కాలు దువ్విన పందెం కోళ్లు
ఆంధ్రాలో కోడి పందేలు జోరందుకున్నాయి. కోస్తా జిల్లాల్లో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. సంక్రాంతి సందడిలో పందెం బరులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి

– ఆంధ్రాలో కోడి పందేల జోరు
– బరులు సిద్ధం.. కాచుకున్న పందెంరాయుళ్లు
– రూ.కోట్లల్లో చేతులు మారుతున్న నగదు
– హైటెక్ హంగులతో భారీ ఏర్పాట్లు
– భోగి రోజు కాస్త నెమ్మదిగా..
– రెండోరోజు నుంచి కనుమ వరకు పుంజుకోనున్న పందేలు
– పోలీసుల ఆంక్షలూ లెక్కచేయని బరుల నిర్వాహకులు
విధాత: ఆంధ్రాలో కోడి పందేలు జోరందుకున్నాయి. కోస్తా జిల్లాల్లో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. సంక్రాంతి సందడిలో పందెం బరులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కోడి పందేల నిర్వాహకులు తమ కోడి పుంజులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. కోడి పందేలు చూసేందుకు వచ్చే అతిథుల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు, హైటెక్ హంగులతో కోడి పందేలకు తెరతీశారు. మూడు రోజుల పాటు భారీ స్థాయిలో పందేలు జరుగుతుంటాయి. బరుల వద్ద రూ.కోట్లల్లో నగదు చేతులు మారనున్నట్లు నిర్వాహకులే చెబుతున్నారు. కోడి పందేలు తిలకించేందుకు జనం తరలివస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. ఏటా సంక్రాంతికి మూడు రోజుల పాటు ఇక్కడ కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీ. కోడి పందేలకు పెట్టింది పేరైన ఉభయ గోదావరి జిల్లాలు పందెంరాయుళ్లతో కిటకిటలాడుతున్నాయి. పోలీసు ఆంక్షలు ఉన్నా.. ఈ పండుగ మూడు రోజులు ఎవరు అవునన్నా, కాదన్నా కోడి పందేలు ఆగే పరిస్థితి లేదు. జిల్లాల్లో పోలీసులు మాత్రం కోడి పందేలపై పంజా విసురుతున్నారు. భోగి రోజు కాస్త నెమ్మదిగా మొదలైనా, రెండో రోజు నుంచి కనుమ వరకూ పందేలు పుంజుకుంటాయని నిర్వాహకులు చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామగ్రామాన కోడిపందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధమయ్యాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేల బరులను సిద్ధం చేశారు. బరుల వద్ద గుండాట, పేకాట వంటి జూదాలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ ఏడాది రూ.వందల కోట్లకు పైగా చేతులు మారనున్నాయని పందెంరాయుళ్లే చెబుతున్నారు. రాష్ట్రంలోనే అంపాపురం ప్రధానబరిగా పేరుగాంచింది.

ఇక్కడ రూ.కోట్లల్లో పందేలు నిర్వహించేందుకు అన్ని రకాల హంగులతో ఏర్పాట్లు చేశారు. ప్రధాన బరిలో ఒక్కో పందెం రూ.5 లక్షలకు పైనే వేయనున్నారు. పక్కన ఉన్న బరుల్లో రూ.3 లక్షల నుంచి రూ.50 వేల వరకూ పందేలు నిర్వహించనున్నారు. జగ్గయ్యపేట, తిరువూరు, పామర్రు ప్రాంతాల్లోనూ కోడి పుంజులు కాళ్లు దువ్వుతున్నాయి. బరులు, పేకాట శిబిరాల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో పంట పొలాలే బరులకు వేదికలు అయ్యాయి. మామిడి తోటలు కిటకిటలాడుతున్నాయి. బారులు తీరిన వాహనాలు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డి గూడెం, ఉండి, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. పందేల వీక్షణకు చుట్టూ ఫ్లడ్ లైట్లు, ఎల్ ఈడీ స్ర్కీన్లు పెట్టారు. రాజమహేంద్రవరం జిల్లాలోని అన్ని మండలాల్లో కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్, కడియం, రాజా నగరం, కోరుకొండ, గోకవరం, సీతానగరం, రంగంపేట, అనపర్తి, బిక్కవోలు తదితర ప్రాంతాల్లో పందెం కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. పొలమూరు, పీరా రామచంద్రపురం గ్రామాల్లో భారీ ఏర్పాట్లు చేపట్టారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో బరులు పైకిలేచాయి. ఊరి శివారుప్రాంతాల్లో టెంట్లు వెలిశాయి. మరోవైపు పోలీసులు కోడి పందేలపై కఠిన ఆంక్షలు విధించారు.

కోడి పందేలు, గుండాటలకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. రెండు రోజులుగా పోలీసు బృందాలు దాడులు చేస్తూ, నిర్వాహకులకు హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే ఏర్పట్లతో సిద్ధమైన నిర్వాహకులు సందిగ్ధంలో పడుతున్నారు. పోలీసులు ఏర్పాట్లను ధ్వంసం చేస్తుండడంతో పాటు ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేసినట్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోడి పందేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కొందరికి కోడి పందేలు లేకపోతే పండగ అనిపించనట్లు అయిపోయింది. చివరకు కోడి పందేలు రాజకీయ నేతల కనుసన్నల్లో జరిగే స్థాయికి చేరిపోయాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పందెంరాయుళ్లను సైతం ఆనందపరిచేలా ఇప్పటికే అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసుల అనధికార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వారి కనుసన్నల్లోనే పందేల బరులు సిద్ధమయ్యాయి. కోర్టులు వద్దన్నా, పోలీసులు అడ్డుకున్నా, రాజకీయ నేతలు మాత్రం కోడి పందేలకే మొగ్గుచూపుతున్నారు. ఆంధ్రా సంక్రాంతి సంబరంలో కోడి పందెం రుచి చూడాల్సిందే అన్నట్టు కోడి పుంజులు కాలు దువ్వుతున్నాయి.