Seethakka | అంగన్వాడీల ఆహారంలో మార్పులు

విధాత : అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరి చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్వాడీ వాహనాలను ఏర్పాటు చేసి అర్హులందరికీ గుడ్లు, ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. టేక్ హోమ్ రేషన్ ఇవ్వడమే కాకుండా ఆ ఇండ్లను అంగన్వాడీ సిబ్బంది సందర్శించి సరఫరా చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా పరిశీలించి అవగాహన పెంచాలన్నారు.
టీనేజ్ బాలికలతో స్వయం సహాయక బృందాలు
కౌమర బాలికలకు పోషకాహారంపై అవగాహాన పెంచేందుకు టీనేజ్ బాలికలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సీతక్క అన్నారు. 14 నుంచి 18 ఏళ్లలోపు కిశోర బాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పల్లీ పట్టీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ స్కీంను అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖలోని అన్ని విభాగాలు నిర్దిష్ట గడువు ను నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని అది కారులను ఆదేశించారు.
చివరి నిమిషంలో ప్రణాళికలు వేసుకోవడం వల్ల బడ్జెట్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని, ఎప్పటికప్పుడు బడ్జెట్ ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 3 అంగన్వాడీ భవనాలను నిర్మించే పనులను ప్రారంభించాలని సూచించారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసే దిశలో పనిచేయాలని 6 ఏళ్లలోపు చిన్నారులంతా అంగన్ వాడీ కేంద్రాల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలో అంగన్వాడీల్లో హాజరు శాతం పెరగాలని, టార్గెట్ రీచ్ కావాలన్నారు. పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని దత్తత ఇచ్చేలోపు, పిల్లల సంరక్షణ బాధ్యత స్వీకరించేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని, ఆ చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే వారికి ఆర్థిక చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు
కుటుంబంలో దివ్యాంగులుంటే వారి పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని మంత్రి సీతక్క తెలిపారు. దివ్యాంగులకు అత్యవసరమైన సర్జరీలను ప్రభుత్వమే చేయిస్తుందని, వారికి ఆర్థిక అందుకు అనుగుణంగా దివ్యాంగులను గుర్తించి అధికారులు సర్జరీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాస్ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయిస్తున్నామన్నారు.