High Court | ఏపీ సర్కార్‌కు బిగ్ రిలీఫ్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు(డీబీటీ)ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ హైకోర్టు అనుమతించడం ఎన్నికల వేళ భారీ ఊరటనిచ్చింది
డీబీటీ పథకాల నగదు విడుదలకు అనుమతి
లబ్ధిదారుల ఖాతాల్లోకి 14వేల కోట్ల బదిలీ
విధాత, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు(డీబీటీ)ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ హైకోర్టు అనుమతించడం ఎన్నికల వేళ భారీ ఊరటనిచ్చింది. అయితే 10వ తేదీ వరకు మాత్రమే ఇందుకు అవకాశమిచ్చింది. 11,12తేదీల్లో ఎలాంటి నగదు బదిలీ జరుగరాదని తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ తర్వాత వివాదానికి కారణమైన డీబీటీ పథకాలపై హైకోర్టు ఈ కీలకనిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఒక్కరోజు పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలా వేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎలాంటి ప్రకటనలు, ఎలాంటి ప్రచారం వద్దని ఆదేశాలు ఇచ్చింది.
ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, చేయూత, పంట నష్టపరిహారంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో 14వేల కోట్లకుపైగా వేయాల్సి ఉందని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ సీఎస్ అనుమతి కోరారు. పోలింగ్ ముందు ఇలాంటివి చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని అందుకే పోలింగ్ అయిన తర్వాత రోజు నుంచి వేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై వైసీపీ సానుభూతిపరులు కొందరు కోర్టుకు వెళ్లారు. పిటిషన్ అనుమతిచ్చిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఐదు గంటల పాటు ఈ వివాదంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇది ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఎన్నికల సంఘం వాదించింది. మే 13న పోలింగ్ ఉన్నందున పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే సమప్రాధాన్యత ఇచ్చినట్టు కాదని పేర్కొంది. జనవరి నుంచి మార్చి 16 వరకు ఇవ్వాల్సిన పథకాల నిధులు విడుదలను ఇప్పటి వరకు ఆపి పెట్టారంటనే ఇందులో ఏదో మతలబు ఉందని ఈసీ వాదించింది.
ఈసీ వాదనలపై స్పందించిన పిటిషనర్ల తరఫు లాయర్లు… ఇవి కొత్త పథకాలు కావని పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని ఇప్పుడు ఇవ్వకుంటే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వాదించారు. నిధుల లభ్యతను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంటుందని దీనికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని తెలిపారు. మొదట్లో అసలు జూన్ వరకు నిధుల విడుదలకు వీలు లేదని చెప్పిన ఎన్నికల సంఘం తాజాగా మే 14 తర్వాత విడుదల చేసుకోమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు డబ్బును ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని సూచించింది. దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయడం, ప్రచారం చేయడం వద్దని ఆదేశించింది. ఎన్నికల రూల్స్‌ను అతిక్రమించి ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, నేతల జోక్యం లేకుండా పంపిణీ జరగాలని తేల్చి చెప్పింది. అనంతరం కేసును జూన్ 27కి వాయిదా వేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram