కరువు సీమలో.. ఆపిల్ సాగు సిరులు!

రాయలసీమ అంటేనే హాట్ జోన్..డ్రాట్ జోన్ గా గుర్తింపు పొందింది. అలాంటి కరువు పీడిత రాయలసీమలో అనంతపురానికి చెందిన ఒక రైతు కేఎల్‌డీ రకం ఆపిల్‌లను విజయవంతంగా పండించి, అనేక ఉత్తరాది మార్కెట్ల కంటే ఎక్కువగా కిలోకు రూ.120–170 ధరకు విక్రయిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తుంది.

కరువు సీమలో.. ఆపిల్ సాగు సిరులు!

విధాత : రాయలసీమ అంటేనే హాట్ జోన్..డ్రాట్ జోన్ గా గుర్తింపు పొందింది. అలాంటి కరువు పీడిత రాయలసీమలో అనంతపురానికి చెందిన ఒక రైతు కేఎల్‌డీ రకం ఆపిల్‌లను విజయవంతంగా పండించి, అనేక ఉత్తరాది మార్కెట్ల కంటే ఎక్కువగా కిలోకు రూ.120–170 ధరకు విక్రయిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తుంది. ఒకప్పుడు వర్షాధారిత పత్తి, జొన్న, మొక్క జొన్న వంటి మెట్ట పంటలు పండించే అనంతపురం రైతాంగం ఇప్పుడు వర్షాభావ పరిస్థితులను ఆధునిక సేద్య పద్దతులను సహాయంతో అధిగమించి.. ఉద్యాన వన పంటలతో సరికొత్త సాగు విప్లవాన్ని ఆవిష్కరిస్తుంది. అరటి, దానిమ్మ వంటి పండ్ల తోటలు,కూరగాయలు, పూలు వంటి వాటి సాగుతో నిన్న మొన్నటి వరకు లాభాల బాట పట్టిన సీమ అనంతపురం రైతులు..ఇప్పుడు కొత్తగా సిరుల పంట ఆపిల్ పండ్ల తోటల సాగుతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

సీమలో ఆపిల్ సాగుతో అనంత రైతుల కొత్త చరిత్ర

అత్పల్ప ఉష్ణోగ్రతలలో కూడిన చల్లని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మాత్రమే పండే ఆపిల్స్, ఇప్పుడు అనంతపురం జిల్లాలోని ఎర్ర నేలల్లో విరగకాస్తున్న తీరు స్థానిక రైతుల కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు వంటి మండలాల్లో రైతులు ఆపిల్స్ చల్లని వాతావరణంలోనే పండుతాయన్న చరిత్రను తిరుగరాశారు. వాతావరణ మార్పులను తట్టుకుని, తక్కువ చలిలో, వేడి వాతావరణంలో కూడా పండే కాశ్మీర్ లోచిల్లీ డెలిషియస్ (KLD -ఇజ్రాయెల్ చిల్) వంటి ప్రత్యేక రకాలను ఎంచుకుని సాగు చేపట్టారు. సుమారు 15 ఎకరాల్లో ఆపిల్ తోటలను పెంచుతూ..రాయలసీమ వాతావరణంలో కూడా ఆపిల్ సాగు సాధ్యమేనని నిరూపించారు. ఇజ్రాయెల్ సాంకేతికతతో అత్యాధునిక డ్రిప్ ఇరిగేషన్, కాయలకు కవర్లు తొడగడం, పశువుల ఎరువుల వాడకం వంటి సాగు పద్దతులతో అపిల్ తోటల సాగు కొనసాగిస్తున్నారు.

ఉత్తరాది ఆపిల్స్ కు పోటీగా అనంత ఆపిల్ బ్రాండ్

ముఖ్యంగా అనంతపురానికి చెందిన రైతు కె.వి. రమణారెడ్డి కరువు పీడిత రాయలసీమలో కేఎల్‌డి (ఇజ్రాయెల్ లో-చిల్) ఆపిల్‌లను విజయవంతంగా సాగు చేశారు. ఈ చెట్లు 45°C ఉష్ణోగ్రతలను తట్టుకుని, రెండవ సంవత్సరం నుంచే ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఎకరానికి సుమారు టన్ను దిగుబడితో రాయలసీమ వ్యవసాయానికి కొత్త బాటలు పరిచారు. ఉత్తరాదిలో సరఫరా తక్కువగా ఉన్నప్పుడు అనంతపురం రైతులు కేఎల్ డీ ఆపిల్స్ అమ్మడం వల్ల అనంత కిలోకు రూ.120–170 అధిక ధరలను ఆర్జిస్తుండటం విశేషం. కాశ్మీర్ ఆపిల్ కంటే ఈ ఆపిల్స్ తియ్యగా, రుచిగా ఉన్నాయని, మార్కెట్‌లో కిలోకు రూ.120-170 వరకు ధర లభిస్తుందని రైతులు తెలిపారు. ఇటీవల టన్ను ఆపిల్ రూ.1.50 లక్షలకు బెంగళూరులోని మార్ట్‌కు విక్రయించినట్లు రమణారెడ్డి చెబుతున్నారు. అలాగే ‘అనంత యాపిల్స్‌’ను.. పండ్ల గిన్నెగా గిఫ్ట్‌ ప్యాక్లుగా చేసి విక్రయిస్తున్నారు. ‘అనంత ఆపిల్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న ఆపిల్స్ మంచి రుచిగా ఉండటంతో స్థానికంగా మంచి డిమాండ్‌ ఏర్పడింది.

ఆపిల్ సాగు ప్రోత్సాహంపై ఏపీ సర్కార్ ఫోకస్

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే ఆపిల్ సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ తక్కువ ఉష్ణోగ్రతల వాతావరణం ఆపిల్ తోటల సాగుకు అనుకూలంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ వాతావరణంతో కూడిన అనంతపురం జిల్లాలో రైతుల ఆపిల్ సాగు సక్సెస్ స్టోరీని పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం రాయలసీమలో ఆపిల్ సాగును పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు ఉండే అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లోనూ హాట్‌ జోన్‌ యా పిల్‌ ఉత్పత్తిపై పరిశీలన కోసం ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో రాయలసీమతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ యాపిల్‌ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ఉద్యాన వన పంటలతో సీమ రైతుల కొత్త అధ్యాయం

ఇప్పటికే అనంతపురం సహా సీమ జిల్లాల రైతులు అరటి, దానిమ్మ, మామిడి వంటి పంటల్ని సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆపిల్, దాక్ష వంటి పంటల్ని సాగు చేస్తూ మంచి లాభాలను అందుకుంటున్నారు. ఇటీవల దానిమ్మ పంటకు కూడా భారీగా లాభాలు వచ్చాయి. అనంతపురం రైతుల ఆపిల్ సాగును ఆదర్శంగా తీసుకుని మరికొందరు రైతులు అదే బాటలో సాగేందుకు ప్రయత్నిస్తుండటం ఆసక్తి కరం. ప్రభుత్వం, ఉద్యానవన శాఖ ప్రోత్సాహం ఉంటే, భవిష్యత్తులో డ్రిప్ విధానంలో మరిన్ని ఎకరాల్లో సీమలో ఆపిల్ సాగు విస్తరించే అవకాశం ఉందంటున్నారు.