AP | కర్నూలుకు సైరా నరసింహా రెడ్డి పేరు పెట్టాలి.. మాజీ ఎంపీ విజయసాయి డిమాండ్

ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లతో జిల్లాలు ఉన్నాయని కాని సైరా నరసింహా రెడ్డి పేరుతో జిల్లా లేదని మాజీ వైసీపీ ఎంపీ వీ.విజయ సాయిరెడ్డి అన్నారు.

AP | కర్నూలుకు సైరా నరసింహా రెడ్డి పేరు పెట్టాలి.. మాజీ ఎంపీ విజయసాయి డిమాండ్

అమరావతి, విధాత :
ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లతో జిల్లాలు ఉన్నాయని కాని సైరా నరసింహా రెడ్డి పేరుతో జిల్లా లేదని మాజీ వైసీపీ ఎంపీ వీ.విజయ సాయిరెడ్డి అన్నారు. ఆదివారం నాడు శ్రీకాకుళంలో విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు జిల్లాకు సైరా నరసింహా రెడ్డి పేరు పెడితే స్వాతంత్ర్య సమరయోధుడిని గౌరవించినట్లు అవుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ భవనం నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని, ఆ విషయాన్ని సంఘం కార్యవర్గానికి తెలియచేశానన్నారు. ‘ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది నాపై సెటైర్లు వేస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా నేను ప్రస్తుతం రైతును మాత్రమే’ అని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని, ఏ పార్టీలో చేరే ఆలోచన కూడా తనకు లేదని చెప్పారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపానని, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్నానని నన్ను బదనాం చేశారన్నారు. ఇంత వరకు కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టులు, వైసీపీ పార్టీ నుంచి తనకు ఆహ్వానం అందలేదన్నారు. పవన్ కల్యాణ్ తో 20 ఏళ్ల స్నేహం ఉందని చెప్పారు. పవన్‌ను నేను ఎప్పుడూ విమర్శించలేదు.. జీవితంలో కూడా ఎప్పుడు విమర్శించనని ఆయన అన్నారు. రాజకీయాల నుంచి ఏ రకంగా నిష్క్రమించాను అనేది అందరికీ తెలుసని.. అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎవరికీ లొంగలేదన్నారు. తన విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. నిబద్ధతలేని వారి మాటలు వినవద్దని జగన్ రెడ్డికి విజయ సాయిరెడ్డి సూచించారు.