అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. మంత్రి నారా లోకేష్ నిర్వహించిన సమీక్షలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నోటిఫికేషన్ల షెడ్యూల్‌పై చర్చించారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇప్పటికే తొలి దశలో 1,523 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మూడో, నాలుగో దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ దశ నోటిఫికేషన్‌లో ఆలస్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్ తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించారు. మూడో దశలో 2,388 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. నాలుగో దశలో 2,981 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇక హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, భద్రతా విభాగాల్లో అవసరమైన సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల పెంపుపై పరిశీలన
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఆలస్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అలాగే జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా పూర్తి స్థాయి ఖాళీల వివరాలను వచ్చే కేబినెట్ సమావేశానికి అందించాలని అధికారులను ఆదేశించారు.
గ్రూప్-1 పోస్టుల సంఖ్య పెంపు అంశంపై మంత్రుల బృందం అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.ఉద్యోగార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
