Excise Policy | ఏపీలో రూ.90కే క్వార్టర్ మద్యం బాటిల్.. నూతన ఎక్సైజ్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీలో మద్యం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90కే విక్రయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

విధాత, హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీలో మద్యం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90కే విక్రయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా చూడాలని నూతన పాలసీలో భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తక్కువ ధర(చీఫ్ లిక్కర్) కేటగిరీలో క్వార్టర్ బాటిల్‌ను రూ.200కు విక్రయించారు. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు అధిక ధరలకు మద్యం కొనలేక గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారన్న విమర్శలు వినిపించాయి.
గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయంలో తేలినట్లు ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు.. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. మద్యం కొనగోళ్లపై ఆయా కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.