Tirupati SV Varsity Gets Bomb Threat Ahead of CM Visit | చంద్రబాబు పర్యటనలో బాంబు బెదిరింపులు!

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్ద బాంబులు ఉన్నట్లు ఈ-మెయిల్ రావడంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.

Tirupati SV Varsity Gets Bomb Threat Ahead of CM Visit | చంద్రబాబు పర్యటనలో బాంబు బెదిరింపులు!

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన కోసం హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ వద్ద 5 ఆర్డీఎక్స్, ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఈమెయిల్‌ బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతాధికారుల అప్రమత్తమయ్యారు. హెలిప్యాడ్‌ పరిసరాల్లో బాంబు స్క్వాడ్‌, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం సీఎం చంద్రబాబు నారావారిపల్లికి రానున్నారు. వాతావరణం సరిగా లేక ఆయన పర్యటన రద్దయినట్లుగా సమాచారం.

మరోవైపు.. ఈ-మెయిల్ ఎవరు పంపించారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారుల వెల్లడించారు. ఇంతకుముందు అక్టోబర్ 3న తిరుపతిలోని పలు ప్రాంతాలకు బాంబు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిని ఐఎస్ఐ, మాజీ ఎల్‌టీటీఈ మిలిటెంట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 6న తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. గతంలో 2003 అక్టోబర్ 1న ఉమ్మడి ఏపీ సీఎంగా హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అలిపిరి ఘాట్ రోడ్డులో మావోయిస్టులు క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటనలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు.