Chandrababu Offers Silk Clothes To Kanka Durga | దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
సీఎం చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు దర్శనం సౌకర్యం కల్పించారు.

అమరావతి : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మూల నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రబాబుకు మంత్రులు ఆనం, కొల్లు, ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా కలెక్టర్, దేవాలయ పాలక మండలి చైర్మన్, ఈవో, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ నుంచి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజల అనంతరం చంద్రబాబుకు మంత్రి ఆనం నారాయణరెడ్డి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులు యధావిధిగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. దుర్గమ్మ ప్రజలందర్నీ ఆశీర్వదించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. రిజర్వాయర్లు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు 94 శాతం మేర నిండాయని.. భక్తులకు ఇబ్బందులు లేకుండా దుర్గమ్మ దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. అన్నప్రసాద భవన నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందదని..ఒకేసారి 1500 మంది అన్న ప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా రూ.25 కోట్లతో భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రసాదం తయారీ కోసం రూ.27 కోట్లతో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తాం. అలాగే ప్రధాన ఆలయం వద్ద రూ.5.5 కోట్లతో పూజా మండప నిర్మాణం చేపడుతున్నామని..దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.