రెండుకళ్ల సిద్ధాంతంతో ఎవరికి ద్రోహం చేస్తారూ: అంబటి రాంబాబు
ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి ఫైర్
బాబు తీరు ఏపీకి ద్రోహం చేసేదిగా ఉందని మండిపాటు
సీఎంల భేటీ చర్చల రహాస్యాన్ని వెల్లడించాలని డిమాండ్
విధాత, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే అర్థమేంటని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు అంగీకరించినట్లేనా అని చంద్రబాబును నిలదీశారు. బాబు మాటలు చూస్తుంటే ఏపీకి ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంగా ఉండి రెండు రాష్ట్రాలు సమానం అని అంటారా? అని మండిపడ్డారు. ఏపీకి చంద్రబాబు ఏదో ద్రోహం తలపెట్టనున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. పార్టీ పరంగా బాబుకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు కావచ్చు.. ఏపీ ప్రభుత్వపరంగా చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అంబటి రాంబాబు అన్నారు. విభజన జరిగాక పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ దాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. చంద్రబాబు తప్పు చేసినందుకే మెడ పట్టుకుని గెంటేశారని విమర్శించారు. ఆనాడు రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ తీసుకురాకుండా ఎందుకు పారిపోయి వచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏపీకి అన్యాయం చేశారని తెలిపారు. ఇప్పుడు కూడా మరోసారి తెలంగాణకు ద్రోహం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పోలవరానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని, అందులో భాగంగానే కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపబోతున్నారని ఆరోపించారు.
రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు చర్చించలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విద్యుత్తు బకాయిలు ఏపీకి రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉండగా దానిపై ఎందుకు చర్చించలేదని, నాగార్జునసాగర్ లో నీటీ సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏపీలోని పోర్టులో తెలంగాణ వాటా అడుగుతుందని.. టీటీడీ బోర్డు, ఆదాయంలోనూ వాటా కోసం తెలంగాణ పట్టుబట్టిందని వార్తలు వినిపించాయని, తెలంగాణకు వాటా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వచ్చిన వార్తలు నిజమేనా అని నిలదీశారు. సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు బాబు అంగీకరించినట్లేనా అని అన్నారు. మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి వస్తోందని చెప్పారు.
విభజన అంశాలపై చర్చను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 9, 10 షెడ్యూల్ లోని ఆస్తులపై ఏం చర్చించారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంల భేటీలో ఏం చర్చించారంటే డ్రగ్స్ గురించి చర్చించామంటూ ఏదో చెబుతున్నారని, డ్రగ్స్ గురించి చర్చకైతే ప్రగతి భవన్ వేదికగా అంతా హైడ్రామా ఎందుకని అంబటి ప్రశ్నించారు. గతంఓ వైఎస్ జగన్ చొరవతో పోలవరం విషయంలో చత్తీస్‌గఢ్, ఒడిశాతో వివాదాలు పరిష్కారం అయ్యాయని, పోలవరం విషయంలో ఏపీకి ద్రోహం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని ఆరోపించారు. కాంట్రాక్టర్లను మార్చడం, రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఆలస్యం కాలేదని, చంద్రబాబు నది మధ్యలో కాపర్ డ్యాం కట్టడమే పోలవరం అలస్యానికి కారణం” అని అంబటి వివరించారు.