Karthika Masotsavam At Srisailam | శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆకాశదీపాన్ని వెలిగించగా, భక్తుల రద్దీ కారణంగా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవ, వైష్ణవ ఆలయాలకు, నదీ తీరాలకు భక్తుల తాకిడి పెరిగింది.

విధాత : శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసోత్సవాల ప్రారంభంగా శ్రీశైల ఆలయంలో ఆకాశదీపం వెలిగించారు. ధ్వజస్తంభంపై దీపం నెలరోజులు వెలుగుతుంది. ఈ కార్తీక దీపాన్ని దర్శించిన వారికి పాపక్షయంతో పాటు ఆయురారోగ్య పుణ్యం లభిస్తుందని విశ్వాసం. మరోవైపు కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళ గంగలో కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించి..నదిలో కార్తీక దీపాలు వదిలి.. స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేశారు.
కార్తీక శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. సాధారణ రోజులలో మూడు విడతలుగా స్వామి వారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు కార్తీక దీపాలు వేలిగించేందుకు క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థానం వెల్లడించింది. ఈ నెల 31న కృష్ణమ్మకు నదిహారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం నిర్వహిస్తారు.
ఆలయాలకు కార్తీక శోభ
శివ, విష్ణువులకు ప్రితిపాత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాలకు భక్తజనం రద్ధీ పెరిగింది. నది స్నానాలు..కార్తీక దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, శివాభిషేకాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి వంటి పుణ్య నది తీర దేవాలయాలకు కార్తీక మాసం భక్తుల సందర్శన పెరిగింది. శ్రీశైలం, ద్రాక్షరామం, వేములవాడ వంటి శైవ క్షేత్రాలతో పాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, విజయవాడ దుర్గమ్మ, కాళేశ్వరం, భద్రాచలం, వాడపల్లి, మఠంపల్లి వంటి నది తీర దేవాలయాలకు రద్దీ పెరిగింది.