ఖరీఫ్ అంచనా ప్రకారం 49. 98 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2020 – 21లో 58.26లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తర్వాత స్థానం మొక్కజొన్నకు దక్కుతోంది. కేవలం ఈ రబీ సీజన్ లోనే 14.99 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఖరీఫ్లో మరో 10లక్షల ఎకరాల మేరకు సాగు చేశారు. రబీ సీజన్ లో ధాన్యం తర్వాత మొక్కజొన్నకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరుతడి పంటగా దీని పై మక్కువ కనబరుస్తున్నారు. ఇక మిరప ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. తర్వాత సోయాబీన్ వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల ఆయిల్ పామ్‌ సాగుకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్రంలో 12 వేల ఎకరాల విస్తీర్ణానికి చేరింది. ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు పెరిగింది. రబీలో వరి, మొక్కజొన్నతో పాటు 4 లక్షల ఎకరాల్లో జొన్న, 1.6 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 1.56 లక్షల ఎకరాల్లో శెనగ, 26వేల ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారు.

పంట మార్పిడి ప్రయత్నం ఫలించేనా?

ఈ ఖరీఫ్ సీజన్ లో ఎల్‌నినో వల్ల వర్షాభావం ఉంటుందనే కారణంతో పంటమార్పిడి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ నుంచి.. అందరూ ఇదే పాట పాడుతున్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల వరిని ఇతర పంటలకు మార్చాలని లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. దీనికి ప్రోత్సాహకంగా వరి వదిలి ఇతర పంటలు వేస్తే ఎకరానికి రూ.8,000 ఇవ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు రూపొందించింది. ప్రత్యామ్నాయంగా కందులు, నూనెగింజలు, ఉద్యాన పంటలు వేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు విపరీతంగా పెరిగిన ఎరువులూ, పురుగుల మందుల వినియోగం తగ్గించి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. 61,125 ఎకరాల్లో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద ఈ ఖరీఫ్ నుంచి ప్రారంభం ఆయిల్ పామ్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు 12,005 హెక్టార్లు కొత్తగా సాగుచేయగా, దేశంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ 2వ స్థానంలో చేరింది. వరి స్థానంలో ఇతర పంటలను ప్రోత్సహించడం వల్ల నీటి వనరులపై ఒత్తిడి తగుతోంది. దీని కోసం కూడా తాజా ఎలినినో పరిస్థితిల్లో పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు.

Latest News