ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు … సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు

విధాత : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి. బీసీ జనార్దన్రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, ఎన్ఎండీ ఫరూక్ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసం సెట్టి సుభాష్ తదితరులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రమాణం చేసిన జగన్
ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సహా ఆ పార్టీ శాసన సభ్యులు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా చాంబర్‌కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినప్పుడే సభలో జగన్ అడుగుపెట్టారు.
రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాతా తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలో శాసన సభలో చంద్రబాబును కించపరిచేలా చేసిన వ్యాఖలు చేశారు. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం… దానికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు. ఆవేదనకు, ఆగ్రహానికి గురైన చంద్రబాబు మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. ప్రజలు టీడీపీ కూటమికి భారీ మెజార్టీ కట్టబెట్టడంతో తను అనుకున్నట్లుగానే సీఎంగా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి తన శపథం నెరవేర్చుకున్నారు. బాబు తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత శాసనసభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అలింగనం చేసుకున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరారు.
వైరల్‌గా నారా భువనేశ్వరి ట్వీటర్
అటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. నేడు గౌరవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన శపథంతోపాటు నేడు ప్రమాణ స్వీకారం చేసిన విజువల్స్ ఉన్నాయి.