CM Chandra Babu | చెప్పినట్టే గౌరవ సభకు వచ్చా.. మహిళలకు అన్యాయం జరుగనివ్వను: సీఎం చంద్రబాబు
గత అసెంబ్లీలో తన గురించి, తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడుతుంటే కనీసం ఖండించడానికి కూడా తనకు మైక్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు

నాడు సభా సంప్రదాయాలను దెబ్బతీశారు
బాంబు దాడి జరిగినా కన్నీళ్లు రాలేదు నా భార్యపై నీచంగా మాట్లాడారు
అలాంటి వ్యక్తులు, నేతలు, పార్టీ రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావించారు
అందుకే మమ్మల్ని గెలిపించారు
తనకు, రాష్ట్రంలోని మహిళలకు జరిగిన అవమానం మరెవరికీ జరగనివ్వను
జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటా
ఇప్పుడు కూటమికి 164 సీట్లొచ్చాయి..
1+6+4 కూడితే.. వైసీపీకి వచ్చిన సీట్లు
అమరావతి ఉద్యమం 1136 లెక్కా అదే
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్
ప్రజలకు జవాబుదారీతనంతో ఉందాం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : గత అసెంబ్లీలో తన గురించి, తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడుతుంటే కనీసం ఖండించడానికి కూడా తనకు మైక్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. ఇలాంటి సభలో ఉండను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని చెప్పానని, చెప్పినట్టే ఇప్పుడు గౌరవ సభకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చానని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున స్పీకర్‌గా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానం వరకూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌తో తీసుకెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు.
అనంతరం ఆయనను అభినందిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు. చట్టసభలకు రావడం అరుదైన అవకాశమని చెప్పారు. ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాలన్నారు. గెలిచి వచ్చిన మనందరిపై పవిత్రమైన బాధ్యత ఉందని, చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగా ఉండాలని చెప్పారు. మనం ఇక్కడ మాట్లాడే విషయాలన్నింటినీ రాష్ట్రమంతా చూస్తారని తెలిపారు.
సభా సంప్రదాయాలను దెబ్బతీసిన గత ప్రభుత్వం
శాసన సభ సాంప్రదాయాలను వికృత పోకడలతో గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి సభలో సమస్యలపై మాట్లాడటానికి మైక్ ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వలేదని, దూషణలు, బూతులు, వెకిలి చేష్టలతో సభ విలువలను దెబ్బతీశారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సభలో దాడికి పాల్పడటంతో పాటు నీచంగా మాట్లాడి వ్యక్తిత్వం హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో నేడు ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారని చెబుతూ.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమాన పరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు.
అయ్యన్నపాత్రుడు స్పీకర్ కావడం సంతోషం
తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ శాసనసభ్యులు, బీసీ నేతగా గుర్తింపు ఉన్న అయ్యన్న పాత్రుడిని శాసనసభ అధ్యక్ష పదవిలో చూడటం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందించారు. యువత రాజకీయాల్లోకి రావాలని నాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో 23 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచారని, 7సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా, మంత్రిగా తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని చెప్పారు.
నర్సిపట్నంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయనే పని చేస్తున్నారని గుర్తు చేశారు. అయ్యన్న రాజీపడని నేత, విలక్షణ నేత అని, ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారని అన్నారు. కానీ అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితంలో ఏనాడూ పడని ఇబ్బందులు గత ఐదేళ్లు అనుభవించారని చెప్పారు. ‘ఆయన ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా 23 కేసులు పెట్టారు. అయినా భయపడలేదు.’’ అని చంద్రబాబు అన్నారు.
ఏ మహిళకూ అవమానం జరగనివ్వను
9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు వచ్చినన్ని అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని చెప్పారు. అలిపిరిలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు కూడా తనకు కన్నీళ్లు రాలేదని, కానీ.. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యపై నీచంగా ఆనాడు మాట్లాడారని గుర్తు చేశారు.
‘రాష్ట్రంలో గౌరవంగా బతికే ప్రతి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టారు. ఎంతో మంది ఆడబిడ్డలు ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు, నేతలు, పార్టీ రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావించి మమ్మల్ని గెలిపించారు’ అని చంద్రబాబు చెప్పారు. గతంలో తనకు, రాష్ట్రంలోని మహిళలకు జరిగిన అవమానం మరెవరికీ జరగనివ్వనని, తన జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
ప్రజలు ఇచ్చింది అధికారం కాదు.. బాధ్యత
2019 ఎన్నికల్లో తమకు 23 సీట్లే వచ్చినప్పుడు బాధ కలిగిందని 2019లో 23వ తేదీన ఫలితాలు వస్తే.. 23 సీట్లు వచ్చాయని ఎగతాళి చేశారని చంద్రబాబు చెప్పారు. ‘ఇప్పుడు కూటమికి 164 సీట్లొచ్చాయి.. విడదీసి కూడితే 11 వస్తుంది. రాజధాని కోసం 1136 రోజులు అమరావతిలో ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ నెంబర్లు కలుపుకొన్నా 11 వస్తుంది. నేడు వైసీపీ గెలిచింది 11 చోట్లమాత్రమే’ అని చంద్రబాబు తెలిపారు. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని పెద్ద డైలాగులు చెప్పారని, కానీ.. ఆయన పార్టీ అభ్యర్థులు 21 సీట్లలో పోటీ చేస్తే అన్నింటిలోనూ గెలిచారని అన్నారు.
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. ‘ఇది 16వ శాసనసభ…నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా 15వ సభ జరిగింది. జరిగిన పరిణామాలతో అది కౌరవ సభగా మనం భావించాం. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలి. 24 గంటలూ మనం ప్రజలతో ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి. ప్రజలు మనకు అధికారం ఇవ్వడం కాదు… రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజధాని కట్టాలి…పోలవరం పూర్తి చేయాలి
హైదరాబాద్ నగరం బెస్ట్ సిటీగా ఉందంటే మనం తీసుకున్న నిర్ణయాలే కారణమని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నేడు భారత్ ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది….మరో నాలుగైదేళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత భారత్ మన కల కావాలి. అందుకు అగుణంగా సభలో చర్చలు, నిర్ణయాలు, పాలసీలు రావాలి’ అని సూచించారు. టంగుటూరి ప్రకాశం పంతులు, మోటూరి హనుమంతరావు, ఎంజీ రంగా, కాళేశ్వరరావు, కాసాని వెంకటరత్నం లాంటి గతంలో శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని, చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీఆర్ తదితరులందూ మనకు ఆదర్శం కావాలని అన్నారు. ‘రాజధాని కట్టుకోవాలి…పోలవరం పూర్తిచేసుకోవాలి. నదుల అనుసంధానం చేసుకోవాలి…పెట్టుబడులు రావాలి…యువతకు ఉద్యోగాలు రావాలి. బడుగులకు న్యాయం చేయాలి. ఈ లక్ష్యాల సాథన కోసం సభను సజావుగా నడిపించుకోవాలి’ అని చెప్పారు.