AP, Telangana financial crisis | అప్పుల్లో గురు శిష్యుల పోటాపోటీ! ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే..

అప్పుల్లో పోటీ ప‌డుతున్న బాబు.. రేవంత్‌ల మ‌ధ్య మాట‌ల విష‌యంలో తేడా చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు అమ‌రావ‌తిని అద్బుతంగా నిర్మిస్తున్నామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ ప్ర‌క‌టించి ఏపీలో ఏదో జరుగబోతున్నదనే భ్రమలు కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. మరోవైపు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి తనను కోసినా నయా పైస అప్పు పట్టుడం లేదని బహిరంగంగానే వాపోయారు.

AP, Telangana financial crisis | అప్పుల్లో గురు శిష్యుల పోటాపోటీ! ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే.. chandrababu-naidu-revanth-r

AP. Telangana financial crisis | అభివృద్ధిలో ప్ర‌పంచంతో పోటీ ప‌డుతున్నామ‌ని చెపుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. దాని సంగతేమోగానీ.. అప్పులు తేవడంలో మాత్రం తెగ పోటీపడుతున్నట్టు కాగ్‌ నివేదికలను గమనిస్తే అర్థమవుతున్నది. ఈ రెండు రాష్ట్రాల ఆదాయం గత ఏడాదితో పోల్చితే భారీగా తగ్గిపోయింది. దీంతో అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు.

చంద్ర‌బాబు అలా…

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే (ఆర్థిక సంవత్సరం తొలి నెల) రూ.13,837.59 కోట్ల బ‌డ్జెట్ అప్పులు చేసింది. రాష్ట్రానికి కేంద్ర ప‌న్నుల్లో వాటా కింద రూ.2,110 కోట్లు, కేంద్ర ప్రాయోజిత‌ ప‌థ‌కాల కింద ఇచ్చే గ్రాంట్లు రూ.316.88 కోట్లు క‌లిపి రూ.10,538.38 కోట్ల ఆదాయం ఏప్రిల్‌లో వ‌చ్చింది. ఈ మొత్తం క‌లిపి రూ. 24,377.15 కోట్లను స‌మీక‌రించిన చంద్ర‌బాబు స‌ర్కారు ఇందులో నుంచి రూ.3058.48 కోట్లు వ‌డ్డీకి, రూ.2230,85 కోట్లు అసలు చెల్లింపులకు సరిపెట్టారు. క్యాపిట‌ల్ ఎక్స్‌పెండేచ‌ర్‌పైన రూ.81.32 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం. రూ. 81 కోట్ల‌తో రెండు కిలోమీట‌ర్ల రోడ్డు కూడా వేయ‌డం క‌ష్టం. ఈ లెక్క‌న ఎన్నిసంవ‌త్స‌రాలు బ‌డ్జెట్ కేటాయిస్తే అభివృద్ది జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు ప్రశ్నించారు. క్యాపిట‌ల్ ఎక్స్‌పెండేచ‌ర్‌కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించ‌కుండా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ఏవిధంగా జ‌రుగుతుంద‌న్న ప్ర‌శ్నఆర్థిక నిపుణుల్లో వ్య‌క్తం అవుతున్న‌ది. అలాగని ఏపీలో ప్రజలకు ఇచ్చిన సబ్సిడీలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఏప్రిల్ నెలలో సబ్సిడీల కింద చంద్రబాబు ఖర్చు చేసింది రూ.2447. 45 కోట్లు మాత్రమే.

రేవంత్ ఇలా…

రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఏప్రిల్ నెల‌లోనే రూ.5230.99 కోట్ల అప్పు చేసింది. అలాగే రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.1096.31 కోట్లు, కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల కింద ఇచ్చే గ్రాంట్లు రూ.68.85 కోట్లు క‌లిసి రాష్ట్ర ఖ‌జానాకు ఏప్రిల్‌లో రూ.11,239.13 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఈ మొత్తం క‌లిపి16,473 కోట్లు స‌మీక‌రించిన స‌ర్కారు.. ఇందులో నుంచి వ‌డ్డీల కింద రూ. 2260.74 కోట్లు, స‌బ్సిడీల కింద 4,187.73 కోట్లు ఖ‌ర్చు చేసింది. అస‌లు చెల్లింపులు 7.36 కోట్లతో సరిపెట్టేశారు. క్యాపిటల్ ఎక్స్పెండేచర్ కింద చంద్రబాబు కంటే ఎక్కువగా రూ.1134 కోట్లు ఖర్చు చేయడం నివేదికలో కనిపిస్తున్నది.

మరి కాలేజీ టీడీపీయే కదా!

రేవంత్ రెడ్డి ఇటీవ‌ల ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో మాట్లాడుతూ టీడీపీ కాలేజీలో చ‌దువుకున్నాన‌ని చెప్పారు. ఆయన ఈ మాట చెప్పక ముందే చంద్రబాబుకు రేవంత్‌ రెడ్డి శిష్యుడనే వాదనలు, అభిప్రాయాలు, ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు సీఎంలుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు, రేవంత్‌ల‌కు ప్రభుత్వాలను నడపటం స‌వాల్‌గా మారింది. ఒక‌వైపు ఇచ్చిన హామీల అమ‌లు, మ‌రోవైపు కార్య‌క్ర‌మాలతో ఇద్దరికీ కత్తిమీద సాములా పరిస్థితి తయారైంది. అటు వైఎస్‌ జగన్‌ లేదా ఇటు కేసీఆర్‌ ప్రభుత్వాలు ఎంత ఆదాయం వస్తున్నదనేది పరిగణనలోకి తీసుకోకుండా.. సంక్షేమ పథకాల అమలు పేరుతో అడ్డగోలుగా అప్పులు చేశాయనే విమర్శలు ఉన్నాయి. ఇలా.. అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నాటి విచ్చలవిడి అప్పుల ప్రభావం తక్షణమే కనిపించింది. ఫలితంగా చిల్లర ఖర్చులకు సైతం అప్పులు చేసుకోవాల్సిన దుస్థితి రెండు ప్రభుత్వాలకూ దాపురించిందని పరిశీలకులు అంటున్నారు. ఆఖరుకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించుకోవడానికి సైతం కొత్తగా అప్పులు చేయాల్సిన దుర్గతి పట్టింది. ఈ క్రమంలోనే గురు శిష్యులిద్దరూ అప్పుల్లో పోటీపడుతున్నారని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

క‌ల‌రింగ్‌లు కాదు…

అప్పుల్లో పోటీ ప‌డుతున్న బాబు.. రేవంత్‌ల మ‌ధ్య మాట‌ల విష‌యంలో తేడా చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు అమ‌రావ‌తిని అద్బుతంగా నిర్మిస్తున్నామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ ప్ర‌క‌టించి ఏపీలో ఏదో జరుగబోతున్నదనే భ్రమలు కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. మరోవైపు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి తనను కోసినా నయా పైస అప్పు పట్టుడం లేదని బహిరంగంగానే వాపోయారు. తమ ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పరిస్థితిని అర్థం చేసుకోవాలని దాదాపు మొత్తుకున్నంత పని చేశారు.

గత ప్రభుత్వాల్లో ప‌ప్పు బెల్లాల్లా నిధుల ఖ‌ర్చు

తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడం వెనుక గత ప్రభుత్వాల విచ్చలవిడి ఖర్చులు, అప్పులేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవే ఇప్పుడు ప్రభుత్వాలపై పెను భారంగా పరిణమించాయని చెబుతున్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసిన గ‌త పాల‌కులు, బ‌డ్జెట్‌లో చూపించిన వాటి కంటే రెట్టింపుగా బ‌డ్జెటేత‌ర అప్పులు చేస్తుండటం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్ర‌త్యేకంగా అధికారులు రిజ‌ర్వ్ బ్యాంకుతోపాటు ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల చుట్టూ తిరిగి అప్పులు సంపాదించే పనిలోనే ఉంటున్నారంటే ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని ఈ రెండు రాష్ట్రాల‌ను ద‌గ్గ‌రగా ప‌రిశీలిస్తున్న రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు. ఈ రెండు రాష్ట్రాల‌ను పాలించిన సమయంలో జ‌గ‌న్‌, కేసీఆర్ ఇద్ద‌రూ అప్పులు తెచ్చి డ‌బ్బుల‌ను ప‌ప్పు బెల్లాల్లా పంచి పెట్టార‌ని, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌ చేయ‌కుండా ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ చేశార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాలకు అవే ఇప్పుడు గుదిబండ‌లా మారాయని అన్నారు. ఏపీలో చంద్ర‌బాబు కానీ, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి లు కానీ అప్పుల జోలికి వెళ్ల‌కుండా ఆదాయం సృష్టించి, వ‌చ్చిన ఆదాయాన్ని ప్ర‌జ‌ల‌కు ఖర్చు చేసే విధంగా ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాల‌ని ఆర్థిక ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు.