Illegal Surrogacy Arrests | అక్రమ సరోగసీ దందాలో మరో ఇద్దరి అరెస్టు
మాదాపూర్‌లో అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్‌లో తల్లి-కొడుకు అరెస్టు. పేద మహిళలతో ఒప్పందాలు చేసి డబ్బు సంపాదన.

Illegal Surrogacy Arrests | విధాత, హైదరాబాద్ : సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలు వెలుగుచూసిన క్రమంలో అలాంటి మరిన్ని ఫెర్టిలిటీ సెంటర్లు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల మేరకు మాదాపూర్‌లోని రెండు ఆస్పత్రుల్లో అక్రమంగా సరోగసి, ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీకి చెందిన నర్రెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. వారు ఫర్టిలిటీ ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను రప్పించి వారికి తమ ఇంట్లోనే ఆశ్రయమిచ్చి వారి ద్వారా సరోగసీ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పని చేసినట్లు సమాచారం. సంతానం కోసం వచ్చే ధనవంతుల నుంచి, సరోగసీ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవారని.. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎంచుకుని తల్లీ కొడుకులు ఎగ్ డోనర్, సరోగసి మదర్‌గా ఒప్పందాలు చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లక్ష్మి రెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
అంత్యక్రియలతో ఏనుగుకు కన్నిటి వీడ్కోలు
హైదరాబాద్ లో వెలుగులోకి లవ్ జిహాద్ !