40 రోజులుగా రోడ్లపైనే.. ఏపీలో ఉధృతమైన అంగన్వాడీల సమ్మె

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం 40వ రోజూ కొనసాగింది

40 రోజులుగా రోడ్లపైనే.. ఏపీలో ఉధృతమైన అంగన్వాడీల సమ్మె

– మంత్రి పెద్దిరెడ్డి ఘెరావ్

– రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై బైఠాయించి నిరసనలు

విధాత: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం 40వ రోజూ కొనసాగింది. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా కైకలూరు, కృష్ణాజిల్లా గుడివాడ, విజయవాడ, అనంతపురంలో ఆందోళనలు మిన్నంటాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్డెక్కారు. అక్కడే బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించగా, నిరసనకారులు ఘెరావ్ చేశారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాన్వాయ్ కి అడ్డంగా కూర్చున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను పక్కకు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పెద్దిరెడ్డిపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.26 వేలు జీతం, గ్రాట్యుటీతో పాటు మెడికల్ లీవ్ లు, మినీ వర్కర్లను ప్రధాన కార్మికులుగా గుర్తించడం, పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

2018 ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. జగన్ కు ఓటు వేసినందుకు మాకు బుద్ది వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైనడిమాండ్లపై దిగిరాకపోతే ఈనెల 23 నుంచి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.