CM Chandrababu Naidu : కుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
కుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. హాంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు ద్వారా వచ్చిన జలాలతో సీమ ప్రజల్లో ఆనందం.

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి హాంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు ద్వారా తరలివచ్చిన కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చారు. కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనీవా కృష్ణా జలాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీఎం జలహారతి ఇచ్చారు. హాంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి సీమ నేలపై గలగలా పారుతూ కుప్పానికి చేరుకున్న కృష్ణా జలాలను చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జలహారతి అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు హాజరై మాట్లాడారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు చేసుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణమ్మ రాకతో నెరవేరిన చంద్రబాబు హామీ
కుప్పం నియోజకవర్గానికి హాంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తీసుకొస్తానంటూ సరిగ్గా 9 ఏళ్ళ క్రితం అసెంబ్లీ సాక్షిగా, సీమ ప్రజలకు ఇచ్చిన మాటని చంద్రబాబు నిలబెట్టుకోవడం పట్ల కుప్పం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సుదూరాన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి 19 నియోజకవర్గాలని తాకుతూ, 423 చెరువులు నింపుతూ, 738 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పాన్ని ముద్దాడిన సందర్భం స్థానికులకు వేడుకగా మారింది. శ్రీశైలం నుండి వరద జలాలను మళ్లించి సీమ జిల్లాల్లోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగు నీరు ఇవ్వడం హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు లక్ష్యం. కుప్పం వరకు కృష్ణా జలాలను తీసుకువెళ్లేందుకు 2014-19 మధ్య హంద్రీనీవా విస్తరణ పనులు ప్రారంభించి 47 శాతం పనులను చంద్రబాబు ఏపీ తొలి ప్రభుత్వ హయాంలో పూర్తి చేయించారు. ఆ తర్వాత జగన్ హయాంలో పనులు ఆగిపోయాయి. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి చేయించడంతో రాయలసీమ నేలపై కృష్ణమ్మ పరుగులు సాగుతున్నాయి.