Andhra Pradesh : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభం.. రాష్ట్ర వ్యాప్తంగా 2.62 కోట్లు మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్ ప్రయాణం.

Andhra Pradesh : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

Andhra Pradesh | అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ వసతి కల్పించే ‘స్త్రీశక్తి’పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.
ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినచంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు మహిళలు, టీడీపీ మహిళా విభాగం కార్యకర్తలు దారి పొడుగునా, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. తమ ప్రయాణంలో వారు కండక్టర్ నుంచి టికెట్ కొనడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడం ద్వారా మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోందన్నారు.

రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. రాష్ట్రవ్యాప్తంగా 2.62 కోట్ల మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఈ సౌకర్యం పొందనున్నారు. ఐదు రకాల బస్సులు .. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో ఫేర్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళా సాధికారిత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని కోరారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నామని.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి…

చక్కనమ్మకు చిక్కిన విలువైన వజ్రం..జాక్ పాట్ పట్టేసింది

అక్రమ సరోగసీ దందాలో మరో ఇద్దరి అరెస్టు