Ambati Rambabu bail| మాజీ మంత్రి అంబటికి అటు బెయిల్..ఇటు పీటీ వారెంట్ !

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ మంజురైన ఆనందం ఎంతోసేపు లేకుండా..పోలీసులు మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Ambati Rambabu bail| మాజీ మంత్రి అంబటికి అటు బెయిల్..ఇటు పీటీ వారెంట్ !

విధాత, హైదరాబాద్ : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ మంజురైన ఆనందం ఎంతోసేపు లేకుండా..పోలీసులు మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గతేడాది నవంబర్‌ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలో పోలీసుల విధులను అడ్డుకున్నారని అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం ఆయనను పోలీసులు కోర్టులో హాజరపరిచారు. ఈ కేసుపై గుంటూరు కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

అటు హైకోర్టులోనూ ఇప్పటికే అంబటి రాంబాబుకు ఊరట దక్కింది. ఇటీవల ఆయననై నమోదైన 35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది.35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.

అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు..హైకోర్టులో అరెస్టు నుంచి మినహాయింపులు దక్కిన నేపథ్యంలో అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో రాజమండ్రి జైలు నుంచి విడుదలవుతారనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంబటిపై నమోదైన కేసులో కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటిపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అప్పట్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల పీటీ వారెంట్ ను గుంటూరు కోర్టు అనుమతించింది. అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని సత్తెనపల్లి కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.