Arjita Sevas Suspended At Vemulawada Temple | వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు బంద్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కారణంగా బుధవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేశారు. కోడె మొక్కులు, అభిషేకాలు వంటి సేవలను భక్తులు భీమేశ్వర ఆలయంలో నిర్వహించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో దర్శనాలు కొనసాగుతాయి.

విధాత : ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఆర్జిత సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానాలయంలోకి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
ఆర్జిత సేవల నిలిపివేతలో భాగంగా రాజన్నకు ప్రధాన మొక్కులుగా ఉండే కోడె మొక్కులు, అభిషేకాలు, ఇతర మొక్కులన్నీ భీమేశ్వర ఆలయంలోనే నిర్వహిస్తున్నారు. దీంతో కార్తీక మాస వేళ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులంతా భీమేశ్వర ఆలయంలోనే వివిధ పూజలు నిర్వహించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాజరాజేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం రూ.150 కోట్లతో అభివృద్ధి చేసే పనులను ప్రారంభించింది. ఇప్పటికే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఆలయ అభివృద్ది పనులణ సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వరాలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలను ప్రారంభించారు.