APSRTC Bus Accident | జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలిబూడిదైన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు సేఫ్..!
APSRTC Bus Accident | ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆర్టీసీ బస్సు కూలి బూడిదయ్యింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికి గాయాలపాలవగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

APSRTC Bus Accident | ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆర్టీసీ బస్సు కూలి బూడిదయ్యింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికి గాయాలపాలవగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి 12 గంటలకు బయలుదేరిన ఈ లగ్జరీ బస్సు.. ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మరానికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. బస్సు బురెడ్డిపల్లి మూలమలుపు వద్దకు చేరుకోగానే డీసీఎం వ్యాన్ యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది.
అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొట్టుకున్నాయి. బస్సు నియంత్రణ కోల్పోయిన రోడ్డును దాటి కిందకు దూసుకెళ్లింది. రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కొద్ది క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. ప్రమాదం నుంచి వెంటనే తేరుకున్న ప్రయాణికులు బస్సు దిగి బయటకు వచ్చారు. మరికొందరు అద్దాలను పగులగొట్టి బయటపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన అరగంటలోపే బస్సు పూర్తిగా దగ్ధమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 108లో క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిని బయటకు తీసుకురాకపోతే బస్సులోనే కాలిబూడిదయ్యే వారి పలువురు పేర్కొన్నారు. అయితే, బస్సులో మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుకు విద్యుత్ తీగలు తాకడంతో మంటలు వచ్చాయా? డీసీఎంతో ఢీకొట్టుకోవడంతోనే వచ్చాయా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అనంతపురంకు చెందిన లక్ష్మీదేవి సంజీవ, మోహన్ (హైదరాబాద్), మైథిలి (హైదరాబాద్), కార్తిక్ (నంద్యాల), దస్తగిరి (నంద్యాల), హీరాలాల్ (కోఠి, హైదరాబాద్) ఉన్నారు. అర్చన (హైదరాబాద్), సునీల్ (అనంతపురం), గాయత్రి (అనంతపురం)తో మరికొందరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో 15 మంది వరకు గాయపడ్డారు. అందరికీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు.