Pawan Kalyan | పులుల సంఖ్య పెంచాలి ,సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్
అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి, తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

అంతర్జాతీయ పులుల దినోత్సవం లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్
టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం
పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి
పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది
‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ గారు ప్రస్తావించడం సంతోషకరం
వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే
అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు
అమరావతి: అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి, తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన శ్రీ బేబీ నాయన, ఆయన మిత్రులు దేశంలోని జాతీయ పార్కులు, టైగర్ సఫారీల్లో తీసిన పులుల ఫోటోలను అక్కడ ప్రదర్శించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య, అభయారణ్యంలో తీసుకోవలసిన భద్రత చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఇంటి ఆవరణనే చిన్నపాటి అడవిగా మార్చానన్నారు. తాను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడినని, నా ఫాం హౌస్ లో నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నానన్నారు. హైదరాబాద్ లో నేను ఉండే 1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడ అరుదైన పక్షులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయన్నారు.

నల్లమల శివ, చిగుళ్ళ మల్లికార్జున్ ల మాటలు కదిలించాయి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పులుల సంరక్షణ గురించి చెబుతూ నల్లమల అడవుల్లో చెంచులు టైగర్ ట్రాకర్స్ గా ఉన్నారనీ, అక్కడ వన్యప్రాణుల సమాచారం అందించడంతోపాటూ అక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతారని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. పులులు వారి సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పిన మాటలు స్ఫూర్తి కలిగించాయన్నారు.
కొన్ని సంవత్సరాల కిందట- నల్లమల ప్రాంతానికి చెందిన చెంచు జాతికి చెందిన 16 ఏళ్ల శివ అన్న కుర్రాడు హైదరాబాద్ లో మా ఆఫీస్ దగ్గరకి వచ్చాడని, అతనితో మాట్లాడినప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకి ఉన్న నిబద్దత తెలిసిందన్నారు. అతను నా దగ్గరకు వచ్చిన పని నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే మా అడవులు పోతాయి.. పులులు చచ్చిపోతాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నల్లమల విధ్వంసానికి గురవుతుంది. నా మాట ఎవరు వింటారో తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏమైనా చేయమని అడిగాడన్నారు. ఆ క్రమంలో కాంగ్రెన్ నాయకులు వి. హనుమంతరావు కు చెప్పి నల్లమలలో యురేనియం అన్వేషణపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఆ సమావేశంలో చిగుళ్ల మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయన్నారు. ‘నల్లమలలో ఉన్న చెట్లు, జంతువులు, వాగులు అన్నింటినీ మేము దేవతలుగా కొలుస్తామని, పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర, ఎలుగుబంటిని లింగమయ్యగా చూస్తామని చెప్పారన్నారు. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మగా కొలుస్తామని తెలిపారన్నారు. తేనెలో ఉండే తెల్లగడ్డను మల్లమ్మ అంటాం’ అని అక్కడ తమ ఆచార వ్యవహారాలను, జీవితాన్ని వివరించారన్నారు. పని చేసే అధికారులకు గుర్తింపు ఇస్తాననిఅంతర్జాతీయ పులుల దినోత్సవాన అధికారులకు మాటిస్తున్నానని పవన్ కళ్యాన్ తెలిపారు.
శ్రీశైలం నుంచి శేషాచలం వరకూ అటవీ కారిడార్
పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాన్ చెప్పారు. నల్లమల శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుందామన్నారు. వేటగాళ్లను ఉపేక్షించవద్దన్నారు. ప్రకృతి పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని అభినందిస్తూ రస్కిన్ బాండ్ రాసిన కవితను డిప్యూటీ సీఎం చదివి వినిపించారు.